ETV Bharat / state

బన్సీలాల్‌పెట్‌ మెట్ల బావి ప్రారంభానికి సిద్ధం.. ఓసారి రండి చూసొద్దాం

author img

By

Published : Dec 4, 2022, 4:30 PM IST

Bansilalpet step well: హైదరాబాద్‌ బన్సీలాల్‌పేట్‌లో పునరుద్ధరించిన మెట్లబావికి కొత్త సొబగులు సంతరించుకున్నాయి. సోమవారం పునఃప్రారంభించనున్న.. ఈ అద్భుత కట్టడాన్ని వీక్షించేందుకు సందర్శకులను అనుమతించనున్నారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. భాగ్యనగర చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచే ఈ బావుల పునరుద్ధరణ.. నాటి వైభవాన్ని కళ్లకు కట్టనుంది.

Bansilalpet step well
Bansilalpet step well

ప్రారంభానికి సిద్ధమైన బన్సీలాల్‌పెట్‌ మెట్ల బావి.. ఓ సారి చూసొద్దాం రండి.

Bansilalpet step well: హైదరాబాద్‌ చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచే కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌డీఏ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నాటి చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ప్రణాళికబద్ధంగా కార్యాచరణ చేపట్టిన సర్కార్.. జంటనగరాల్లో పురాతన మెట్ల బావుల మరమ్మతులకు నడుంబగించింది. నిజాం కాలంలో ప్రధాన రహదారులకు 100మీటర్ల దూరంలో నిర్మించిన ఈ బావులు.. ప్రస్తుత గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వందకు పైగానే ఉన్నా.. అందులో చాలా వరకు కనుమరుగయ్యాయి.

కొన్ని బావుల స్థలాల్లో నిర్మాణాలు వెలియగా.. మరికొన్ని చోట్ల ఉన్న బావులు రూపును కోల్పోయి, చెత్తచెదారానికి ఆవాసాలుగా మారాయి. ఇలా దయనీయ పరిస్థితుల్లో కనిపిస్తున్న మెట్లబావుల్లో ఒకటి.. బన్సీలాల్‌పేట్‌లో 3శతాబ్దాల క్రితం నిర్మించిన నాగన్నకుంట నీటివనరు. 30.5 మీటర్ల పొడవు, 19.2 అడుగుల వెడల్పు, 53 అడుగుల లోతుతో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో అబ్బురపరిచే నిర్మాణశైలితో ఈ కట్టడం నిర్మితమైంది. దశాబ్దాలుగా నిరాదరణకు గురై, రూపురేఖలు కోల్పోయిన ఈ మెట్లబావిని పునరుద్ధరించేందుకు సర్కార్‌ నడుంబిగించింది.

సహిత స్వచ్ఛంద సంస్థ సహకారంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఏంసీ మెట్లబావి పూర్వ వైభవానికి చర్యలు చేపట్టింది. మట్టి, చెత్త, వ్యర్థాలతో పూడుకుపోయిన బావిని 8 నెలల పాటు శ్రమించి.. రూపురేఖలు మార్చివేశారు. బావుల వద్ద ఆక్రమణల తొలగింపు, చుట్టూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. నూతనంగా నిర్మించిన టూరిస్ట్ ప్లాజా భవనం, అందులో ఏర్పాటు చేసిన మెట్ల బావి నమూనా, బావిలో పేరుకుపోయిన పూడిక తొలగింపు సందర్భంగా లభ్యమైన వివిధ రకాల పురాతన పరికరాల ప్రదర్శనను, గార్డెన్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు.

పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నగరంలో ఇలాంటి బావుల ఆనవాళ్లు చాలా ఉండగా ఇప్పటికైతే బన్సీలాల్‌పేట్‌ సహా ఆరింటి పునరుద్దరణకు చర్యలు చేపట్టారు. వీటిలో బాపూఘాట్, గచ్చిబౌలి, సీతారాంబాగ్, గుడిమల్కాపూర్, శివంబాగ్‌లోని మెట్ల బావులు మరమ్మతులు పూర్తయ్యాయి. మరో 20కి పైగా కట్టడాల పునరుద్ధరణ త్వరలోనే పూర్తి కానుండగా.. అందులో బన్సీలాల్‌పేట్‌ మెట్లబావి ప్రారంభానికి సిద్ధమైనట్లు మంత్రి తలసాని తెలిపారు.

భూగర్భ జలాల సంరక్షణపై మనక్‌కీబాత్‌లో మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ ఈ బన్సీలాల్‌పేట మెట్లబావి గురించి ప్రస్తావించారు. చారిత్రక మెట్లబావికి పునర్వైభవం తీసుకొచ్చారని, కాలక్రమేణా మట్టి, చెత్తతో నిండిన ఆ బావి నేడు అలనాటి వైభవాన్ని చాటుతోందన్నారు. మరోవైపు కులీకుతుబ్‌షాహీ సమాధుల వద్ద ఇటీవల పునరుద్ధరించిన మెట్లబావికి యునెస్కో గుర్తింపు వచ్చింది. ఈ అద్భుత కట్టడానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించటం ఆనవాళ్లు కోల్పోతున్న చారిత్రక ప్రదేశాల పునర్వైభవానికి బాటలు వేస్తోంది.

"బన్సీలాల్‌ మెట్ల బావి పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. ఇది ఒక టూరిజం స్థలం కింద బ్రహ్మడంగా తీర్చిదిద్దడం జరుగుతోంది. దేశంతో పాటు ప్రపంచం మెచ్చేలా దీని పునరుద్దరించడం జరిగింది. రేపు సాయంత్రం 5 గంటలకు మంత్రి కేటీఆర్‌ మెట్ల బావిని ప్రారంభిస్తారు."-తలసాని శ్రీనివాస్‌యాదవ్, మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.