TDP demands a comprehensive inquiry into Subbarao family suicide:వైసీపీ నేతల భూదాహానికి వైఎస్ఆర్ కడప జిల్లాలో చేనేత కుటుంబం బలైపోయిందని విపక్ష నేతలు ఆరోపించారు. మాధవరంలో చేనేత కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలో వేలాది ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని, తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటున్నారని మండిపడ్డారు.
ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన నారా లోకేశ్: వైఎస్‌ఆర్ కడప జిల్లా కొత్తమాధవరంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. సుబ్బారావు పెద్ద కుమార్తె నిత్యతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున 10 లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యపై దర్యాప్తు చేయిస్తామని లోకేశ్ ప్రకటించారు.
ఎంత ప్రమాదమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ దాష్టీకానికి చేనేత కుటుంబం బలి కావడం, పెత్తందారీ పాలనకు నిదర్శనమని, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ ధ్వజమెత్తారు. చట్టబద్ధ పాలనకు పాతరేసి, అరాచకం పెచ్చరిల్లుతుంటే, మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఈ పాలకులను కొనసాగిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సుబ్బారావు కుమార్తెను పరామర్శించిన సంజీవ్, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.