ముంపు భూమిలో 'రైల్వే జోన్' ఎలా? - ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 9:05 AM IST
MP Kanakamedala Ravindra Kumar : దక్షిణ కోస్తా రైల్వే జోన్ కోసం ఏపీ ప్రభుత్వం ముంపు భూమి ఇవ్వజూపిందని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. అది అనువైంది కానుందునే వేరేది ఇవ్వాలని చెప్పామని అన్నారు. శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు కావాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని కేంద్రమంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూమిని కేటాయిస్తూ తాము లేఖలు రాసినా రైల్వే శాఖ ముందుకు రాలేదని పేర్కొంది. అసలు జోన్ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు ఏంటి? - కనకమేడల రవీంద్రకుమార్, తెలుగుదేశం ఎంపీ
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాలు భూమి ఒక చెరువు బ్యాక్ వాటర్‌లో ఉంది. అది ముంపు ప్రాంతం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి అనువైంది కాదు. అందువల్ల నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం. - అశ్వనీ వైష్ణవ్, రైల్వేశాఖ మంత్రి