ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెట్రో బాదుడులో రాష్ట్రమే నెంబర్​ 1 - సామాన్యులను పీల్చి పిప్పి చేసిన జగన్​ సర్కారు - Petrol and Diesel Prices

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 10:20 AM IST

CM Jagan Government Petrol and Diesel Prices Increase in AP : రోడ్లు అధ్వానం. విద్యలో అధోగతి. ఆరోగ్యంలోనూ అంతంతే. కానీ ఈ అయిదేళ్లలో ఒక విషయంలో మాత్రం ఆంధ్రావనిది దేశంలోనే అగ్రస్థానం. అదే ప్రజల్ని పిండుకోవటంలో. మరే రాష్ట్రమూ ఊహించనంతగా, మరే సీఎం సాహసించనంతగా, ఎవ్వరైనా సరే ముక్కున వేలేసుకునేంతగా పెట్రో ఛార్జీలను ప్రజలు ముక్కుపిండి వసూలు చేశారు జగన్. తగ్గించుకునే అవకాశమున్నా, కేంద్రం దారి చూపినా, పన్నులు తగ్గించకపోగా అదనపు వ్యాట్​ వేసి ప్రజల్ని పీల్చిపిప్పి చేశారు జగన్​!

jagan_petrol
jagan_petrol

పెట్రోలు, డీజిల్​ ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ - అయిదేళ్లలో సామాన్యులను పీల్చి పిప్పి చేసిన జగన్​ సర్కారు

CM Jagan Government Petrol and Diesel Prices Increase in AP : కేంద్రం సహా పలు రాష్ట్రాలు పన్నులు తగ్గిస్తే వైఎస్సార్సీపీ సర్కారు మాత్రం ఐదేళ్లుగా ఎడాపెడా బాదేస్తోంది. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్​పై లీటరుకు సగటున 10 రూపాయలు వరకు అదనంగా వసూలు చేస్తూ ఇంటింటికీ తిరిగే చిరు వ్యాపారులు, అన్నం పెట్టే రైతుల ఆదాయానికి కత్తెరేస్తోంది. చాలిచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకునే చిరుద్యోగులు కార్లు, ఆటోలు, లారీలు నడుపుతూ కుటుంబాలను నెట్టుకొచ్చే వారి జేబుల్ని కొల్లగొడుతోంది. గత టీడీపీ పాలనలో పన్నుల రాబడితో పోలిస్తే వైఎస్సార్సీపీ సర్కారులో రాబడి ఏకంగా రూ. 24 వేల కోట్ల వరకు పెరగడమే దీనికి నిదర్శనం. పెట్రోల్​ అమ్మకాల్లో పెరుగుదల 2.77% మాత్రమే ఉండగా రాబడి మాత్రం 52% పైగా పెరిగింది. ఇది పేదల పక్షపాతినంటూ చెప్పే జగన్‌ పాలనలో దోపిడీ తీరుకు దర్పణం పడుతోంది.

నడ్డివిరిచిన జగన్‌ ప్రభుత్వం :టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్రోల్​ ఉత్పత్తులపై ఐదేళ్లలో వచ్చిన రాబడితో పోలిస్తే వైఎస్సార్సీపీ వచ్చాక 52% అధికంగా రూ.23,866 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో అత్యధిక పన్ను వసూళ్లు దీనికి ప్రధాన కారణం. పెట్రో ధరల పెంపునకు అనుగుణంగా పన్ను రాబడి పెరగడమూ మరో కారణంగా ఉంది.

