ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటి ? - చంద్రబాబు భావోద్వేగ ట్వీట్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 9:29 AM IST

Updated : Mar 3, 2024, 9:57 AM IST

Chandrababu Tweet on AP Govt Debt: రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇది అవమానకరం, బాధాకరమని అన్నారు. జగన్‌ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను మాత్రమే కాదని, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని సూచించారు.

Chandrababu_Tweet_on_AP_Govt_Debt
Chandrababu_Tweet_on_AP_Govt_Debt

Chandrababu Tweet on AP Govt Debts: ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని రూ. 370 కోట్లకు తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ సీఎంకి తెలుసా అని నిలదీశారు.

జగన్‌ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని నాశనం చేశాడని విమర్శించారు. అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో ప్రజలు ఏం కోల్పోతున్నారో ఆలోచించాలని విజ్ఙప్తి చేశారు.

Nara Lokesh Tweet on CM Jagan: గత ఐదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని 12.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్​ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి షాక్​కు గురైనట్లు తెలపారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చి మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని తామంటే ఒంటికాలిపై లేచిన వైసీపీ మేధావులు దీనికేం సమాధానం చెబుతారని నిలదీశారు.

ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ: ఏపీ సచివాలయాన్ని 370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ పనితనాన్ని చూశాక శ్రీలంకతో పోల్చడం ఏ మాత్రం సరికాదని అనిపిస్తోందన్నారు. ఎంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా శ్రీలంక తమ పాలనా కేంద్రాన్ని తాకట్టుపెట్టలేదని గుర్తుచేశారు. ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారీ మరో మెట్టు దిగిపోతూ ఆంధ్రప్రదేశ్ పరువును అంతర్జాతీయ స్థాయిలో మంటగలుపుతున్న ఈ ముఖ్యమంత్రిని ఏమనాలో, ఎవరితో పోల్చాలో మాటలు రావడం లేదని మండిపడ్డారు.

Andhra Pradesh Debt: కాగా ఇప్పటికే ఏపీ సర్కార్ ఇష్టారీతిన అప్పులు చేసింది. రాష్ట్ర అప్పులు, చెల్లింపుల భారం జనవరి ప్రారంభానికే 10 లక్షల 21 వేల కోట్ల రూపాయలను దాటింది. చేసిన అప్పులను తీర్చేందుకు జగన్‌ సర్కారు జనం జేబుల్లోంచి అనేక రూపాల్లో డబ్బులు లాగేసుకుంటోంది. వారిపై ఇతర రాష్ట్రాల్లో కనిపించని ఎన్నో భారాలు మోపింది.

వైసీపీ సర్కార్ అయిదేళ్లలో వివిధ ఛార్జీలు, పన్నుల రూపంలో ప్రజలపై లక్షా 8 వేల కోట్లు భారం మోపింది. ఈ గణాంకాలు చూస్తే ప్రభుత్వం ప్రజల నుంచి ఏ స్థాయిలో పిండుకుందో తెలుస్తోంది. అంతే కాకుండా ఏపీలో అమలవుతున్న పన్నులకు, పొరుగు రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులకు మధ్య చాలా తేడా ఉంటోంది.

కాగ్‌ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 మధ్య కాలంలో 3 లక్షల 47 వేల 944.64 కోట్ల రూపాయల అప్పును తీర్చాలి. అంటే అసలు, వడ్డీని తీర్చేందుకు ఏడాదికి సుమారు 40 వేల కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అధికారిక గణాంకాల ప్రకారమే 2020-21 నుంచి 2023-24 మధ్య అప్పులు, వడ్డీల చెల్లింపుల భారం ఏకంగా 37 శాతం పెరిగిపోయింది. ఇప్పటి వరకూ ఉన్నవి చాలని అన్నట్టుగా తాజాగా సచివాలయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Last Updated : Mar 3, 2024, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details