ETV Bharat / state

ఒంగోలులో మార్పు ఖాయం!- ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ? - ONGOLE lok sabha constituency

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 7:12 PM IST

Updated : May 7, 2024, 8:26 PM IST

Ongole Parliamentary Review of India General Elections 2024
Ongole Parliamentary Review of India General Elections 2024 (ETV BHARAT)

Ongole Parliamentary Review of India General Elections 2024 : బయట ప్రపంచానికి ఒంగోలు పేరు చెబితే ఒంగోలు గిత్తలు, ఒంగోలు పాలు గుర్తుకు వస్తాయి. పాడికి సుప్రద్ధి అనుకుంటారు. ఇంకో వైపు అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన గెలక్సీ గ్రానైట్‌ గుర్తుకు వస్తుంది. అంతే వీటిని చూసి బయటవాళ్లు మురిసిపోవచ్చు. కానీ ప్రజలకు మాత్రం వట్టిపోయిన గోవు మాదిరిగా ఈ నియోజకర్గం తయారయ్యింది. కరువు, వలసలు, ప్రజలు కష్టాలు, సమస్యలు ఇదే కనిపిస్తాయి. రాజకీయంగా ఎన్నో ఏళ్లుగా ఎంతో మందిని ఉన్నతి స్థాయికి తీసుకెళ్లినా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.

Ongole Parliamentary Review of India General Elections 2024 : ఎన్నికలు వచ్చాయంటే చాలు నాయకులకు ప్రజలు, ప్రాంతాలపై విపరీతమైన ప్రేమ పుట్టుకొస్తుంది. తీర గెలిచాక ఆ ప్రజలు, ప్రాంతాలని పట్టించుకునే నాథుడే ఉండడు. ఒంగోలు పార్లమెంట్‌ స్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కువ కాలం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఈ పార్లమెంట్‌ స్థానం ఎక్కువుగా విస్తరించి ఉంది. నల్లమల అడవులు, మెట్ట ప్రాంతం, వెలుగొండ ప్రాజెక్టు, సాగర్‌ కాలువలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నప్రాధాన్యాలు. ఇలా విభిన్న అంశాలతో కూడుకున్న ఒంగోలు పార్లమెంట్‌ స్థానంకు జరుగుతున్నఎన్నికల నేపధ్యంలో ప్రత్యేక కథనం.

ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy

ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదు : ఒంగోలు లోక్‌సభ అత్యధిక సార్లు కాంగ్రెస్‌ పార్టీని ఆదరించిన నియోజకవర్గం. పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్సార్సీపీను ఆదరిస్తున్న స్థానం. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైవీ సుబ్బారెడ్డి, 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి విజయం సాధించారు. కానీ లోక్‌సభ పరిధిలో సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమ తాలుకాలో సాగు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీనికి పరిష్కారమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలో అటకెక్కింది. కనిగిరిలో ఫ్లోరైడ్‌ సమస్య అలానే ఉంది. పశ్చిమ డివిజన్‌ ప్రజల ఆకాంక్షైన మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటును వైఎస్సార్సీపీ పట్టించుకోలేదు. వీటన్నింటికి తోడు వైసీపీ ఐదేళ్ల పాలన, ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసారి వైఎస్సార్సీపీకు ఎదురుదెబ్బ తప్పదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

మాగుంట కుటుంబం నుంచే ఆరుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం : ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలో ఒంగోలు, కొండపి, కనిగిరి, దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1984లో జరిగిన ఎన్నికల్లో బెజవాడ పాపిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత నాలుగుసార్లూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, మాగుంట పార్వతమ్మ, మాగుంట శ్రీనివాసరెడ్డి వరుసగా ఎంపీలుగా ఎన్నికయ్యారు. 1999లో మాత్రం తెలుగుదేశం సీనియర్‌ నాయకుడు కరణం బలరాం గెలిచారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైవీ సుబ్బారెడ్డి, 2019 ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి విజయం సాధించారు. గత ఎనిమిది ఎన్నికల్లోనూ మాగుంట కుటుంబం నుంచే ఆరుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2014లో మాత్రం మాగుంట తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి, వైఎస్సార్సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మళ్లీ గత ఎన్నికల సమయంలో మాగుంట తెలుగుదేశాన్ని వీడి, వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో ఇమడలేక, జగన్‌ తీరు నచ్చక వైఎస్సార్సీపీను వీడి మళ్లీ తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జిల్లాలోవైఎస్సార్సీపీకు అభ్యర్థులు దొరక్క చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలుకు వలస తీసుకొచ్చి, ఆ పార్టీ తరుపున పోటీ పెట్టారు.

