ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కులగణనపై ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి - సీఎం జగన్​కు పవన్ కల్యాణ్​ లేఖ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 10:17 AM IST

Pawan Kalyan Letter to CM YS Jagan: రాష్ట్రంలో చేపడుతున్న కుల గణనపై సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ ప్రశ్నలు సంధించారు. కులగణన ఉద్దేశం ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందని, గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బిహార్ ప్రభుత్వం చేసిన కులగణన అంశం సుప్రీం పరిధిలో ఉందన్న పవన్‌, తీర్పు రాకముందే సర్వే పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపించారు.

Pawan_Kalyan_Letter_to _CM_YS_Jagan
Pawan_Kalyan_Letter_to _CM_YS_Jagan

Pawan Kalyan Letter to CM YS Jagan: ఎన్నికల ముందు రాష్ట్రంలో కులగణన చేపట్టాలన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్​ ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా లేఖ రాశారు. కుల గణనపై ముఖ్యమంత్రికి ప్రశ్నలు సంధించటంతో పాటు కీలకమైన అంశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందే ఎందుకు వచ్చిందని, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు. సరైన కారణాలు వెల్లడించకుండా ఇలాంటి వివరాలు సేకరించటం ఆర్టికల్ 21 ప్రకారం వచ్చిన వ్యక్తిగత గోప్యత, భద్రత, స్వేచ్ఛ హరించటమేనన్నారు. బిహార్ ప్రభుత్వం చేసిన కులగణనపై సుప్రింకోర్టులో కేసు ఉందని, ఆ తీర్పు రాకముందే కులగణన పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయటం కాదా అని ప్రశ్నించారు.

సంక్లిష్టమైన కులగణన ప్రక్రియను నిపుణులతో కాకుండా ఎలాంటి అర్హతలు ఉన్నాయని వాలంటీర్లతో చేయించాలని చూస్తున్నారో చెప్పాలన్నారు. వాలంటీర్లకు ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయని, ఎలా నిర్ధరించారని ప్రశ్నించారు. కులగణన మీ ఉద్దేశం అయితే ఉపకులం, ఆదాయం, భూములు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదెల వివరాలన్నీ ఎందుకు అని పవన్ నిలదీశారు.

క్రీస్తును అనుసరించే వ్యక్తి ప్రజలను ఇబ్బందులు పెట్టరు - జగన్‌ మతాన్ని వాడుకుంటున్నారు : పవన్‌

ప్రజల నుంచి వారి సమ్మతి లేకుండా డేటా ఎలా తీసుకుంటారని, అందరూ మీ నియంతృత్వానికి తల వంచాలా? అని ప్రశ్నించారు. వాలంటీర్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కులగణన, ఇతర వివరాలు ఏ కంపెనీ వద్ద భద్రపరుస్తారు అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కులగణన పేరిట సేకరించిన డేటా దుర్వినియోగం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అన్నారు.

గతంలో కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ కులాల గురించి డేటా సేకరణ ప్రక్రియను చేసినప్పుడు అది ఏ విధంగా సమాజంలో అశాంతి, అల్లర్లు చెలరేగాయో మీకు తెలియదా అని ప్రశ్నించారు. వాటిని ఎన్నికల కోసం, స్వీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారో మాకు తెలియదనుకుంటున్నారా అని మండిపడ్డారు.

ప్రభుత్వ వనరులు, యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటం కాదా అని లెటర్​లో అడిగారు. ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా అని అడిగిన పవన్, ఒక వేళ కాకపోతే ఇలా సేకరించిన డేటాను ఏ విధంగానూ దుర్వినియోగం కాకుండా మీరు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలపై రాజకీయంగానే కాకుండా న్యాయపోరాటం దిశగా ఆలోచిస్తున్నట్లు పవన్ కల్యాణ్​ చెప్పారు.

వైఎస్సార్సీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది - అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది: పవన్

ABOUT THE AUTHOR

...view details