ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రేమ పేరుతో వాలంటీర్​ వేధింపులు - బాలిక ఆత్మహత్యాయత్నం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 11:43 AM IST

Updated : Feb 25, 2024, 6:40 AM IST

Girl Suicide Attempt Due to Volunteer Harassment: వాలంటీర్ వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన అక్క (18), చెల్లి (15)లను అదే గ్రామానికి చెందిన వాలంటీర్ శ్రీకాంత్‌ రెడ్డి ప్రేమ పేరుతో గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ ఇంట ఏడేళ్ల తర్వాత తొలి సంతానం అమ్మాయి పుడితే సరస్వతి పుట్టిందని సంబరపడ్డారు. రెండో కాన్పులో అమ్మాయి అడుగుపెట్టగానే మహాలక్ష్మి అని ఆనందించారు. ఇద్దరినీ బాగా చదివించి నచ్చిన ఉద్యోగాల్లో వారు స్థిరపడితే చూడాలనుకున్నారు. పెద్దమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ తల్లిదండ్రుల కలలకు తగ్గట్టే పదో తరగతిలో మంచి మార్కులతో పాసయి ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించింది. అక్కడ తొలి సంవత్సరం పూర్తవుతున్నప్పుడే వాలంటీరు రూపంలో ఆ ఇంటిని కష్టాలు తలుపు తట్టాయి. చదువుల తల్లిని పనిలోకి వెంట తీసుకెళ్లే స్థితికి తెచ్చాడా కీచక వాలంటీరు. అంతేకాదు.. చిన్నపిల్ల అని చూడకుండా బడికి వెళుతున్న ఇంట్లోని మరో చిన్నారినీ చిదిమేయాలని చూశాడు. ఫలితంగా ఆనందాల గూటిలో ప్రస్తుతం చీకట్లు అలుముకున్నాయి. దీనంతటికీ నా సైన్యమని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్‌ నియమించిన వాలంటీరే కారణం. వాలంటీరు శ్రీకాంత్‌రెడ్డి వేధింపులతో కుటుంబం చితికిపోయింది. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని ఓ కుటుంబం ఆవేదన పిల్లల తల్లిదండ్రుల మాటల్లోనే

ఫోన్‌ నంబరు తీసుకుని వేధింపులు: మా గ్రామంలోనే పెద్దమ్మాయి పదో తరగతి వరకు చదివి 570 మార్కులతో పాసయింది. పెద్దయ్యాక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరునవుతానని చెప్పేది. మొదట నరసరావుపేటలోని ప్రైవేటు కాలేజీలో చేర్చాం. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో చేరేందుకూ దరఖాస్తు చేసింది. అక్కడినుంచి ఫోన్‌ రాగానే వెళ్లి ఎంపీసీలో చేర్పించాం. మెరికల్లాంటి పిల్లలతో పోటీ పడుతూ మంచి గ్రేడ్లు సాధించడంతో సంతోషించేవాళ్లం. అమ్మాయికి ఉపకార వేతనం ఇస్తారంటూ ఆమె వేలిముద్ర వేయించడానికి మా ఊరి వాలంటీరు మా ఇంటికొచ్చాడు. ఓటీపీ పంపాలంటూ ఫోన్‌నంబరు తీసుకున్నాడు. విధుల్లో భాగంగా తీసుకుంటున్నాడని అనుకున్నాం. అప్పటినుంచి ఏవో మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. మా అమ్మాయి మాతో చెప్పి బాధపడింది. పోలీసు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నాడని స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా అతడి అమ్మానాన్నలకు చెబితే సర్దిచెబుతామన్నారు.

వేధింపులు భరించలేక: వేసవి సెలవులు అయిపోయాక మా అమ్మాయి ఇంటర్‌ రెండో సంవత్సరం చదవడానికి ఇడుపులపాయకు వెళ్లింది. అప్పటినుంచి వాలంటీరు.. మా పాపకు ఫోన్లు చేయడం ప్రారంభించాడు. నిన్నే ప్రేమిస్తున్నా నువ్వు లేకుంటే బతకలేనని బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. వేధింపులు పెరిగాయని నంబరు బ్లాక్‌ చేసింది. అయినా స్నేహితుల నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెడుతుండేవాడు. అమ్మాయికి ఫోన్‌ లేకుండా చేద్దామంటే కుదిరేది కాదు. ఆన్‌లైన్‌లో కొన్ని క్లాస్‌లు, ప్రాజెక్టుల వల్ల అలా చేయలేకపోయాం. రాత్రుళ్లు ఫోన్లు చేస్తూ టార్చర్‌ పెడుతుండేవాడు. వేధింపులకు అమ్మాయి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనని రెండు నెలలకే ఇంటికి తీసుకొచ్చేశాం.

మాదే రాజ్యం అంటూ బెదిరింపులు: బాగా చదివే అమ్మాయిని చేలో పనికి తీసుకెళుతుంటే బాధగా ఉంది. అయినా ఏం చేయలేం. బడికి వెళుతున్న మా చిన్నమ్మాయి ద్వారా ఏవో లెటర్లు ఇస్తూ పెద్దమ్మాయికి ఇవ్వాలని బలవంతం పెట్టడం ప్రారంభించాడు. ‘అక్కకు లెటర్‌ ఇస్తావా? లేదా? లేకపోతే నువ్వేరా.. మీ మామ, అమ్మానాన్నలు నన్నేమీ చేయలేరు. ఇక్కడ మాదే రాజ్యం. 30 ఏళ్ల వరకూ మా ప్రభుత్వమే. ఎవరూ ఏమీ పీకలేరు. నేను బాగా చూసుకుంటా..’ అంటూ బుగ్గలు గిల్లుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. వేధింపులు తట్టుకోలేక మా చిన్నపాప ఎలుకల మందు తాగే పరిస్థితికి తెచ్చాడు. ఇప్పుడు ఇలా ఆసుపత్రిలో చేర్చాం. మా పెద్దమ్మాయిని వాలంటీరు వేధిస్తున్నాడని తల్లిదండ్రులకు ఇప్పుడు చెబితే మాపైనే నిందలు వేస్తున్నారు. ఇంట్లో ఇద్దరమ్మాయిలు బాగా ఉన్నప్పుడున్న సంతోషమే వేరు. ఇప్పుడిలా ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఒకరు, చదువు మధ్యలో ఆగి మరొకరు పడుతున్న కష్టాలు చూస్తూ కన్నీరు ఆగడం లేదు. వాలంటీరును కఠినంగా శిక్షించాలి’ అని తల్లిదండ్రులు పేర్కొన్నారు. 

ఎట్టకేలకు పోక్సో కేసు: ప్రతిపక్ష నేతల పోరాటంతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసిన మూడు రోజుల తర్వాత పోలీసులు దిగొచ్చారు. వాలంటీరు శ్రీకాంత్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

Last Updated : Feb 25, 2024, 6:40 AM IST

ABOUT THE AUTHOR

...view details