2nd September 2026 AP News Today Live Updates : విశాఖలో రాత్రి 11 నుంచి ఉ.7 వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : September 2, 2026 at 7:09 AM IST
|Updated : September 2, 2026 at 10:53 PM IST
2nd September 2026 AP News Today Live Updates :విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోఅగ్నివీర్ పథకం కింద ఈ అర్ధరాత్రి నుంచి ఈనెల 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ జరగనుంది.
LIVE FEED
విశాఖలో అగ్నివీర్ పథకం కింద ఆర్మీ నియామక ర్యాలీ
విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోఅగ్నివీర్ పథకం కింద ఈ అర్ధరాత్రి నుంచి ఈనెల 20 వరకు ఆర్మీ నియామక ర్యాలీ జరగనుంది. జిల్లాల నుంచి 10,350 మంది ర్యాలీకి హాజరయ్యే అవకాశం ఉంది. ఆర్‌కే బీచ్ రోడ్డులోని ఎన్‌టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కి.మీ రన్నింగ్ ట్రాక్‌ను అధికారులు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రాత్రి 11 నుంచి ఉ.7 వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్‌టీఆర్ సర్కిల్ వరకు రాకపోకలపై ఆంక్షలు విధించారు.
గుంటూరులో పదోతరగతి బాలిక అదృశ్యంపై హైకోర్టులో విచారణ
గుంటూరులో పదోతరగతి బాలిక అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేపట్టింది. 3 నెలలు గడిచినా బాలిక ఆచూకీ కనుక్కోలేకపోవడంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. ఇందుకు పోలీసుల వైఫల్యమేనని వ్యాఖ్యానించింది. బాలికను గురువారం కోర్టు ముందు హాజరుపరచాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది.
మద్యం కేసు నిందితుడు మహమ్మద్ సైఫ్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ
మద్యం కేసు ఏ10 నిందితుడు సైఫ్ దాఖలు చేసిన లొంగుబాటు పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. 15 రోజుల్లో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డికి సన్నిహితుడిగా సైఫ్ ఉన్నాడని, మద్యం లావాదేవీల్లో అతను కీలకంగా వ్యవహరించాడని ఛార్జ్‌షీట్‌లో సిట్ వెల్లడించింది.
డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో 11 గంటలకుపైగా కొనసాగుతున్న సోదాలు
డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో 11 గంటలకుపైగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రూ.5 కోట్ల విలువైన గల ఆస్తులను అధికారులు గుర్తించారు. 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండితో పాటు రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. లోకనాథంపాటు ఆయన కుమారుడి పేరు మీద 4 ఫిక్స్‌డ్ డిపాజిట్లు, తిరుమల శ్రీనివాసనగర్‌లో ప్లాట్, గొల్లావానిగుంటలో రెండు ఇండ్లతో పాటు వనపాట మండలం పాదిరేడులో ఒక ఇళ్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కల్తీ నెయ్యి కేసులో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్నఅప్పన్న విచారణలో వెల్లడైన పలు అంశాలు ఆధారంగా లోకనాథంపై కేసు నమోదు చేశారు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: పవన్ కల్యాణ్
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఎక్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రధాని, కేంద్రమంత్రులు, సీఎంలు, నేతలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. తనపై చూపిన ప్రేమ, ఆప్యాయతకు ఎంతో కృతజ్ఞుడిని అని పేర్కొన్నారు. ప్రేమ, ఉత్సాహంతో జన సైనికులు తన పుట్టినరోజును జరిపారని, మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవన్నారు. మీతో ఉన్న అనుబంధం తనకు ఎంతో విలువైనదని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకం, బాధ్యత మరింత పెరిగిందని పవన్ వివరించారు.
విశాఖ ఎయిర్‌పోర్టులో వాణిజ్య విమాన సర్వీసుల నిలిపివేత పిల్ కొట్టివేసిన దిల్లీ హైకోర్టు
విశాఖ ఎయిర్‌పోర్టులో వాణిజ్య విమాన సర్వీసుల నిలిపివేత పిల్‌ను దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. సమస్య ఉత్పన్నమైంది విశాఖలో కావున స్థానిక హైకోర్టులో సవాల్ చేయాలని సూచన చేసింది. ఫోరమ్ కన్వీనియన్స్ ప్రాతిపదికన పిటిషన్ కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది.ప్రధాన కార్యాచరణ అంతా ఏపీలో ఉందని సీజే ధర్మాసనం తెలిపింది. భోగాపురం ఎయిర్‌పోర్టుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని,విశాఖ నుంచి విమానాలు నడపాలని విశాఖ వాసి గోపాలకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. కొత్త విమానాశ్రయం విశాఖకు 60 కి.మీ దూరంలో ఉందని, కనెక్టివిటీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతోందని కోర్టు దృష్టికి పిటిషనర్ తెచ్చారు. విశాఖలో బాధితులు ఉన్నందున స్థానిక హైకోర్టు ఆశ్రయానికి దిల్లీ హైకోర్టు అనుమతిచ్చింది.
