ఆంధ్రప్రదేశ్

andhra pradesh

GANESH IMMERSION: ఈ ఏడాది వినాయక నిమజ్జనం ఎక్కడ..?

By

Published : Aug 25, 2021, 10:12 AM IST

Updated : Aug 25, 2021, 10:26 AM IST

హైదరాబాద్​లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్​ నిమజ్జనోత్సవంపై రెండేళ్లగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం వద్దంటున్నా.. జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు.

హైకోర్టు
హైకోర్టు

హైదరాబాద్​ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేష్‌ నిమజ్జనోత్సవంపై అనిశ్చితి నెలకొంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై రెండేళ్లగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించలేదు. ఈ ఏడాది నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశిస్తే, పరిస్థితి ఏంటనేదానిపై మల్లగుల్లాలు పడుతున్న సర్కారు, తుది నిర్ణయం కోసం ఈనెల 28న ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.

మహానగరంలో గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని విగ్రహాలను ప్రతిష్ఠించాక 11వ రోజు పెద్దఎత్తున నిర్వహిస్తారు. నగరంలో చిన్నా, పెద్దా విగ్రహాలు కలిపి 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో లక్షకుపైగానే హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. 5 నుంచి 40 అడుగుల విగ్రహాల్లో అధికం సాగర్‌కే వస్తుంటాయి. నగరవ్యాప్తంగా మరో 40 చెరువుల్లోనూ కలుపుతుంటారు.

హైకోర్టును ఆశ్రయించిన పర్యావరణ ప్రేమికులు

నిమజ్జనంతో సాగర్‌ జలాలు కలుషితమవడమే కాకుండా పర్యావరణ పరమైన సమస్యలు తలెత్తుతున్నాయంటూ కొందరు రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం జలవనరులను కలుషితం చేయొద్దని, ప్రత్యామ్నాయాలు వెతకాలని ఆదేశించింది. అయినా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనంటూ మళ్లీ తలుపుతట్టారు. ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఏదీ ప్రత్యామ్నాయం!

సెప్టెంబరు 10న వినాయచవితి, 21వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుంది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశిస్తే పరిస్థితి ఏంటన్నది అర్థం కావడంలేదు. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదీ రూపొందించలేదు. కర్ణాటకలో విజయవంతమైన మినీ నిమజ్జన కొలనులను నగరంలో 150 చోట్ల నిర్మించాలని రెండేళ్ల కిందట నిర్ణయించి 30 మాత్రమే నిర్మించారు. మహానగరంలో 185 చెరువులున్నాయి. వాటి వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారా అంటే అదీ లేదు. ‘ఈ ఏడాదికి పరిమితంగా అయినా సాగర్‌లో నిర్వహించి, వచ్చే ఏడాది నుంచి నిలిపేస్తే సరిపోతుంది. ఈమేరకు హైకోర్టు అనుమతి తీసుకుంటే బాగుంటుంది. ఈ ఏడాది సాగర్‌లో నిమజ్జనాన్ని నిలిపేస్తే ఇబ్బందులు తప్పవు’ అని బల్దియా ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

ఈనెల 28న తుది నిర్ణయం..

ఈనెల 28న గణేష్‌ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై నగర పరిధి మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశాం.హైకోర్టు వ్యాఖ్యలపైనా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. నిమజ్జనోత్సవం నాటికి అన్ని చెరువుల వద్ద సౌకర్యాలు కల్పిస్తాం. - తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి

ఇదీ చూడండి:TS News: గణేష్ నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయమేంటి?: తెలంగాణ హైకోర్టు

Last Updated : Aug 25, 2021, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details