ETV Bharat / opinion

మోదీపైనే BJP ఆశలు- పూర్వవైభవం కోసం కాంగ్రెస్ తిప్పలు- ఈశాన్య రాష్ట్రాల్లో ఎవరి బలం ఎంత? - 7 Sisters 2024 Lok Sabha Election

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 2:17 PM IST

Seven Sisters 2024 Lok Sabha Election Scenario : సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి ఈశాన్య రాష్ట్రాలపై నెలకొంది. సెవెన్‌ సిస్టర్స్‌గా భావించే ఏడు రాష్ట్రాలు సహా సిక్కింను కలుసుకుంటే మొత్తంగా 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అసోంలో బీజేపీ సత్తా చాటుతుండగా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ మరోసారి ఈశాన్యంలో పాగా వేయాలని చూస్తుండగా పూర్వవైభవాన్ని సాధించాలని కాంగ్రెస్‌ కృత నిశ్చయంతో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపు అవకాశాలపై ప్రత్యేక కథనం.

Seven Sisters 2024 Lok Sabha Election Scenario
Seven Sisters 2024 Lok Sabha Election Scenario

Seven Sisters 2024 Lok Sabha Election Scenario : ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ స్థానాలు తక్కువే అయినా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సెవెన్‌ సిస్టర్స్‌, సరిహద్దు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాయి. అసోం, మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, మిజోరం, నాగాలాండ్‌, మణిపుర్‌తో పాటు సిక్కింలో రసవత్తర పోరు నెలకొంది. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి.

అసోంలో కమల వికాసం!
ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అసోం. ఇక్కడ 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతి, బాల్య వివాహాలు వంటి అంశాలు ఈసారి అసోం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. అసోంలో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లగాను తొమ్మిది స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉత్సాహంతో ఉంది. మూడు స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్‌ ఆ సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన CAA చట్టం ఇక్కడ బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది.

అటు అసోంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు సాయుధ వేర్పాటువాద సంస్థ 'యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అసోం- ఉల్ఫా'తో దీర్ఘకాలంగా బీజేపీ జరిపిన చర్చలు ఫలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం జరగడం బీజేపీ విజయావకాశాలను పెంచింది. బాల్య వివాహాల కట్టడికి సీఎం హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆ పార్టీకి మద్దతు పెరిగేలా చేశాయి. అయితే బీజేపీ హిందుత్వ భావజాలంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీ కార్మికుల కోసం బీజేపీ తెచ్చిన పథకాలు ఆ పార్టీపై ఓట్ల వర్షం కురిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అరుణాచల్​లో బీజేపీ ప్రభంజనం- కాంగ్రెస్​ డీలా
సెవెన్‌ సిస్టర్స్‌లో ఇప్పుడు అందరి దృష్టి అరుణాచల్‌ ప్రదేశ్‌పై పడింది. అరుణాచల్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌కు కంచుకోటైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీజేపీ పాగా వేసింది. 2019లో ప్రధాని మోదీ సునామీ ముంచెత్తడం వల్ల బీజేపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు లోక్‌సభ స్థానాలను గెలుచుకొని హస్తం పార్టీ అధిపత్యానికి గండికొట్టింది. ఈసారి ఎన్నికలు ఇంకా జరగక ముందే బీజేపీ ఆధిపత్యం మెుదలైంది. 60 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 10 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం గమనార్హం. మిగిలిన 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలపగా కాంగ్రెస్‌ కేవలం 19 సీట్లలోనే పోటీ చేస్తుండడం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది.

2004 నుంచి 2014 వరకు అరుణాచల్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఆ తర్వాత ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. 2004లో అరుణాచల్‌లోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకోగా 2009లో కాంగ్రెస్‌ వశం చేసుకొంది. 2014లో బీజేపీ, కాంగ్రెస్‌ చెరొకటి గెలుచుకున్నాయి. కానీ 2019లో ప్రధాని మోదీ చరిష్మాతో రెండు స్థానాలను గెలుచుకొని బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ సత్తాచాటింది. మోదీ హవా, కేంద్ర సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధే ప్రచార అస్త్రాలుగా బీజేపీ దూసుకుపోతోంది. చైనాతో సరిహద్దు వివాదం బీజేపీకి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అటు బలమైన రాష్ట్ర నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్‌ విజయావకాశాలను తగ్గిస్తోంది.