నషా ముక్త్ భారత్ అభియాన్ రాష్ట్రస్థాయి స్టీరింగ్, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు
నషా ముక్త్ భారత్ అభియాన్ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యకార్యదర్శిగా ఈ కమిటీ పనిచేస్తుంది. ఇందులో సభ్యులుగా ఈగల్ ఐజి, ప్రజారోగ్యకుటుంబసంక్షేమ, టూరిజం, ఉన్నత విద్య, పాఠశాల విద్య, మహిళ శిశుసంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, పంచాయితీ రాజ్, నైపుణ్యాభివృద్ది కమిషనర్లు,డైరక్టర్లు, ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఉంటారు.
ఉంగుటూరులో భారీ చోరీల నిందితుడి అరెస్టు
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని శ్యామ్‌బాబుగా గుర్తించారు. అతని వద్ద నుంచి భారీగా సొత్తును రికవరీ చేశారు. సుమారు రూ.95 లక్షల విలువైన బంగారు నగలు, రూ.60 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఎక్స్‌లో ట్రెండింగ్‌గా వాటర్ టు ఉత్తరాంధ్ర
పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలింపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రజలు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలుపుతున్నారు. 'ఎక్స్' వేదికగా #WaterToUttarandhra హ్యాష్‌ట్యాగ్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో ట్రెండ్ అవుతోంది. నీటి తరలింపు నిర్ణయాన్ని స్వాగతిస్తూ నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో బెయిల్ నిరాకరణ
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితులకు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులోని నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ నాని, బాబూరావు, సాంబయ్య దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా పలు జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
పోలవరాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు : మంత్రి నిమ్మల
పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలవరం పూర్తికాకపోయినా పురుషోత్తపట్నం లిఫ్టు వల్లే ఉత్తరాంధ్రకు నీళ్లు వస్తున్నాయన్నారు. 2019లో చంద్రబాబు సీఎంగా కొనసాగి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. గత ప్రభుత్వ విధ్వంసం వల్ల రాష్ట్రం 300 టీఎంసీల నీటిని నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మవారి మంగళసూత్రం చోరీ కేసులో అర్చకుడి అరెస్టు
గుంటూరు జిల్లా పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రాన్ని అపహరించింది ఆలయ అర్చకుడు రణధీర్‌గా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద నుంచి అమ్మవారి మంగళసూత్రాన్ని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అపర భగీరథుడు సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు అంకుంఠిత దీక్ష వల్లే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు వచ్చాయని మంత్రి అనిత కొనియాడారు. ఆయనను అపర భగీరథుడిగా ప్రజలు కీర్తిస్తున్నారన్నారు. ఒకే ఒక్క ఓటుతో భోగాపురం ఎయిర్‌పోర్టు, స్టీల్ ప్లాంట్, సాగునీరు సాధించుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును నిలిపివేశారని, దైవ సంకల్పంతోనే చంద్రబాబు చేతుల మీదుగా మళ్లీ పనులు ప్రారంభమయ్యాయన్నారు.
ఉత్తరాంధ్రకు చేరిన గోదావరి జలాలు
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెగ్యులేటర్‌ను ఆన్ చేసి ఈ జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేశారు. అనంతరం ఎడమ కాలువలో ప్రవహిస్తున్న గోదారమ్మకు ఆయన ప్రత్యేక జలహారతి ఇచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
పోలవరం ఎడమ కాలువ శిలాఫలకం ఆవిష్కరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ చేరుకున్నారు. అక్కడ మంత్రులు నిమ్మల, అనిత, కొల్లు రవీంద్ర, నారాయణ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం పోలవరం ఎడమ ప్రధాన కాలువ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన రెగ్యులేటర్ ఆన్ చేసి గోదావరి జలాలకు హారతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఈ కాలువ నిర్మాణానికి రూ.4,192 కోట్లు ఖర్చు చేశారు. ఏలేరు, పంపా, తాండవ నదులను దాటుకుంటూ ఈ కాలువ సాగుతుంది. దీని ద్వారా 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. భవిష్యత్తులో సుజల స్రవంతితో అనుసంధానం చేసి 8 లక్షల ఎకరాలకు నీరు అందించనున్నారు.
