Telangana Police Recruitment 2022: Telangana Police Recruitment 2022: పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 26 వరకు గడువు పొడిగిస్తూ పోలీస్ నియామక సంస్థ ప్రకటన వెలువరించింది. నిజానికి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ రాత్రి 10గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇవాళ యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి మరో రెండేళ్లు పొడిగిస్తూ సర్కారు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలోనే మూడేళ్లు పొడిగించిన ప్రభుత్వం... తాజాగా మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా యూనిఫామ్ సర్వీసు ఉద్యోగాలకు వయో పరిమితి ఐదేళ్లు సడలింపు ఇచ్చినట్లైంది. అయితే వయో పరిమితి పెంచినా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవాళ రాత్రి వరకు ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. దీంతో ఈనెల 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తు పోలీసు నియామక మండలి నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో నిరుద్యోగ యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతోన్నాయి.