మణిపుర్​ అల్లర్ల ప్రభావం
మణిపుర్‌లో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జాతిహింస, అక్రమ వలసలు అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న కుకీ, మైతేయి వర్గాల మధ్య జరిగిన హింస ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. మణిపుర్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాలను నిలుపుకుంటూ వస్తున్న కాంగ్రెస్‌కు 2019లో తొలిసారి షాక్‌ తగిలింది. 2019లో మణిపుర్‌లో ఉన్న రెండు లోక్‌సభ స్థానాల్లో ఒకటి బీజేపీ, మరొకటి నేషనల్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌-NPF గెలుచుకొని కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు చుక్కెదురైంది. 60 అసెంబ్లీ స్థానాల్లో 32 స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా బీజేపీ మెజారిటీ దక్కించుకుంది. ప్రాంతీయ పార్టీలైన NPF, NPP, లోక్‌ జనశక్తి పార్టీలతో కలిసి బీరెన్‌ సింగ్‌ సీఎంగా బీజేపీ సర్కారు కొలువుదీరింది.

అయితే, ఈసారి ఎన్నికల్లో కుకీ, మైతేయి వర్గాల మధ్య హింస అధికార బీజేపీ విజయావకాశాలను దెబ్బకొట్టే అవకాశం ఉంది. రెండు తెగల మధ్య చెలరేగిన హింస దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అత్యాచారాలు, సజీవ దహనాలతో మణిపుర్‌ అట్టుడికింది. అల్లర్లు కట్టడి చేయడంలో బీజేపీ సర్కారు విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. హింసకు ప్రధాన కారణం అక్రమ వలసలంటున్న ప్రభుత్వం సరిహద్దుల వెంబడి కంచెలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలను ఆరికట్టడానికి స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. దీనిని ఆదివాసీలు, గిరిజనులు వ్యతిరేకించగా, మైతేయి తెగ స్వాగతించింది. మణిపుర్‌ జనాభాలో దాదాపు 53 శాతం మైతేయి తెగవారు ఉండగా, దాదాపు 40 శాతం కుకీ, నాగా తెగలు ఉంటున్నారు. మణిపుర్‌లో ఏప్రిల్‌ 19, 26 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

బీజేపీకి అందని మేఘాలయా
తమకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న మేఘాలయలో ఈసారి ఎలాగైనా సత్తాచాటాలని బీజేపీ చూస్తోంది. రెండు లోక్‌సభ స్థానాలు ఉన్న మేఘాలయలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో షిల్లాంగ్‌లో కాంగ్రెస్‌, తురాలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ-NPPవిజయం సాధించాయి. తురా స్థానాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని మేఘాలయ సీఎం, NPP అధినేత కాన్రాడ్‌ కె. సంగ్మా పట్టుదలగా ఉన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ ఇస్తున్నా బీజేపీకి ఇక్కడే ఉనికే లేదు. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టకున్నా ఖాతా తేరవలేదు. ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మేఘాలయోలోని తురా నియోజకవర్గం సీఎం సంగ్మా కుటుంబానికి కంచుకోట ఈసారి కూడా అక్కడ ఆయనే పార్టీయే గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అధికార NPPకి అసోంతో సరిహద్దు వివాదాలు, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం ప్రతికూలంగా మారాయి. కాంగ్రెస్‌కు రాష్ర్టంలో బలమైన నాయకత్వం లేదు. గత కొన్నేళ్లుగా కొంతమంది నేతలు కాంగ్రెస్‌ను వీడి TMC, NPP, BJPలో చేరడం హస్తం పార్టీని బలహీనపరించింది.