  • 2014-15 నాటి పన్నుల రాబడితో పోలిస్తే 2018-19 నాటికి పెరుగుదల 22.95% మాత్రమే. అదే 2018-19 నుంచి 2022-23 నాటికి 52.39% పెరిగింది. కర్ణాటకలో అయిదేళ్లలో 28.02 శాతం, తమిళనాడులో 33.99 శాతం మాత్రమే పెరుగుదల ఉంది.
  • 2014-15 సంవత్సరంతో పోలిస్తే 2018-19 నాటికి ఆంధ్రప్రదేశ్​లో పెట్రో ఉత్పత్తుల అమ్మకాల్లో 24.74% వృద్ధి నమోదైంది. 2018-19 సంవత్సరంతో పోలిస్తే 2022-23 నాటికి కేవలం 2.17% మాత్రమే పెరుగుదల కనిపించింది. అంటే 22% పైగా అమ్మకాలు తగ్గిపోయాయి. అయినా పన్నుల రూపంలో బాదేయడంతో రాబడి 23,866 కోట్లు రూపాయలు పెరగడం గమనార్హం.

భారం వేసింది రాష్ట్ర ప్రభుత్వమే :లీటరు పెట్రోలు అమ్మకంపై కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చే మొత్తం రూ.20 లోపే అని గణాంకాలు చెబుతున్నాయి. అదే పెట్రోలుపై జగన్​ సర్కారు ప్రభుత్వం లీటరుకు రూ.30 వరకు పిండుతోంది. వినియోగదారులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో కాస్త వెనక్కు తగ్గి తమ పన్నుల వాటా లీటరుపై రూ.33 నుంచి రూ.20కి తగ్గించింది. కానీ జగన్‌ మాత్రం పైసా కూడా తగ్గించేది లేదంటూ భీష్మించారు సరికదా? ఎందుకు తగ్గించారంటూ కేంద్రంపైనే పెడబొబ్బలు పెట్టారు.

టీడీపీ అధికారంలోకి రాగానే డీజిల్, పెట్రోల్‌ ధరలు తగ్గిస్తాం: నారా లోకేశ్‌

ఐదేళ్లకు రూ.60 వేలు అదనం :రాష్ట్రంలోజగన్‌ సర్కారు బాదుడుకు బెదిరిపోతున్న బాధితవర్గాలు ఎన్నో. నిరుపేదల నుంచి పారిశ్రామివర్గాల వరకు అందరినీ పెట్రో మోత మోగిస్తోంది.ఇంటింటికీ తిరిగి పండ్లు, కూరగాయలు, సామాన్లు అమ్ముకునే చిరువ్యాపారులకు రోజుకు సగటున 4 లీటర్ల పెట్రోల్​ వినియోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై ఇతర రాష్ట్రాల్లోని పెట్రోల్​ ధరల కంటే రోజుకు 40 రూపాయలకి పైగా చెల్లిస్తున్నారు. జగన్​ సర్కారు సగటున ఐదేళ్లలో రూ.60 వేలు లాగేసుకున్నారు.

అన్ని రాష్ట్రాల్లో తగ్గినా :ఇంధన ఉత్పత్తులపై పన్నుల ద్వారా చేసే వసూళ్లలో వైఎస్సార్సీపీ సర్కారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే అగ్రభాగాన ఉందని అధ్యయాలను చెబుతున్నాయి. 2022 డిసెంబరు వరకు కేంద్ర పన్నులే అధికంగా ఉండేవి. తర్వాత కేంద్రం తమ పన్నుల రేటును లీటరు పెట్రోలుపై రూ.32.80 నుంచి రూ.19.90 చేసింది. అంటే లీటరుపై రూ.12.90 తగ్గించింది. లీటరు డీజిల్‌పై రూ.31.80 నుంచి రూ.15.80కి తగ్గించింది. అంటే రూ.16 తగ్గింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం అప్పుడూ, ఇప్పుడూ అదే బాదుడును కొనసాగిస్తూనే ఉంది.

ఒకటో తేదీ ఊరట- తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర- ఎంతంటే? - Gas Price Reduced

ఏపీ పొరుగు రాష్ట్రాలైనా కర్ణాటక, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాలు కూడా తమ పన్నుల్ని తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చాయి. ఏపీలో పైసా కూడా తగ్గించలేదు. కేంద్రం పన్నుల్ని తగ్గిస్తే రాష్ట్ర ఆదాయం పోతుందంటూ శోకాలు పెట్టింది. ఫలితం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయి.