స్వామిభక్తిని చాటుకున్న పోలీసులు-బాలినేని నామినేషన్ దాఖలులో అడుగడుగునా ఉల్లంఘనలు

తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మధ్య హోరాహోరీ పోరు : ఈ లోక్‌సభ స్థానానికి మాగుంట కుటుంబంతో విడదీయరాని సంబంధం ఉంది. ప్రతీ గ్రామంలో మాగుంటకు ఒక వర్గం ఉంది. వివాద రహితుడిగా, ఎవరినీ నొప్పించకుండా, అందరితో సన్నిహిత సంబంధాలు కలిగిన మాగుంటకు ఇది ఏడో ఎన్నిక కావడం విశేషం. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పూర్తిగా ఈ జిల్లాకు కొత్త కావడం, ఈ ప్రాంత ఓటర్లు, గ్రామస్థాయి కేడర్‌తో పరిచయాలు లేవు. చిత్తూరు నుంచి దాదాపు 200మంది కరడుకట్టిన కార్యకర్తలను, కొంతమంది విశ్రాంత పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లను తీసుకొని ఓ బృందంలా ఏర్పాటుచేసి ప్రతీ మండలం, గ్రామాల్లో పర్యటించి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఆయా గ్రామాల్లో నాయకుడు, కార్యకర్త స్థాయిని బట్టి ఒక రేటు నిర్ణయించి, వారికి నగదు చెల్లించి, తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరంగా ఉన్నాయనే ప్రచారం ఉంది. కొంతమంది పోలీసు అధికారులకు ఫోన్లు చేసి తమకు అనుకూలంగా పనిచేసి సహకరించాలని కోరుతున్నారు. మళ్లీ అధికారం తమదేనని తమకు సహకరించకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు. మొత్తంగా ఇక్కడ తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం, జిల్లాపై పట్టు, మంచివాడనే పేరు ఉండటంతోపాటు కూటమిగా కలిసిరావడంతో మాగుంటకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

దామచర్ల మరోసారి అసెంబ్లీకి రావడం పక్కా : 2019 ఎన్నికల్లో లోక్‌సభ పరిధిలో కొండపి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే తెలుగుదేశం గెలిచింది. కనిగిరి, దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ప్రస్తుతానికి ఒంగోలు మినహా ఈ నియోజకవర్గాలన్నీటిలోనూ ఆ పార్టీ అభ్యర్థులను మార్చింది. ఒంగోలు అసెంబ్లీ టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికే లభించింది. ఈయనకు ప్రత్యర్థిగా ఉన్న దామచర్ల జనార్దన్‌ దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ మళ్లీ గెలిపించాలని కోరుతున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కనీస అభివృద్ధి లేకపోవడంతో బాలినేని చెప్పుకోవడానికి కూడా ఏమీలేదు. పైగా జగన్‌కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి, మరోవైపు వైవీ సుబ్బారెడ్డి జిల్లాపై పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో వీరిద్దరూ తన ఆధిపత్యానికి గండికొడుతున్నారనే భయం బాలినేనిలో కనిపిస్తోంది. ప్రచారంలో కూడా బాలినేని వెనకబడిపోయారు. మొత్తంగా ఇక్కడ నుంచి దామచర్ల మరోసారి అసెంబ్లీకి రావడం పక్కా అనే ప్రచారం సాగుతోంది.

వైఎస్సార్సీపీ నాయకులకు తొత్తులుగా ప్రభుత్వ ఉద్యోగులు - చర్యలకు ప్రతిపక్షాల డిమాండ్

