ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జాతీయ రహదారుల కోసం జగన్ కేంద్రం మెడలు వంచలేరా?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 7:01 AM IST

YSRCP Government Failure: లోక్‌సభలో ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీ. మొత్తం 31 మంది ఎంపీలు ఉన్నారు. ఇంత బలమున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేంద్రాన్ని మాత్రం ప్రశ్నించలేకపోతోంది. రాష్ట్ర ప్రయోజనాలను సాధించలేకపోతోంది. కేసుల భయంతో ఇప్పటికే విభజన హామీలను గాలికొదిలేసిన జగన్, భారత్‌మాల పరియోజన ప్రాజెక్టులను కేంద్రం ఆపేసినా పట్టించుకోవట్లేదు. మూడు నెలలుగా పనులన్నీ పడకేసినా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పనులు జరిగేలా కనీస ప్రయత్నం చేయట్లేదు.

YSRCP_Government_Failure
YSRCP_Government_Failure

జాతీయ రహదారుల కోసం జగన్ కేంద్రం మెడలు వంచలేరా?

YSRCP Government Failure : రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు నిధులివ్వలేక చేతులెత్తేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెద్దఎత్తున జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేసి, విరివిగా పనులు చేస్తోంది. అయితే భారత్‌మాల పరియోజన పథకం (Bharatmala Pariyojana Project) కింద మంజూరు చేసిన ఎన్‌హెచ్‌ల ప్రాజెక్టులను కేంద్రం గత నవంబరు నుంచి ఆపేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కొత్త పనులు చేపట్టొద్దని పేర్కొంది. దీంతో మన రాష్ట్రంలో మంజూరైన 8 వేల 200 కోట్ల రూపాయల విలువైన 8 కీలక జాతీయ రహదారుల విస్తరణ పనులు ఆగిపోయాయి. కొన్ని డీపీఆర్‌ దశలో, మరికొన్ని టెండర్లు దశలో, మరికొన్ని టెండర్లు పూర్తయి గుత్తేదారులతో ఒప్పందం జరగాల్సిన స్థితిలో నిలిచిపోయాయి. మళ్లీ ఇవి ఎప్పుడు పట్టాలెక్కుతాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది.

National Highway Projects in AP :పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచెర్ల వరకు 50 కిలోమీటర్ల నాలుగు వరుసలుగా విస్తరణకు వెయ్యి 32 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ పనులను రాజేంద్ర సింగ్‌ బేంబూ అనే సంస్థ దక్కించుకుంది. దీనికి ఎల్‌వోఏ ఇచ్చే దశలో ఆగిపోయింది.

నంద్యాల జిల్లాలోని సంగేమశ్వరం నుంచి ఆత్మకూరు వరకు 62.57 కిలోమీటర్ల మేర రెండు వరుసలుగా విస్తరణకు 776 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. బిడ్లు ఖరారయ్యాయి. గుత్తేదారుకు అధికారికంగా బిడ్‌ ఖరారైందని లేఖ ఇస్తే పనులు ఆరంభించాల్సి ఉంటుంది. కానీ ఎల్‌వోఏ ఇవ్వకుండా ఆపేశారు.

నెల్లూరు జిల్లాలో అధ్వానంగా NH-16

శ్రీసత్యసాయి జిల్లాలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు 33.58 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా రహదారి విస్తరణకు 808 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. బిడ్లు వేసిన సంస్థల సాంకేతిక అర్హతలు పరిశీలించే దశలో ఉండగా, వాటిని ఆపేయాల్సి వచ్చింది. నంద్యాల నుంచి కర్నూలు, కడప జిల్లాల సరిహద్దు వరకు 691 కోట్లతో 62 కిలోమీటర్ల మేర రెండు వరుసలుగా విస్తరణకు పిలిచిన టెండర్లలో సాంకేతిక అర్హతలు పరిశీలిస్తుండగా తదుపరి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దంటూ ఆదేశాలొచ్చాయి.

వైఎస్సార్ జిల్లా వేంపల్లి నుంచి ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదగా నంద్యాల జిల్లా చాగలమర్రి వరకు 79 కిలోమీటర్లు కొంత రెండు వరుసలు, మరికొంత నాలుగు వరుసలుగా విస్తరణకు 13 వందల 21 కోట్ల అంచనా వ్యయంతో కొంత కాలం కిందట టెండర్లు పిలిచారు. ఇందులో బిడ్లు వేసిన గుత్తేదారు సంస్థల సాంకేతిక అర్హతలు పరిశీలిస్తుండగానే వాటిని ఆపేయాల్సి వచ్చింది.

జాతీయ రహదారి విస్తరణలో జాప్యం - కొన్నిచోట్ల కిలోమీటర్‌ కూడా పూర్తి చేయని కాంట్రాక్టర్లు

రెండు పనులకు టెండర్లు పిలవగా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో వాటిని పూర్తి చేయకుండా టెండర్ల దాఖలు గడువు పెంచుతూ వెళ్తున్నారు. ఇవి భారత్‌మాల పరియోజన పథకంలో ఉండటమే దీనికి కారణం. విశాఖపట్నం-అరకు మార్గంలో పెందుర్తి నుంచి బౌదార వరకు 40.55 కిలోమీటర్లలో కొంత రెండు వరుసలు, మరికొంత నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌ 935 కోట్లతో మంజూరైంది. వీటికి టెండర్లు పిలిచినా గడువు పదేపదే పెంచుతున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు నుంచి పులివెందుల మీదగా శ్రీసత్యసాయి జిల్లాలో బి.కొత్తపల్లి వరకు 56 కి.మీ. నాలుగు వరుసలుగా విస్తరణకు వెయ్యి 80 కోట్లతో టెండర్లు పిలిచారు. దీని గడువు కూడా ఉద్దేశపూర్వకంగా పదేపదే పెంచుతూ కాలయాపన చేస్తున్నారు.

కృష్ణా జిల్లా పెడన నుంచి నూజివీడు మీదగా ఎన్టీఆర్‌ జిల్లాలో విస్సన్నపేట వరకు 123 కిలోమీటర్లను మూడు ప్యాకేజీలుగా విస్తరించేందుకు సమగ్ర పథక నివేదిక సిద్ధమైంది. దీనికి కేంద్ర రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు పంపిస్తే ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కానీ డీపీఆర్‌ను అప్పుడే దిల్లీకి పంపొద్దని ఆదేశాలొచ్చాయి. దీంతో దాదాపు 16 వందల కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ సిద్ధమైన ఈ రహదారి విస్తరణకు బ్రేక్‌పడింది. డీపీఆర్‌కు ఆమోదం లభిస్తే టెండర్లు పిలిచే ప్రక్రియ మొదలవుతుంది. కానీ డీపీఆర్‌ దశలోనే ఇది ఆగిపోయింది.

YSRCP Government Neglects National Highway Works: జాతీయ రహదారి పనుల్లో జగన్​ సర్కార్​ వెనుకబాటు.. నాలుగేళ్లుగా పూర్తికాని భూసేకరణ

ABOUT THE AUTHOR

...view details