ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీబీఐకి ఎందుకు అప్పగించకూడదు..మంత్రి కాకాణి నిందితుడిగా ఉన్న కేసులపై హైకోర్టు ప్రశ్న

By

Published : Jul 20, 2022, 7:46 AM IST

HIGH COURT: గత ఏప్రిల్​ నెలలో నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆధారాలు చోరీకి గురైన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వ్యవహారంపై వాదనలు ముగిశాయి. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్ రెడ్డి, తదితరులపై పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది.

HIGH COURT
HIGH COURT

HIGH COURT: వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించే వ్యవహారంపై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని 2017లో ఆరోపించిన కాకాణి గోవర్థన్‌రెడ్డి.... అందుకు ఆధారాలున్నాయని పత్రాలు విడుదల చేశారు. అవి నకిలీ పత్రాలని....... ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసు ప్రాపర్టీ నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి మే 13వ తేదీ రాత్రి దొంగతనానికి గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించిన హైకోర్టు..... మంత్రి కాకాణితో పాటు మొత్తం 18 మంది ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. కోర్టులో ఆధారాల చోరి కేసు మాత్రమే కాకుండా.. కాకాణి గోవర్థన్ రెడ్డి, తదితరులపై నెల్లూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఫోర్జరీ కేసును CBIకి ఎందుకు అప్పగించకూడదో చెప్పాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది.

ఇదీ జరిగింది..:నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. నెల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్​ స్థానిక చిన్నబజారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఏప్రిల్​13వ తేదీ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకువెళ్లారు. 14వ తేదీ (గురువారం) ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించగా.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. వెంటనే విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details