ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు ఒడిశా సీఎంతో జగన్‌ భేటీ

వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టులకు భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుకు సహకరించాల్సిందిగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కోరనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లో నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమవుతున్నారు.

నేడు ఒడిశా సీఎంతో జగన్‌ భేటీ
నేడు ఒడిశా సీఎంతో జగన్‌ భేటీ

By

Published : Nov 9, 2021, 4:55 AM IST

వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టులకు భూసేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాల అమలుకు సహకరించాల్సిందిగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కోరనున్నారు. ఆయన మంగళవారం సాయంత్రం భువనేశ్వర్‌లో నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమవుతున్నారు.

నేరడి బ్యారేజీ, జంఝావతితో పాటు, కొఠియా గ్రామాల సమస్యపై చర్చించనున్నారు. ఒడిశా సీఎంతో భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ‘‘నేరడి బ్యారేజీ వల్ల ఉభయ రాష్ట్రాలకు చేకూరే ప్రయోజనాలను నవీన్‌ పట్నాయక్‌కు జగన్‌ వివరిస్తారు. బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాలో 103 ఎకరాలు అవసరమని, దానిలో 67 ఎకరాలు రివర్‌బెడ్‌ ప్రాంతమేనని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బ్యారేజీ నిర్మిస్తే ఒడిశా వైపు కూడా సుమారు 5-6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరందుతుందని చెప్పారు...’’ అని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘జంఝావతి ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం రబ్బర్‌డ్యాం ఆధారంగా సాగునీరు అందజేస్తున్నాం. 24,640 ఎకరాలకుగాను కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నాం. ప్రాజెక్టును పూర్తి చేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, ఆరు గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. ఒడిశాలో దాదాపు 1,174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. దానిలో 875 ఎకరాలు ప్రభుత్వ భూమే. ఈ విషయాలను నవీన్‌ పట్నాయక్‌తో భేటీలో జగన్‌ వివరిస్తారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకు సహకరించాలని కోరతారు’’ అని వివరించింది. ‘‘కొఠియా గ్రామాల వివాదం, ఇటీవల అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 21 కొఠియా గ్రామాల్లో... 16 ఆంధ్రప్రదేశ్‌తోనే ఉంటామని తీర్మానాలు చేసి ఇచ్చాయని, ఇటీవల అక్కడ ఎన్నికలు కూడా నిర్వహించామని తెలిపారు. కొఠియా గ్రామాల్లో దాదాపు 87 శాతం గిరిజనులు ఉన్నారని, వారికి సేవల్లో అవాంతరాలు ఎదురవకుండా చూడాల్సి ఉందని తెలిపారు’’ అని సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నవీన్‌ పట్నాయక్‌, జగన్‌ భేటీ 5 గంటలకు

ముఖ్యమంత్రి జగన్‌ మంగళవారం ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.15 గంటలకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వెళతారు. ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై, మధ్యాహ్నం 3.30కి విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి భువనేశ్వర్‌ వెళతారు. సాయంత్రం 5 గంటలకు నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమవుతారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

ఇదీ చదవండి:

HC: ఆంధ్రా షుగర్స్‌ కొన్న 42 ఎకరాల ఒప్పందం రద్దుపై హైకోర్టు స్టేటస్‌ కో

ABOUT THE AUTHOR

...view details