ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నకిలీ ఉద్యమాలతో విభజించే ప్రయత్నాలను ఆపాలి'

By

Published : Dec 7, 2020, 9:19 PM IST

అమరావతి రైతుల పోరాటం 356 రోజులకు చేరింది. ఓవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు మూడు రాజధానులకు మద్దతుగా పోటీ దీక్షలు చేస్తున్నా వారి దాడులకు వెరవకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులకు రాజకీయపక్షాలు తమ సంఘీభావం ప్రకటిస్తున్నాయి.

amaravati farmers
amaravati farmers

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పోరాడుతున్న రైతులు ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. ఆదివారం నాడు ఉద్ధండరాయినిపాలెం దీక్షా శిబిరంపై దాడి జరగటంతో ఒక్కసారిగా రాజధానిలో వాతావరణం వేడెక్కింది. మహిళా రైతులపై జరిగిన దాడిని ఖండిస్తూ తుళ్లూరులో రహదారిపైనే ధర్నా నిర్వహించారు. ఆదివారం రాత్రంతా రోడ్డుపైనే నిద్రాహారాలు మాని ఆందోళన నిర్వహించారు. ఇవాళ కూడా ధర్నా కొనసాగింది. మండుటెండను కూడా లెక్కచేయకుండా మహిళలు ఆందోళన చేపట్టారు.

స్వల్ప ఉద్రిక్తత...

నిరసన తెలిపే క్రమంలో కొందరు మహిళలు ఉద్వేగానికి లోనయ్యారు. మరికొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా లేపేందుకు పోలీసులు ప్రయత్నించటం ఉద్రిక్తతకు దారితీసింది. తమను శాంతియుతంగా ఆందోళన చేసుకోనివ్వాలంటూ రైతులు పోలీసు అధికారుల కాళ్లకు మొక్కుతూ నిరసన తెలిపారు. బలవంతంగా పంపాలని చూస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు వెనక్కు తగ్గారు. ఐకాస నేతలతో చర్చించారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్ కుమార్, ఐకాస నేతలతో తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడారు. మహిళా రైతులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఉద్ధండరాయినిపాలెంలోని దీక్షా శిబిరం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.

ఆందోళనలు ఆగవు...

ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్న రాజధాని మహిళలపై ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడికి పాల్పడ్డారని రైతులు ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చి ఓవైపు పోలీసుల లాఠీ దెబ్బలు తింటున్నామని... ఇపుడు అమరావతితో సంబంధం లేనివాళ్లు వచ్చి దాడులు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించినా.. లేకున్నా అమరావతి కోసం తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేశారు.

విభజించే ప్రయత్నం....

తుళ్లూరు దీక్షా శిబిరాన్ని సందర్శించిన తెదేపా నేతలు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్ కుమార్, వంగలపూడి అనిత రైతులకు మద్దతు పలికారు. ప్రశాంతంగా ఉన్న రాజధానిలో ప్రభుత్వం నకిలీ ఉద్యమాలు నిర్వహిస్తోందని వారు ఆరోపించారు. రైతులు తిరగబడితే ఏం జరుగుతుందో దిల్లీలో చూస్తున్నామని.... ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్ఛరించారు. ప్రజలను వర్గాలు, ప్రాంతాలుగా విభజించి వారిలో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని విమర్శించారు. అమరావతి పోరాటం అనేది రైతులకు మాత్రమే సంబంధించినది కాదని... ఐదు కోట్ల ఆంధ్రులదని స్పష్టం చేశారు.

బంద్ కు సంఘీభావం...

కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు అమరావతి రైతులు మద్దతు పలికారు. దేశవ్యాప్తంగా మంగళవారం జరగనున్న బంద్ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు. రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి ఐకాస నేతలు తెలిపారు.

ఇదీ చదవండి

ఏలూరులో పెరుగుతున్న బాధితులు.. ఇవాళ ఒక్కరోజే...!

ABOUT THE AUTHOR

...view details