పల్నాడు జేఎన్టీయూలో వసతిగృహాల ప్రారంభం
పల్నాడు జిల్లా నరసరావుపేట జేఎన్టీయూలో రూ.70 కోట్లతో నిర్మించిన వసతిగృహాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆ తర్వాత పెట్లూరివారిపాలెంలో పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం కానున్నారు. అక్కడి కార్యక్రమాలు ముగిసిన తర్వాత కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని లోకేశ్ దర్శించుకోనున్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్‌తో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఆయన భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై వారు చర్చించారు. ప్రధానంగా ఆదిలాబాద్, మామునూరు సహా ఇతర ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధి గురించి కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు.
కాకినాడ సాంబమూర్తినగర్‌లో వ్యక్తిని హత్యచేసి పరారైన దుండగులు
కాకినాడ సాంబమూర్తినగర్‌లో వ్యక్తిని గంటి గిరిధర్(40) అనే వ్యక్తిని దుండగులు పరారైయ్యారు. హత్యకు సంబంధించిన కారణాలపై వివరాలను మూడో పట్టణ పోలీసులు సేకరిస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఆనం
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో క్రీడా వికాస కేంద్రాన్ని మంత్రి ఆనం రామానారాయణరెడ్డి పరిశీలించారు. క్రీడా ప్రాంగణం ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనపై, నిర్మాణం సమగ్ర చర్చ జరిపారు . నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రం పనులను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకున్నారు. గ్రామీణ క్రీడాకారులకు ఆధునిక శిక్షణ, మెరుగైన వసతులు కల్పనే లక్ష్యంగ ముందుకుసాగుతున్నారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో హరికృష్ణ జయంతి వేడుకలు
కృష్ణా జిల్లా నిమ్మకూరులో హరికృష్ణ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి రామకృష్ణ అక్కడ ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి, హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్, కొల్లిపర లక్ష్మి ఛారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, స్థానిక ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. సభలో జనసేన యువజన విభాగం 'జై కొట్టు' లోగోను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. యువజన విభాగం ఆవిష్కరణను పురస్కరించుకుని పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రత్యేకంగా ఆడియో సందేశాన్ని అందించారు.
గొల్లగుప్పలో విద్యార్థులకు అస్వస్థతపై ఉపముఖ్యమంత్రి పవన్ ఆరా
గొల్లగుప్పలో విద్యార్థుల అస్వస్థత ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటనలో రెండో తరగతి బాలిక మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు అడగగా, 53 మంది అస్వస్థతకు గురయ్యారని, ముందుజాగ్రత్తగా 71 మందికి మలేరియా నివారణ మాత్రలు పంపిణీ చేశామని కలెక్టర్ వివరించారు. మృతి చెందిన బాలిక అస్వస్థతకు గురికాగానే ఆస్పత్రికి తరలించామని, అయితే ఆస్పత్రికి చేరేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కలెక్టర్ తెలిపారు. అస్వస్థతకు గురైన మిగిలిన బాధితుల ఆరోగ్యస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్ పేర్కొనగా, గ్రామస్థులందరికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని పవన్‌కల్యాణ్ ఆదేశించారు. అలాగే అక్కడ పంపిణీ చేసిన మలేరియా మందులను ల్యాబ్‌కు పంపి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సాదిక్ ఖాన్ కస్టడీ పిటిషన్‌పై విచారణ ఈనెల 7కు వాయిదా
నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ కస్టడీ పిటిషన్‌పై విచారణను కాకినాడ మొబైల్ కోర్టు ఈనెల 7కు వాయిదా వేసింది. ఆగస్టు 16న జరిగిన ఘటనలో ఏఈ నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఆత్మహత్యతో పాటు నూకరాజు అల్లుడు జగదీశ్‌రెడ్డి హత్య కేసులోనూ సాదిక్ ఖాన్ నిందితుడిగా ఉండటంతో, అతనిపై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై దర్యాప్తు కొనసాగుతుండగా, పోలీసులు ఆగస్టు 24న సాదిక్‌ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఆగస్టు 25న సర్పవరం పోలీసులు నిందితుడిని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై నిర్ణయాన్ని న్యాయమూర్తి ఈనెల 7కు వాయిదా వేశారు.