అవకాశం ఉంటే, సరిహద్దులకే :కర్ణాటక సరిహద్దుకు వెళ్దామా? పుంగనూరు కంటే లీటరు పెట్రోల్​ 10 రూపాయలు, డీజిల్​ 11.60 రూపాయలు తక్కువ. తమిళనాడు సరిహద్దుల్లో కొందామా? కుప్పం కంటే లీటరు పెట్రోల్​ 9.03 రూపాయలు, డీజిల్​ 4.57 రూపాయలు తక్కువ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వెళ్తే కాకినాడ జిల్లాలో కన్నా ధర తక్కువ. పల్నాడులోని దాచేపల్లి కంటే సమీపంలోని తెలంగాణ రాష్ట్రంలోనే చౌకగా పెట్రోలు, డీజిల్‌ వస్తాయి. అందుకే సరిహద్దు ప్రాంతాల ప్రజలు ప్రత్యేకంగా ఆ రాష్ట్రాల్లోని బంకులకు వెళ్లి ఇంధనం కొనుగోలు చేస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లు ఇతర భారీ రవాణా వాహనాలైతే సరకు ఎగుమతి, దిగుమతుల కోసం పక్క రాష్ట్రాలకూ వెళ్లినప్పుడు పుల్​ ట్యాంతు చేయించుకుంటున్నారు

" జగన్​ గెలవాక ముందు డీజిల్​ రూ.56 , పెట్రోల్​ రూ.60 ఉండేది. ఈ అయిదేళ్ల డీజిల్​ రూ.100 అయితే ,పెట్రోల్​ రూ.120 వరకు పెరిగిపోయింది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే రూ.8 నుంచి రూ.14 వరకు తేడా ఉంది" -వాహనదారులు

గుంతల రోడ్లకు సెస్సా? : రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా రహదారులన్నీ గుంతలమయం. దీంతో వాహనాలు గుల్లవుతున్నాయి. మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. గుంతల రోడ్లు వల్ల ప్రమాదాలబారిన పడి కొందరు ప్రాణాలనూ కోల్పోతున్నారు. అయినా వైఎస్సార్సీపీ సర్కారు ఎంతమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా రోడ్‌ సెస్‌ పేరుతో పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున(పన్నులు అదనం) అదనంగా బాదేస్తోంది. పన్నులు కూడా కలిపితే సంవత్సరానికి రూ.1,000 కోట్లపైనే దోచుకుంది.

ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? ప్రభుత్వం లెక్క ఇదీ!

ఆ మంట రైతులకూ! :డీజిల్‌ ధరల పెరుగుదలతో ఎకరాకు ట్రాక్టరు 6వేల రూపాయలకు పైగా ఖర్చులు పెరిగాయి. పురుగుమందుల పిచికారీ, కూలీలు, పంట ఉత్పత్తుల రవాణా, డీజిల్‌ ఇంజిన్లతో నీటితడులు, నూర్పిడి ఖర్చులు మరో 2,500 రూపాయల వరకు పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. అంటే అయిదు ఎకరాలు సేద్యం చేసే రైతులపై పెట్రో ఉత్పత్తుల భారమే రూ.40 వేలకు పైగా ఉంది. కేంద్రం, ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ధరల్ని తగ్గిస్తే కొంతైనా రైతులకు ఊరట లభించేది.

నాడు కన్నెర్ర చేశారు :పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో పెట్రోలు, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నాయని ప్రతిపక్షనేతగా జగన్​ అప్పట్లో అసెంబ్లీలో ప్రకటించారు. సభాపతి కోడెల శివప్రసాద్‌పై కన్నెర్ర చేస్తూ మాట్లాడారు. అయితే జగన్​ సర్కార్​లో మాత్రం దేశంలోనే ఎక్కడా లేనంత స్థాయికి పెట్రోలు, డీజిల్‌ ధరల్ని చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details