ETV Bharat / state

నత్తనడకన థీమ్‌ పార్కుల పనులు.. ఏళ్లు గడిచినా పూర్తవని ఉద్యానవనాలు

author img

By

Published : Jan 15, 2023, 9:46 PM IST

Theme Parks
Theme Parks

Theme Parks in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న థీమ్ పార్కుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడిచినా పనులు ముందుకు సాగడం లేదు. గ్రీన్ సిటీగా మార్చాలనే లక్ష్యంతో నగరంలో 57 థీమ్ పార్కులను ఏర్పాటు చేయడం జీహెచ్​ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. సుమారు రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికి కేవలం 6 పార్కులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగతా ప్రాంతాల్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మొదట నుంచి ఈ థీమ్ పార్కులకు బాలారిష్టాలు తప్పడం లేదు.

నత్తనడక సాగుతున్న థీమ్‌ పార్కుల పనులు.. ఏళ్లు గడిచినా పూర్తవని ఉద్యానవనాలు

Theme Parks in Hyderabad: ఆకాశ హర్మ్యాలు.. అందమైన భవంతులు.. విద్యుత్ కాంతులతో వెలిగిపోయే కార్పొరేట్ కార్యాలయాలకు నెలవు భాగ్యనగరం. కాంక్రీట్‌ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లో సేద తీరేందుకు, ఆరోగ్య స్పృహ కోసం నగరవాసులు ఉద్యానవనాల బాట పడుతున్నారు. కోటిమందికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో పరిమిత సంఖ్యలోనే పార్కులున్నాయి. ఆ లోటుని గమనించి సర్కార్‌.. పచ్చదనాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తోంది. హరితహారం సహా అనేక కార్యక్రమాలను చేపట్టి లక్షలాది మొక్కలను నాటడంతో పాటు.. భారీగా పార్కులను అందుబాటులోకి తీసుకువస్తోంది.

నెమ్మదిగా సాగుతున్న పనులు : ఐదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 19 పార్కులు బల్దియా పరిధిలో ఉండగా.. 17 థీమ్ పార్కులు హెర్బల్, వెదురు థీమ్ పార్కులు, చిన్నా పెద్దా కాలనీల్లో కలిపి వెయ్యి వరకు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలను గుర్తించిన అధికారులు.. కబ్జాకు గురికాకుండా 1,833 ప్రాంతాల్లో పార్కులుగా తీర్చిదిద్దుతోంది. అందులో 83 చోట్ల కాలనీ, థీమ్ పార్కులుగా మార్చారు. జంట న‌గరాల్లో 132 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. చాలా చోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎల్బీనగర్​ జోన్‌లో 13 థీమ్ పార్క్‌లకుగాను ఒకటే పూర్తిచేశారు. ఖైరతాబాద్ జోన్‌లో 14 థీమ్ పార్క్‌లు చేపట్టగా ఒక్కటి మాత్రమే పూర్తి చేశారు. శేరిలింగంపల్లి జోన్ లో 10 పార్కులకు రెండు పార్కులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. కూకట్​పల్లి జోన్‌, సికింద్రాబాద్ జోన్‌లోనూ ఒక్కటికి మించి పూర్తికాలేదు. రోడ్ల మధ్యన పూల మొక్కల పెంపుతో వాహన కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టారు.

నగరం నడిబొడ్డున 17 పార్కులు : నగరంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న వందలాది పార్కుల్లో అత్యంత ముఖ్యమైనవి ఇటీవల అందుబాటులోకి వచ్చిన పంచతత్వ పార్కులు కావటం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్నిల సమాహారంగా పంచతత్వ పార్కులకు రూపకల్పన చేశారు. నగరం నడిబొడ్డున 17 ప్రాంతాల్లో ఇలాంటి పార్కులు అందుబాటులోకి తెచ్చారు. ఒక్కోపార్కులో 50 రకాల ఔషధ మొక్కలతో కూడిన సంజీవని వనాలు, రాశి వనాలతోపాటు.. వాకింగ్ ట్రాక్‌లు సిద్ధం చేశారు. వృత్తాకారంలో ఉండే పంచతత్వ పార్క్‌ వాక్‌ వేలో తొమ్మిది బ్లాక్‌లు ఉంటాయి. కంకర రాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక రేణువులు, చెక్కపొట్టు, గులకరాళ్లు పోసి దారులు ఏర్పాటుచేశారు. చెప్పులు, షూస్‌ లేకుండా నడిస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణం, స్వచ్ఛమైన గాలితోపాటు ఉల్లాసం కలుగుతాయని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.