కడప కేంద్ర కారాగారం సమీపంలో రిమాండ్ ఖైదీ పరారీ
కడప కేంద్ర కారాగారం సమీపంలో రిమాండ్ ఖైదీ నాగిరెడ్డి,పీటీ వారెంట్‌పై విచారణ జరిపి జైలుకు తీసుకొస్తుండగా పరారైయ్యాడు. ప్రత్యేక బృందాలతో ఖైదీ కోసం రిమ్స్ పోలీసులు గాలిస్తున్నారు.
మన్యం జిల్లాలో ఆధునీకరించిన పట్టణ పోలీస్ స్టేషన్
మన్యం జిల్లాలో ఆధునీకరించిన పట్టణ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ఎస్పీ మాధవరెడ్డి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ ఆదేశం ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించిన ఏస్పీ
శ్రీసత్యసాయి జిల్లాలో ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నిందితుడు అరెస్టు
శ్రీసత్యసాయి జిల్లాలో ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరుకు చెందిన ఈ నిందితుడిని పులి శ్రీనివాసులుగా గుర్తించారు. నిందితుడి నుంచి 84 లక్షల రూపాయల విలువైన 47 తులాల బంగారం, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ మీడియా ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టిన సందర్భంగా వెల్లడించారు.
కాకినాడ: పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ
కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పాల్గొన్నారు.
కల్తీ నెయ్యి కేసులో సీబీఐ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి పలు అంశాలు
కల్తీ నెయ్యి కేసులో సీబీఐ దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దర్యాప్తు ఆధారంగా టీటీడీ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీబీఐ సిఫార్సు చేయగా, ఆ సిఫార్సుల ఆధారంగానే టీటీడీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందులో భాగంగా సీబీఐకి అందిన కీలక సమాచారాన్ని అధికారులు ఏసీబీతో పంచుకోగా, ఆ సమాచారం ఆధారంగానే టీటీడీ డిప్యూటీ ఈవో నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.
డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో సోదాలపై ఏసీబీ డీఎస్పీ మీడియా సమావేశం
తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై కేసు నమోదు చేసి, నెల్లూరు ఏసీబీ కోర్టు ద్వారా సెర్చ్ వారెంట్ తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నామని, ఇప్పటివరకు జరిపిన తనిఖీల్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి డిప్యూటీ ఈవో స్థాయికి వెళ్లిన లోకనాథంకు చెందిన తిరుమలలోని కార్యాలయంలో కూడా సోదాలు చేస్తామని, ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల రాకతో సువర్ణ అధ్యాయం మొదలైంది: మంత్రి కొల్లు
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల రాకతో సువర్ణ అధ్యాయం మొదలైందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, హంద్రీనీవా ద్వారా రాయలసీమలో కుప్పం వరకు కృష్ణా జలాలు తరలించారని మంత్రి అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు అందించారని అన్నారు. 2027లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితమిచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు ఫోన్
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు ఫోన్ చేసి, ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని చూపిన అభిమానం, అందిస్తోన్న ప్రోత్సాహం మరువలేనిది: పవన్
ప్రధాని చూపిన అభిమానం, అందిస్తోన్న ప్రోత్సాహం మరువలేనిదని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ప్రధాని ప్రోత్సాహం మరింత నిబద్ధతతో సేవ చేసేందుకు తనలో కొత్త ఉత్సాహం నింపుతోందని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రధాని నిరంతరం శ్రమిస్తున్నారని, మోదీ నాయకత్వం దేశానికే స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మోదీ మార్గదర్శకత్వంలో ఏపీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాము నిరంతరం కృషిచేస్తామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.
పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనసేనాని, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌కల్యాణ్ ఎంతో ప్రజాదరణ పొందిన నాయకుడని, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అందిస్తోన్న సుపరిపాలనను ఆయన ముందుండి నడిపిస్తున్నారని ప్రధాని కొనియాడారు. అలాగే పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ, సమాజ సేవలో నిరంతరం కొనసాగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల రాకతో సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుంది: నిమ్మల
ఉత్తరాంధ్రకు గోదావరి జలాల రాకతో సువర్ణ అధ్యాయం ప్రారంభం కానుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిన్నటివరకు ఉపాధి కోసం ఉత్తరాంధ్ర నుంచి యువత వలసలు వెళ్లారని, కానీ నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను, పరిశ్రమలను చంద్రబాబు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో హంద్రీనీవా ద్వారా కుప్పం వరకు, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కృష్ణా జలాలు తీసుకెళ్లామని వివరించారు. అదే విధంగా నేడు ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకొచ్చామని, 2027లో పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన
మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, అలాగే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హతను 40 శాతానికి పరిమితం చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు మ్యాథ్స్, సైన్సు టీచర్లకు వారి సబ్జెక్టుకు మాత్రమే పరీక్షను పరిమితం చేయాలని కోరారు. అయితే ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఉపాధ్యాయులు రోడ్డు పక్కన నిలబడి తమ నిరసనను తెలియజేశారు.
బీజేపీ జాతీయనేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌కు కీలక బాధ్యతలు
బీజేపీ జాతీయనేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌కు పార్టీలో కీలక బాధ్యతలు లభించాయి. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు నిర్వహించనున్న 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమాల దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా ఆయన నియమితులయ్యారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
పవన్‌కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: పల్లా శ్రీనివాసరావు
పల్లా శ్రీనివాసరావు పవన్‌కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో పవన్ నాయకత్వం ఎంతో ప్రేరణగా నిలుస్తోందని, భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు: మంత్రి దుర్గేశ్
జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి దుర్గేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జన్మదినం పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసైనికులు, వీర మహిళలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పవన్‌కల్యాణ్ ఆలోచనలు సమాజంలో మరిన్ని మార్పులకు నాంది పలకాలని, ఆయన ఆశయాలు మరెన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. అలాగే పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మంత్రి దుర్గేశ్ ఆకాంక్షించారు.
అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: లోకేశ్
అన్ని రంగాల్లో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలను మళ్లించి ఉత్తరాంధ్రకు అందిస్తున్నామని, ఇందులో భాగంగా పోలవరం ఎడమ కాల్వ ద్వారా వచ్చే గోదావరి జలాలను ఇవాళ సీఎం విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. పోలవరం కుడి కాల్వ ద్వారా ఇప్పటివరకు 500 టీఎంసీలను రైతులు వినియోగించుకున్నారని, అదే తరహాలో ఇకపై పోలవరం ఎడమ కాల్వ ద్వారా కూడా సాగుకు నీరు అందుతుందని వివరించారు. పోలవరం ఎడమ కాల్వ ప్రారంభం అంటే ఉత్తరాంధ్ర రైతుల అభివృద్ధి ఆరంభమేనని, సమగ్రాభివృద్ధి, సర్వతోముఖాభివృద్ధి సాధించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు.
కాకినాడ జిల్లా గురజానపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ప్రమాదం
కాకినాడ జిల్లా గురజానపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందుభాగాలు దెబ్బతినగా, ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సుల్లోని ప్రయాణికులందరూ చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ తనిఖీలు
ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇల్లు, బంధువుల నివాసాలలో ఏసీబీ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. తిరుపతి, తిరుమల, ఏర్పేడు మండలంలోని పలు ప్రాంతాలలో జరిగిన ఈ సోదాలలో కోట్లలో ఆస్తులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ఏర్పేడు మండలం తెళ్లూరులోని లోకనాథం సోదరుడు ఇంట్లో సోదాలు
ఏర్పేడు మండలం తెళ్లూరులోని లోకనాథం సోదరుడు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో ఆస్తులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
గొల్లగుప్పలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి సత్యకుమార్‌కు అధికారుల నివేదిక
గొల్లగుప్పలో విద్యార్థులకు అస్వస్థతపై అధికారుల నుంచి మంత్రి సత్యకుమార్ నివేదిక అందుకున్నారు. ప్రస్తుతం 52 మంది భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు, వారికి మలేరియా ఆర్‌డీటీ పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. పాజిటివ్‌గా తేలిన వారందరికీ యాంటీ మలేరియా చికిత్స ప్రారంభించామని, చికిత్స పొందుతున్న వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మంత్రికి వివరించారు. ముందుజాగ్రత్తగా ఉత్తమ వైద్యం కోసం దగ్గర్లోని ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చామని అధికారులు పేర్కొనగా, వైద్య సేవలు నిరంతరం కొనసాగించాలని, మెరుగైన చికిత్స అందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు.
