ETV Bharat / bharat

నాలుగేళ్లలో 50లక్షల చెట్లు మాయం- పంట పొలాల్లోనివే ఎక్కువ- పర్యావరణంపై తీవ్ర ప్రభావం? - Vanished Farmland Trees

author img

By ETV Bharat Telugu Team

Published : May 19, 2024, 8:07 AM IST

Updated : May 19, 2024, 9:02 AM IST

Vanished Farmland Trees In India : మన దేశంలో 2018 నుంచి 2022 వరకు దాదాపు 50 లక్షలకు పైగా భారీ వృక్షాలు అదృశ్యమయ్యాయని ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. వాటిలో ఎక్కువగా పంట పొలాల్లో ఉండే వృక్షాలని తెలిపింది.

Vanished Farmland Trees In India
Vanished Farmland Trees In India (ANI)

Vanished Farmland Trees In India : వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని పెద్దల నానుడి. పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికి కూడా ఎంతో అవసరమని ఇటీవల పర్యవసానాలు మనకు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ విచ్చలవిడిగా చెట్ల నరికివేతలు ఆగడంలేదు. ముఖ్యంగా పంట పొలాల్లో ఉండే భారీ వృక్షాల తొలగింపు ఇటీవల కాలంలో అత్యధికంగా జరుగుతోంది.

సాగుకు అడ్డువస్తున్నాయనో, వాటి నీడ వల్ల తెగుళ్లు సోకుతున్నాయనో లేక అధిక దిగుబడికి అవరోధమనే అభిప్రాయంతోనో రైతులు వాటిని తొలగిస్తున్నారు. ఇలా 2018-2022 మధ్య నాలుగేళ్లలో మన దేశంలో 50 లక్షలకు పైగా భారీ వృక్షాలు పంట పొలాల నుంచి అదృశ్యమయ్యాయని డెన్మార్క్​కు చెందిన ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఈ ధోరణి రోజురోజుకు పెరిగిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పంట పొలాల్లోని చెట్లపై పదేళ్ల అధ్యయనం
డెన్మార్క్‌కు చెందిన కోపెన్‌హాగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం పదేళ్ల అధ్యయన వివరాలతో నివేదికను రూపొందించింది. ఆ నివేదికను 'నేచర్‌ సస్టెయినబిలిటీ' ప్రచురించింది. కృత్రిమ మేధ ఆధారిత డీప్‌లెర్నింగ్‌ మోడల్స్‌ను వినియోగించి అటవీయేతర ప్రాంతాల్లోని భారీ వృక్షాలను వీరు అధ్యయనం చేశారు. 2010, 2011లోనే పంటపొలాల్లోని 60 కోట్లకుపైగా వృక్షాలను మ్యాపింగ్‌ చేశారు. 2018 నాటికి వీటిలో 11 శాతం మహావృక్షాలు కనుమరుగయ్యాయని గుర్తించారు. 2018-2022 మధ్య నాలుగేళ్లలో భారీ వృక్షాలు 50లక్షలకుపైగా అదృశ్యమయ్యాయని నివేదికలో పేర్కొన్నారు.

పర్యావరణంపై దుష్ప్రభావం
వరిసాగు అధికం కావడం, అధిక ఫలసాయం కోసం పొలాల నుంచి చెట్ల తొలగింపు జరుగుతోందని పరిశోధకులు నివేదికలో అభిప్రాయపడ్డారు. ఈ తరహా ధోరణి వల్ల అటవీయేతర ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిపోయి పర్యావరణంపై దుష్ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వనాల పెంపకం పెరిగిందని గుర్తించారు. అయితే, భారీ వృక్షాల వల్ల కలిగే ప్రయోజనాలకు ఇది సరైన ప్రత్యామ్నాయం కాదని, వృక్ష జాతుల వైవిధ్యం కూడా తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని నివేదికలో వ్యక్తం చేశారు.

Last Updated : May 19, 2024, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.