కమ్యూనిస్టుల త్రిపురలో కమలం మరోసారి!
కమ్యూనిస్టుల గడ్డ త్రిపురలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురువేసి చరిత్ర సృష్టించింది. కమ్యూనిస్టుల కంచుకోటలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. 1998 నుంచి 2018 వరకు సీపీఎం నేత మాణిక్‌ సర్కార్‌ త్రిపురను ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లలో 36 స్థానాలు దక్కించుకుని బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ నేతృత్వంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అదే ఊపులో 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ రెండుకు రెండు సీట్లు గెలిచి సత్తాచాటింది. అసెంబ్లీ ఎన్నికల కాస్త ప్రభావం చూపుతున్న కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా తేలిపోతోంది. ఏప్రిల్‌ 19, 26 తేదీల్లో పోలింగ్‌ జరగనున్న త్రిపురలో మరోసారి సత్తాచాటాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇక్కడ కూడా బీజేపీ మోదీ చరిష్మానే నమ్ముకుంది. పెరిగిన ధరలు, ప్రభుత్వ అవినీతి వంటి అంశాలను విపక్షాలు ప్రధాన ప్రచార అస్త్రాలుగా చేసుకున్నాయి.

మిజోరంలో కాంగ్రెస్​-MNF​ దోబూచులాట
మిజోరంలో ఉన్న ఏకైక లోక్‌సభ స్థానం మిజో నేషనల్‌ ఫ్రంట్‌-MNF, కాంగ్రెస్‌ మధ్య చేతులు మారుతోంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో MNF గెలిచింది. ప్రస్తుతం ఆ రాష్ర్టంలో అధికారంలో ఉన్న ZPM ఈసారి ఎన్నికల్లో సత్తాచాటాలని చూస్తోంది. తొలిసారి ZPM సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలిచి ZPM ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీయేతో పొత్తు పెట్టుకోకపోవడం, పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకించడం, మిజో సంస్కృతి, మత సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం ZPMకు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

నాగాలాండ్​లో ప్రాంతీయ పార్టీలదే హవా
నాగాలాండ్‌లోనూ ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతోంది. ఇక్కడ ఉన్న ఏకైక లోక్‌సభ సీటును 2004 నుంచి 2014 వరకు నాగా పీపుల్స్‌ పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో నేషనలిస్ట్‌ డెమెుక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ-NDPP జయకేతనం ఎగురవేసింది. ఎన్డీయే కూటమిలో NDPP మరోసారి అదే ఫలితాన్ని సాధించాలని చూస్తోంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన NDPP ఏప్రిల్‌ 19న జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాణించాలని ఊవిళ్లూరుతోంది.

సిక్కింలో ద్విముఖ పోరు
సిక్కింలో ఏప్రిల్‌ 19న లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సిక్కింలో ప్రస్తుతం అధికారంలో సిక్కిం క్రాంతికారి ఫ్రంట్ SKM, సిక్కిం డెమెుక్రటిక్‌ ఫ్రంట్‌ -SDF మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. అధికార SKMకు సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌కు ఉన్న ప్రజాకర్షణే అతిపెద్ద బలం. దాదాపు 27 వేల ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం అధికార పార్టీకి అనుకూలంగా మారనుంది. మరోవైపు దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన SDF అధినేత పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈసారి SDF 2.0 పేరుతో సరికొత్తగా ఎన్నికల బరిలో దిగుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తమిళనాడుపై BJP స్పెషల్​ ఫోకస్- అన్నామలై​ మ్యాజిక్​ పనిచేస్తుందా? డబుల్​ డిజిట్ సాధ్యమేనా? - Tamil Nadu BJP Chief K Annamalai

విరుధ్​నగర్​లో సినీ 'సైరన్​'- సిట్టింగ్​ MPపై రాధిక, విజయ్​కాంత్​ తనయుడి పోటీ- తమిళనాట ఉత్కంఠ పోరు! - VIRUDHNAGAR LS ELECTIONS 2024 TN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.