అసలైన క్రెడిట్ చోరులు గొడ్డలి పార్టీ వాళ్లే: మంత్రి పార్థసారథి
పాయకరావుపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి పార్థసారథి అసలైన క్రెడిట్ చోరులు గొడ్డలి పార్టీ వాళ్లేనని విమర్శించారు. వైఎస్సార్సీపీ కారణంగానే పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ఆ పార్టీ విధ్వంసపాలనతోనే ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రాజెక్టులన్నీ వాళ్లే నిర్మించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు.
హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నా: చంద్రబాబు
హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు నివాళులర్పించారు. హరికృష్ణ సినీ జీవితంలో, రాజకీయ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేశారని, ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ తాను నివాళులర్పిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులర్పిస్తున్నా: లోకేశ్
హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా లోకేశ్ ఆయనకు ఘననివాళులర్పించారు. చెదరని చిరునవ్వు, ఆత్మీయత హరికృష్ణ మావయ్య సొంతమని, ఆయన నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారని లోకేశ్ పేర్కొన్నారు
ఉపముఖ్యమంత్రి పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
ఉపముఖ్యమంత్రి పవన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పక్షపాతిగా పవన్‌కల్యాణ్ సేవలు అభినందనీయమని, సనాతన ధర్మ పరిరక్షణలో ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకమని మాధవ్ పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో పెద్దపులి సంచారం
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తోంది. తెల్లవారుజామున సింగనపల్లి వద్ద పెద్దపులి గోదావరి దాటింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఉత్తరాంధ్రకు రాత్రే చేరుకున్న గోదావరి జలాలు
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రాత్రే చేరుకున్నాయి. పాయకరావుపేట సమీపంలోని పోలవరం ఎడమ కాల్వ క్రాస్ రెగ్యులేటర్ ప్రాంతానికి జలాలు వచ్చాయి. కాలువ ద్వారా సాగు, తాగునీటిని తరలించే క్రమంలో స్థానిక రైతుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. తూ.గో., అనకాపల్లి, విశాఖ జిల్లాల పరిధిలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. తాజాగా పాయకరావుపేట ప్రాంతంలోని క్రాస్ రెగ్యులేటర్ వద్దకు నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీటి చేరికతో కాల్వ నిర్మాణ పనుల పురోగతి వచ్చింది. ఆయకట్టు భూములకు సాగునీటి కష్టాలు తీరతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రవాహాన్ని పరిశీలిస్తూ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. గోదావరి జలాల రాకతో పాయకరావుపేట పరిసర ప్రాంతాలు జలకళ సంతరించుకున్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ తనిఖీలు
తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేసింది. తిరుపతిలోని పెదకాపు లేఔట్‌లో లోకనాథం ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తిరుమలలోని డిప్యూటీ ఈవో వసతిగృహం వద్ద ఏసీబీ సోదాలు జరుపుతోంది. 7 బృందాలుగా ఏర్పడి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు సీఎం కంకణం కట్టుకున్నారు : మంత్రి స్వామి
గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేందుకు సీఎం కంకణం కట్టుకున్నారని మంత్రి స్వామి అన్నారు. "పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు నీటి విడుదల చారిత్రాత్మకం. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు పెట్టలేని దుస్థితి. కూటమి పాలనలో వ్యవసాయరంగం, సాగునీటి రంగానికి మహర్దశ వచ్చింది." అని డీఎస్‌బీవీ స్వామి అన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ నజీర్
గవర్నర్ నజీర్ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవచేయాలన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఉప ముఖ్యమంత్రి పవన్‌కు సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "మిత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. పవన్‌కల్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నా. పంచాయతీరాజ్ శాఖలో అనేక సంస్కరణలతో పెనుమార్పులు తెస్తున్నారు. గిరిజన ప్రజల కష్టాలు తీర్చేలా రోడ్ల నిర్మాణం, పచ్చదనం ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి. ప్రజలకు కూటమి ఇచ్చిన మాటను నిజం చేసేలా అనునిత్యం కృషి చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి." అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు: మంత్రి లోకేశ్
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు."సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య. పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు" అని లోకేశ్ అన్నారు.
