ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో గందరగోళం - జాబితాలో పేర్లు గల్లంతు - చేతులెత్తేసిన ఈసీ - POSTAL BALLOT VOTING ANDHRA PRADESH

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 7:54 AM IST

POSTAL BALLOT VOTING ANDHRA PRADESH: ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్ల పోలింగ్‌లో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైంది. ఓట్లు ఇవ్వకుండా, కనీస సౌకర్యాలు కల్పించకుండా చేతులెత్తేసింది. ఫాం-12 సమర్పించినా జాబితాలో పేర్లు గల్లంతవ్వడంపై పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభం కావడంపై నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఓట్లు చెల్లకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో సమస్యలపై స్పందించిన సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా ఈ నెల 7, 8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

POSTAL BALLOT VOTING
POSTAL BALLOT VOTING (etv bharat)

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో గందరగోళం - జాబితాలో పేర్లు గల్లంతు - చేతులెత్తేసిన ఈసీ (etv bharat)

POSTAL BALLOT VOTING ANDHRA PRADESH: రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల అంశంపై గందరగోళం నెలకొన్న వేళ, ఏకంగా ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలోని ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు గల్లంతవ్వడం చర్చనీయాంశమైంది. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసినా వారి ఓట్లు లేవంటూ గుంటూరు జిల్లా అధికారులు చేతులెత్తేశారు. సీఈవో కార్యాలయంలో పని చేస్తున్న 86 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసినా ఇప్పటి వరకూ అధికారులు వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు జారీ చేయలేదు.

ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గల్లంతు కావటంపై సీఈవో కార్యాలయం ఉద్యోగులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఎన్నికలు నిర్వహించే ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ఉద్యోగులకే, ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాకపోవటం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఉద్యోగులు విమర్శించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్- పోలింగ్ ప్రక్రియ గందరగోళం - POSTAL BALLOT

విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. నివాసముంటున్న చోట ఓటు ఇవ్వకుండా ఎక్కడో దూరప్రాంతాల్లో ఓటు హక్కు కల్పించారని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఫెసిలిటేట్‌ సెంటర్‌ లోపలికి టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్యను రిటర్నింగ్‌ అధికారి అనుమతించలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన సౌమ్య, పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చే హక్కు అభ్యర్థికి ఉన్నా, ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో ఉన్నతాధికారులను సంప్రదించిన ఆర్వో, సౌమ్యను పోలింగ్‌ కేంద్రంలోనికి అనుమతించారు. మచిలీపట్నంలోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటింగ్‌ ప్రక్రియను తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర, వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని పరిశీలించారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్యోగులు బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రానికి ఉద్యోగులు విరివిగా తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కూటమి అభ్యర్థి విజయచంద్ర పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కనీస వసతులు లేకపోవడంతో ఎండలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు గంటల తరబడి ఉద్యోగులు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చింది.

కొనసాగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ - ఆగని వైసీపీ నేతల ప్రలోభాలు - Postal Ballot Voting Andhra Pradesh

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఈ నెల 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్​కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియామవళికి అనుగుణంగా ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో తొలి రోజు పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా విధుల్లో ఉండి, ఇతర జిల్లాల్లో ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్నా పోస్టల్ బ్యాలెట్​కు సంబంధించి ఓటు లేకపోవడంతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్​లో గందరగోళంపై ఎన్నికల సంఘం స్పందించింది. ప్రస్తుతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు రాని ఉద్యోగులు మే 7, 8వ తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఈఓ ముకేశ్‌ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈసీ దృష్టి సారించాలని ఏపీజేఏసీ అమరావతి నేత పలిశెట్టి దామోదర్‌ కోరారు. అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు కల్పించాలన్నారు.

పోస్టల్ బ్యాలెట్​కు మరో రెండు రోజులు గడువు- ఏ ఒక్కరూ ఓటింగ్​కు దూరం కావొద్దు: మీనా - AP CEO Visit Postal Ballot Center

ABOUT THE AUTHOR

...view details