'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో పేదల ఆస్తులను కొట్టేసే కుట్ర- కోర్టులకూ వెళ్లకుండా వైఎస్సార్సీపీ చట్టం' - Land Titling Act
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 29, 2024, 7:10 PM IST
TDP Fire on Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రజలను భయపెడుతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. వివాదాలను సృష్టించి పేదల ఆస్తులను కొట్టేసే కుట్ర పన్నుతోందని ఆక్షేపించారు. టీఆర్వోలకు సర్వాధికారాలు కల్పించడంతో పాటు సివిల్ కోర్టులకు వెళ్లకుండా చేశారని వాపోయారు. సెక్షన్ 5 ప్రకారం టీఆర్వోలుగా ఎవరినైనా నియమించేలా చట్టముందని గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ అనుంగులను టీఆర్వోలుగా నియమించుకుని భూములను కొట్టేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ నేతలు బ్లాక్ మనీతో కొనుగోలు చేసిన భూములను చట్టబద్దం చేసేందుకు ఈ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారని జీవీ ఆరోపించారు.
సెక్షన్ 18 ప్రకారం రాష్ట్రంలో భూ వివాదంలో ఉన్న ఏ కేసు అయినా కచ్చితంగా 3 నెలల్లో ప్రభుత్వానికి తెలియజేయాలంట లేదంటే ఫెనాల్టీ, జైలు శిక్షపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్ 19 ప్రకారం ఆస్తులపై ఏ ట్రాన్సాక్షన్ జరిగినా ప్రభుత్వానికి చెప్పాలంట, చెప్పకుంటే ఆరునెలలు జైలు శిక్ష అంటే ఎలా అని ప్రశ్నించారు. సెక్షన్ 20 ప్రకారం బ్యాంకుల్లో భూములు తాకట్టు పెట్టిన వివరాలు, ఎంత వడ్డీకి ఇచ్చింది కూడా టైటిలింగ్ ఆఫీసర్ కు మూడు నెలల్లో తెలియజేయాలంటున్నారని గుర్తుచేశారు. సెక్షన్ 21 ప్రకారం రాష్ట్రంలో ఉన్న కంపెనీలు బ్యాంకుల్లో ఏ ఆస్తి తాకట్టు పెట్టినా టైటిలింగ్ ఆఫీసర్ కు చెప్పాలంట ఏ ట్రాన్సాక్షన్ జరిగినా తెలియాలంటా ఇవి తగదని మండిపడ్డారు.