పోలవరం జిల్లాలో అస్వస్థత ఘటనపై మంత్రి సంధ్యారాణి సమీక్ష
పోలవరం జిల్లాలో అస్వస్థత ఘటనపై మంత్రి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ప్రారంభోత్సవంతో చంద్రబాబు మరో కల సాకారమైంది : లోకేశ్
పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ప్రారంభోత్సవంతో చంద్రబాబు మరో కల సాకారమైందని లోకేశ్ అన్నారు."గోదావరి జలాలు ఉత్తరాంధ్రలోని భూములను సస్యశ్యామలం చేయనున్నాయి. సాగునీటి అవసరాలతో పాటు ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నిబద్ధతకు నిదర్శనం." అని లోకేశ్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
దేవదాయశాఖపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆలయాల కోసం ప్రతిపాదిత స్థలాలను త్వరగా ఖరారు చేస్తే నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను ఆలయ నిర్మాణాలు, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో 4 వేల 192 ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎంకు టీటీడీ ఈవో వివరించారు. ఇప్పటికే 967 ఆలయాల నిర్మాణం పూర్తయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార ప్రాంతాలు, బలహీన వర్గాల నివాసాలతో పాటు సాధారణ ప్రాంతాల్లోనూ 3 కేటగిరీలుగా ఆలయాలను నిర్మించేలా ప్రణాళిక ఉందన్నారు.
తెనాలిలో చెక్క పాలిష్ వ్యాపారి కిడ్నాప్, హత్య కలకలం
తెనాలిలో చెక్క పాలిష్ వ్యాపారి కిడ్నాప్, హత్య కలకలం సృష్టించింది. దీప్తి అనే మహిళతో కోటి నాగవీరయ్య సహజీవనం చేస్తున్నారు. కోటి నాగవీరయ్య కనిపించట్లేదని దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 29న తెనాలి సమీపంలోని సోమసుందరపాలెంవద్ద నాగవీరయ్య కిడ్నాప్ అయ్యారు. దీప్తి విషయం ఇంట్లో తెలిసి భార్యతో కోటి నాగవీరయ్యకు గొడవ జరిగింది. కోటి లింగయ్యను కిడ్నాప్ చేసి భయపెట్టాలని కోటి నాగవీరయ్య బావమరిది నలుగురికి సుపారీ ఇచ్చాడు. ఆగస్టు 29న కారులో వచ్చి నాగవీరయ్యను అడ్డగించి సుపారీ గ్యాంగ్ కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన అనంతరం కారులోనే కొట్టడంతో దెబ్బలకు కోటి నాగవీరయ్య మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కోటి నాగవీరయ్య బావమరిది రాజేష్ ఉన్నారు.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
తిరుమలలో టోకెన్లు లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 78,310 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి రూ.4.58 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. శ్రీవారికి నిన్న 34,573 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
నేటి నుంచి మంగళగిరి విద్యాభవన్ ఎదుట టీచర్ల నిరవధిక ధర్నా
నేటి నుంచి మంగళగిరి విద్యాభవన్ ఎదుట టీచర్లు నిరవధిక ధర్నా చేయనున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత 40 శాతానికి పరిమితం చేయాలంటున్నారు. మ్యాథ్స్ సైన్సు టీచర్లకు వారి సబ్జెక్టుకు మాత్రమే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హరికృష్ణ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా : నందమూరి రామకృష్ణ
హరికృష్ణ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నానని నందమూరి రామకృష్ణ అన్నారు. "మీతో పంచుకున్న తీపి జ్ఞాపకాలు మా హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. మా ప్రతి అడుగులోనూ మీరు మాకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు" అని నందమూరి రామకృష్ణ అన్నారు.
నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 2.20 గం.కు చంద్రబాబు పాయకరావుపేటకు చేరుకోనున్నారు. పోలవరం ఎడమ కాలువ రెగ్యులేటర్ వద్ద గోదావరి జలాలకు సీఎం జలహారతి ఇవ్వనున్నారు. రెగ్యులేటర్ ఆన్ చేసి అధికారికంగా ఉత్తరాంధ్రకు నీటిని విడుదల చేయనున్నారు. పాయకరావుపేట బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగం చేయనున్నారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లిస్తానన్న హామీని నెరవేర్చారు. ఎడమ కాలువ ద్వారా 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందనుంది. పంపా, తాండవ, వరాహ, శారద నదులపై అక్విడెక్టులు, సైఫన్ల నిర్మాణం పూర్తి చేశారు. పంపా నదిపై 30 మీటర్ల లోతులో 312 పైల్స్‌తో భారీ అక్విడెక్ట్ నిర్మాణం చేశారు. తాండవ నదిపై 6 వెంట్లతో 447 మీటర్ల పొడవున అక్విడెక్ట్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఎడమ కాలువ నిర్మాణం కోసం రూ.4,192 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. అనకాపల్లిలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 110 చెరువులకు నీటి సరఫరా కానుంది. పుష్కర, ఏలేరు, పంపా, తాండవ ఆయకట్టు కింద భూముల స్థిరీకరణ జరగనుంది. విశాఖ, అనకాపల్లి పారిశ్రామిక అవసరాలకూ గోదావరి జలాలు వినియోగించనున్నారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు గోదావరి నీరు అందనుంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మొత్తం 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక చేశారు.
