ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థుల నిధులపై కన్నేసిన జగన్ సర్కార్​ - విద్యా కార్యక్రమాల ప్రచార పేరుతో 4 కోట్లు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 9:59 AM IST

Education Conclave Four Panel Discussion: ఇప్పటికే ప్రకటనల రూపంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న వైఎస్సార్​సీపీ ప్రభుత్వం, సొంత డబ్బాలు కొట్టించుకునేందుకు ఓ ప్రైవేట్ ఛానల్​కు భారీగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధమైంది. విద్యా కార్యక్రమాల ప్రచారం పేరుతో పిల్లల ఫీజుల డబ్బులు 4.20 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇండియా టుడే ఆధ్వర్యంలో తిరుపతిలో నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహించే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ నాలుగు ప్యానెల్ చర్చల కోసం 4.20 కోట్ల రూపాయలు చెల్లించనుంది. సమగ్ర శిక్షా అభియాన్, పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఇంటర్మీడియట్ విద్యామండలి, ఉన్నత విద్యామండలి నిధులను చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

పిల్లల నిధులపై కన్నేసిన జగన్ సర్కార్​ వీటితో టీవీ ప్రచారానికి సిద్ధమైంది. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని గతేడాది నవంబరు 21, 22న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్‍ కు సమయం సర్దుబాటు కావడం లేదంటూ సాధారణ ఎన్నికలు దగ్గరకు వచ్చేలా సమయాన్ని మార్పు చేసింది. తిరుపతిలో రెండు రోజులపాటు ఓ ప్రైవేటు హోటల్లో ఇండియా టుడే - ఎడ్యుకేషన్ కాంక్లేవ్ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు ఇవాళ పాఠశాల విద్యాశాఖ తరపున ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్ ప్యానెల్ చర్చల్లో పాల్గొననున్నారు. రెండో రోజు బుధవారం జరిగే ప్యానల్ చర్చకు సీఎం జగన్ హాజరవుతారు.

ABOUT THE AUTHOR

...view details