ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cancer Cases in Telangana : తెలంగాణను కమ్మేస్తున్న క్యాన్సర్

By

Published : Jul 19, 2022, 11:03 AM IST

Cancer Cases in Telangana : తెలంగాణలో క్యాన్సర్‌ మహమ్మారి అత్యంత వేగంగా కోరలు చాస్తోంది. 2022లో క్యాన్సర్‌ బాధితులు 1,09,433 మంది ఉండగా.. 2030 నాటికి వీరి సంఖ్య 2.08 లక్షలు దాటుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. అంటే దాదాపు రెట్టింపు అవుతుంది.

Cancer Cases
క్యాన్సర్

Cancer Cases in Telangana: తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఈ ఏడాది వరకు క్యాన్సర్ బాధితులు రాష్ట్రంలో 1,09,433 మంది ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో.. తల, మెడ, నోటి క్యాన్సర్‌ కేసులు అత్యధికంగా 22.56 శాతం నమోదయ్యాయి. మహిళల్లో వచ్చే రొమ్ము, గర్భాశయ ముఖద్వార, అండాశయ క్యాన్సర్ల కేసులు 30 శాతం వరకూ ఉన్నట్లు వెల్లడైంది. అన్ని రకాల క్యాన్సర్లలో మహిళలకు మాత్రమే వచ్చేవి దాదాపు మూడోవంతు ఉండడం గమనార్హం.

Cancer disease news : ఈ మేరకు భారతీయ ప్రజారోగ్య సంస్థ(ఐఐపీహెచ్‌) తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2020-21లో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రస్తుతం క్యాన్సర్‌ నిర్ధారణ కాగానే ప్రభుత్వానికి తెలియజేసే విధానం లేదు. ఇక నుంచి నిర్ధారణ కాగానే.. అన్ని ఆసుపత్రులూ సర్కార్‌కు నివేదించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు ఐఐపీహెచ్‌(హైదరాబాద్‌) సంచాలకులు ఆచార్య జీవీఎస్‌ మూర్తి ‘ఈనాడు’కు తెలిపారు. ఐసీఎంఆర్‌, గ్లోబల్‌ బర్డన్‌ ఆఫ్‌ డిసీజ్‌ తదితర నివేదికలను క్రోడీకరించి అధ్యయన నివేదిక తయారు చేశామని పేర్కొన్నారు.

కారణాలు ఇవీ..ధూమపానం * మద్యపానం * పాన్‌, గుట్కా వంటివి నమలడం * ఊబకాయం* మానసిక ఒత్తిడి * మర్మావయాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం * ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు * పదే పదే సుఖవ్యాధులు సోకడం * పౌష్టికాహారం లోపించడం *18 ఏళ్లలోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం * ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం * 35 ఏళ్లు దాటాక గర్భధారణ * బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడం * జీవనశైలిలో మార్పులు

మూడు జిల్లాల్లోనే 30 శాతం కేసులు..ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మహమ్మారి తీరును విశ్లేషించారు. ఐసీఎంఆర్‌-ఆరోగ్యశ్రీ గణాంకాలను ఇందుకు ప్రాతిపదికగా చేసుకున్నారు. దీని ప్రకారం.. 2021లో రాష్ట్రంలో కొత్తగా 48,320 క్యాన్సర్‌ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల్లో సుమారు 30 శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఆరోగ్యశ్రీ ద్వారా 2021-22లో రూ.110 కోట్ల వ్యయం..రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్‌ చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ ద్వారా ఏటా రూ.కోట్ల వ్యయం చేస్తోంది. గత ఏడేళ్లలో క్యాన్సర్‌ కేసులు, చికిత్సపై వ్యయం దాదాపు రెట్టింపైంది. 2014-15లో 46,009 కేసులకు చికిత్స అందించగా.. ప్రభుత్వం రూ.68,60,77,972 ఖర్చు చేసింది. 2018-19లో కేసుల సంఖ్య 75,040కి, వ్యయం రూ.103,63,49,178కి పెరిగింది. 2021-22లో 82,335 కేసులకు చికిత్స అందించగా.. ఖర్చు రూ.110,82,80,780గా నమోదైంది. కేసులు, ఖర్చు ఏటేటా పెరుగుతుండడంతో నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.

జీవనశైలిలో మార్పులతో అరికట్టొచ్చు.. "అత్యధిక క్యాన్సర్లను జీవనశైలిలో మార్పుల ద్వారా అరికట్టొచ్చు. కూరగాయల్ని నీటిలో బాగా నానబెట్టి, కడిగి వండాలి. ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. నిల్వ పదార్థాలు, వేపుళ్లు తినడాన్ని తగ్గించాలి. రోజుకు 30-40 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. ఒత్తిడి పెంచుకోవద్దు. రోజుకు కనీసం 6-8 గంటలపాటు నిద్రపోవాలి. ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. సంచార వాహనాల ద్వారా గతేడాది(2021)లో 12 వేల మందిని పరీక్షించగా.. 132 మందిలో క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. వీరిలో రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల బాధితులు ఎక్కువమంది ఉన్నారు. 2022లో ఇప్పటివరకూ 2,662 మందిని పరీక్షించగా.. 50 మందికి క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది." - డాక్టర్‌ జయలత, సంచాలకులు,ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి


ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details