గొల్లగుప్పలో రెండో తరగతి విద్యార్థిని జమున (7) మృతి
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో రెండో తరగతి విద్యార్థిని జమున (7) మృతి చెందగా, 53 మంది అస్వస్థతకు గురయ్యారు. మలేరియా నివారణ మాత్రలు వికటించడమే కారణమని గ్రామస్థులు అంటున్నారు. బాధితుల్లో 46 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దవారు ఉన్నారు. గొల్లగుప్పలో నిన్న పెద్దలు, పిల్లలకు కలిపి 71 మందికి వైద్య సిబ్బంది క్లోరోఫిన్ మాత్రలు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ పాఠశాలకు చెందిన 53 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో గ్రామంలో వైద్య సేవలు ముమ్మరం చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
పోలవరం జిల్లా గొల్లగుప్పలో విద్యార్థుల ఆస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష
పోలవరం జిల్లా గొల్లగుప్పలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌తో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 71 మంది విద్యార్థులకు మందులు పంపిణీ చేసి బాధితులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని, ఐటీడీఏ పీవో, ఏఎస్పీలు స్వయంగా పర్యవేక్షించి బాధితులను ఆస్పత్రులకు తరలించారని తెలిపారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇద్దరు విద్యార్థులు చనిపోయారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్ నుంచి 9 మంది సభ్యుల వైద్య బృందాన్ని పంపినట్లు, అలాగే విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడల నుంచి మరికొన్ని ప్రత్యేక వైద్యబృందాలు బయల్దేరాయని కలెక్టర్ వెల్లడించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశిస్తూనే, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం జిల్లా: ఎటపాక మం. గొల్లగుప్పలో ఒకరు మృతి, 53 మందికి అస్వస్థత
పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణ కోసం ఎటపాక మండలం గౌరీదేవిపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది పెద్దలు, పిల్లలకు కలిపి మొత్తం 71 మందికి క్లోరోఫిన్ మాత్రలను పంపిణీ చేశారు. అయితే ఆ మాత్రలు వికటించడంతో అంగన్‌వాడీ, పాఠశాలకు చెందిన 46 మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలతో కలిపి మొత్తం 53 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో రెండో తరగతి చదువుతున్న జమున (7) అనే విద్యార్థిని దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. బాధితులందరినీ వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామంలో వైద్య సేవలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ స్పష్టం చేయగా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ నుంచి నేడు ఉత్తరాంధ్రకు
ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేడు పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ రెగ్యులేటర్‌ను ఆన్ చేసి, అఖండ జలహారతి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు విడుదల కానున్నాయి. తూర్పు కనుమలను తొలచి, క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాలను అధిగమిస్తూ, నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు, అక్విడెక్టుల వంటి అద్భుత నిర్మాణాలతో రూ.4,192 కోట్ల వ్యయంతో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను నిర్మించారు. ముఖ్యంగా ఏలేరు నది బెడ్ లెవల్‌కు దిగువన సైఫన్ ద్వారా, పంపా నది ఎగువ నుంచి అక్విడెక్ట్ ద్వారా మార్గం సుగమం చేస్తూ ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటుకుంటూ ఈ జలాలు ప్రవహిస్తాయి. ప్రస్తుతం వేగంగా జరుగుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనుసంధాన పనుల ద్వారా సమగ్ర ప్రణాళికతో అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎగువ ప్రాంతాలకూ ఈ నీటిని తరలిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి మొత్తంగా 2,87,320 ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మందికి తాగునీరు అందడమే కాకుండా, భవిష్యత్తులో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేట్ నాన్ మైనారిటీ, మైనారిటీ వైద్య, దంత వైద్య కళాశాలల్లోని మేనేజ్‌మెంట్ కోటాతో పాటు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు రేపటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు రూ.11,000 రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఆ గడువులోగా దరఖాస్తు చేసుకోలేకపోతే, రూ.20,000 లేట్ ఫీ కలిపి ఈ నెల 7వ తేదీన కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.