ETV Bharat / sports

జేక్​ ఫ్రేజర్ ఊచకోత - 310కిపైగా స్ట్రైక్‌రేట్‌తో ముంబయిపై విరుచుకుపడుతూ! - IPL 2024 DV VS MI

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 5:44 PM IST

Updated : Apr 27, 2024, 6:06 PM IST

.
.

IPL 2024 MI VS DC Jake Fraser MC Gurk : ఐపీఎల్‌ 2024 సంచలన ప్రదర్శనలకు వేదికగా మారింది. తాజాగా జరిగిన మ్యాచ్​లో మరోసారి దిల్లీ ఓపెనర్​ జేక్ ఫ్రేజర్ - మెక్‌గర్క్ అదిరే ప్రదర్శన చేశాడు. ముంబయి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కొడితే బౌండరీ లేదంటే సిక్సర్‌ అన్నట్లు జేక్‌ ఇన్నింగ్స్‌ సాగింది.

IPL 2024 MI VS DC Jake Fraser MC Gurk : ఐపీఎల్‌ 2024 సంచలన ప్రదర్శనలకు వేదికగా మారింది. బ్యాటర్ల హార్డ్‌ హిట్టింగ్‌తో ప్రతి రికార్డు చిన్నదిగానే కనిపిస్తోంది. ఏప్రిల్‌ 27న దిల్లీ అరుణ్‌ జైట్లీ స్టేడియంలో MI vs DC మ్యాచ్‌లో మరో 257 ప్లస్‌ స్కోరు నమోదైంది. దిల్లీ ఓపెనర్‌ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్(27 బంతుల్లో 87) సంచలన బ్యాటింగ్‌తో దిల్లీ భారీ స్కోరు సాధించింది. కేవలం 15 బంతుల్లోనే మెక్‌గుర్క్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడంటే, అతని ఊచకోత ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

  • చుక్కలు చూపించిన మెక్‌గుర్క్‌
    మెక్‌గుర్క్‌ మెరుపులతో దిల్లీ పవర్‌ప్లేలో 92 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్ ఆచితూచి ఆడుతున్నా, మెక్‌గుర్క్‌ ఎక్కడా తగ్గలేదు. ప్రతి ముంబయి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీకి తరలించాడు. దూకుడు మీదున్న జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, చావ్లా వేసిన ఎనిమిదో ఓవర్‌లో భారీ షాట్‌ ఆడబోయి ఫీల్డర్‌ చేతికి చిక్కాడు. మొత్తంగా 27 బంతుల్లోనే 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. 310కుపైగా స్ట్రైక్​ రేట్​తో ఇన్నింగ్స్ ఆడాడు.
  • మొదటి ఓవర్‌లోనే 19
    జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ వుడ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే 19 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో మొదటి ఓవర్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. అంతకుముందు 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌ జైస్వాల్ మొదటి ఓవర్‌లో 26 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆఫ్ స్పిన్నర్ నితీష్ రాణా వేసిన తొలి ఓవర్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్‌లు బాదేశాడు.
  • బౌండరీలు, సిక్సర్ల రూపంలో అత్యధిక పరుగులు
    జేక్‌ ఇన్నింగ్స్‌ 84 పరుగుల స్కోర్‌లో 95.23 శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. అంటే 84 పరుగుల్లో 80 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. కేవలం 4 పరుగులు మాత్రమే సింగిల్స్‌ రూపంలో వచ్చాయి. జేక్‌ ఇదే సీజన్లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలోనే (90 శాతానికి పైగా పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో) రెచ్చిపోయాడు.

    ఆ మ్యాచ్‌లో జేక్‌ చేసిన 65 పరుగుల్లో 62 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. ఐపీఎల్‌లో అత్యధిక శాతం పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలో సాధించిన రికార్డు సురేశ్‌ రైనా పేరిట ఉంది. 2014 సీజన్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రైనా చేసిన 87 పరుగుల్లో 84 పరుగులు బౌండరీల, సిక్సర్ల రూపంలో సాధించాడు. అంటే మొత్తం పరుగుల్లో బౌండరీల శాతం 96.55గా ఉంది.

  • ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీలు
    ఫ్రేజర్-మెక్‌గర్క్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో మూడోసారి హాఫ్‌ సెంచరీ కొట్టాడు. 237.50 స్ట్రైక్‌ రేటుతో మొత్తంగా 247 పరుగులు చేశాడు. ఈ యంగ్‌ ఆస్ట్రేలియన్ బ్యాటర్‌ దిల్లీ తరఫున వేగవంతమైన అర్ధశతకం సాధించిన తన రికార్డును తానే అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో 15 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో ఒకటి కన్నా ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. టీ20 హిస్టరీలో అతని కన్నా ముందు వెస్టిండీస్ స్టార్లు ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ ఉన్నారు.
  • భారీ స్కోరు సాధించిన దిల్లీ క్యాపిటల్స్‌

టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దిల్లీ ఓపెనర్లుగా జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్‌ని పంపింది. ఈ జోడీ పవర్‌ ప్లే ముగిసే సరికి 92/0 స్కోరు సాధించింది. మెక్‌గుర్క్‌ 27 బంతుల్లో 84, మరో ఓపెనర్‌ అభిషేక్‌ పోరెల్‌ 27 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఓపెనర్లు అవుట్‌ అయ్యాక క్రీజులోకి వచ్చి హోప్‌, పంత్‌ కూడా జోరు కొనసాగించారు. హోప్‌ 17 బంతుల్లో 41 పరుగులు చేయగా, పంత్‌ 19 బంతుల్లో 29 రన్స్‌ కొట్టాడు. డెత్‌ ఓవర్స్‌లో స్టబ్స్‌ 25 బంతుల్లో 48 పరుగులతో చెలరేడంతో దిల్లీ స్కోర్‌ 257కి చేరుకుంది.

  • కట్టడి చేయలేకపోయిన ముంబయి
    ముంబయి బౌలర్లు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. బుమ్రా మాత్రమే 8.8 ఎకానమీతో బౌలింగ్‌ చేశాడు. అతను 4 ఓవర్లలో 35 పరుగుల ఇచ్చి 1 వికెట్‌ తీశాడు. మహ్మద్‌ నబీ, లూక్‌ వుడ్‌, చావ్లాకి ఒక్కో వికెట్‌ దక్కింది. రెండు ఓవర్లు వేసిన హార్దిక్‌ పాండ్యా ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు.

    టీ20ల్లో అత్యధిక ఛేజింగ్​లు ఇవే - టాప్​లో ఎవరున్నారంటే? - HIGHEST RUN CHASES

'ధర తక్కువ- ఇంపాక్ట్ ఎక్కువ'- IPLలో వీళ్ల ఆటే హైలైట్ - IPL 2024

Last Updated :Apr 27, 2024, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.