అభివృద్ధి కావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలి : దర్శిలో గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీనుంచి గెలిచిన మద్దిశెట్టి వేణుగోపాల్‌కు ఈ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి వైఎస్సార్సీపీ అవకాశం ఇచ్చింది. ఇక్కడ తెలుగుదేశం నుంచి గొట్టిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు. జిల్లాలో గొట్టిపాటి కుటుంబానికి రాజకీయంగా గుర్తింపు ఉంది. గొట్టిపాటి హనుమంతరావు, గొట్టిపాటి నర్సయ్యలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. గొట్టిపాటి రవి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం బరిలో ఉన్న గొట్టిపాటి లక్ష్మి నర్సయ్య కుమార్తె. ఈమె వృత్తిరీత్యా వైద్యురాలు. సౌమ్యురాలిగానూ పేరున్న ఈమె నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరుతున్నారు. ప్రజల నుంచీ మంచి స్పందన లభిస్తోంది. మరోవైపు దర్శి టికెట్‌ రాకపోవడంతో వైకాపా సిటింగ్‌ ఎమ్మెల్యే మద్దిశెట్టి సైతం లక్ష్మికి మద్దతిస్తున్నారు. దీంతో గొట్టిపాటి లక్ష్మి విజయం ఖాయంగా కనిపిస్తోంది.

ఆయన గెలుపు పక్కా అనే మాట ప్రజల నుంచి భారీగా వినిపిస్తోంది : గత ఎన్నికల్లో గిద్దలూరులో వైఎస్సార్సీపీ నుంచి అన్నా రాంబాబు విజయం సాధించారు. ఐదేళ్లలో నియోజకవర్గంలో ఆశించిన మేర అభివృద్ధి లేకపోవడం, అన్నా రాంబాబు వ్యవహారశైలిపై పెద్దఎత్తున విమర్శలు రావడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి. తనకు టికెట్‌ దక్కదన్న ప్రచారంతో ఓ దశలో తాను అసలు పోటీ చేయనని, రాజకీయాలను వదిలేస్తున్నానని అన్నా రాంబాబు ప్రకటించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో ఈయనను ఇక్కడి నుంచి మార్కాపురం బదిలీ చేశారు. అక్కడ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన నాగార్జునరెడ్డిని బదిలీపై గిద్దలూరుకి తీసుకొచ్చారు. ఈయనపై స్థానికేతరుడనే ముద్ర పడింది. పైగా స్థానికంగా వైకాపా నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు సైతం నాగార్జునరెడ్డికి సహకరించడంలేదు. మార్కాపురం నియోజకవర్గంలో అవినీతి, భూకబ్జాల విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. గిద్దలూరులో తెలుగుదేశం నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కూడా అశోక్‌రెడ్డిపై ఉండటంతో ఆయన గెలుపు పక్కా అనే మాట ప్రజల నుంచి వినిపిస్తోంది.

ఒంగోలులో రెచ్చిపోయిన వైసీపీ - టీడీపీ కార్యకర్త కుటుంబంపై మూక దాడి - అడ్డుకున్న నాయకుడిపైనా!

గ్రామగ్రామాన తిరుగుతూ పార్టీ బలోపేతం చేశారు : ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వడ్‌ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున 2019లో ఆదిమూలపు సురేష్‌, తెలుగుదేశం నుంచి అజితారావు పోటీ చేశారు. విజయం సాధించి మంత్రి పదవి కూడా దక్కించుకున్న సురేష్‌పై ఈసారి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయనను కొండపికి బదిలీ చేశారు. ఇక్కడ వేరే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌కు వైఎస్సార్సీపీ టికెటిచ్చింది. తెలుగుదేశం ఈసారి ఎరిక్షన్‌బాబును రంగంలోకి దింపింది. మూడేళ్లుగా గ్రామగ్రామాన తిరుగుతూ పార్టిని బలోపేతం చేసేందుకు ఎరిక్షన్‌బాబు తీవ్రంగా కృషి చేశారు. ఈసారి తెలుగుదేశం, వైఎస్సార్సీపీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

"ఎస్సీ రిజర్వుడైన కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో 2019లో తెలుగుదేశం నుంచి పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్‌ వెంకయ్యపై 1100 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాను. ఈసారి వైఎస్సార్సీపీలో వర్గవిభేదాలతో వెంకయ్యకు సీటు ఇవ్వలేదు. ఆ పార్టీ తరఫున మంత్రి సురేష్‌ పోటీ చేస్తున్నారు. కొండపిలో ఇప్పటికే రెండుసార్లు గెలుపొందాను. ఇక్కడ తెలుగుదేశం చాలా బలంగా ఉంది. అధికార, విపక్షాల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నా ముచ్చటగా మూడోసారీ డోలా విజయం సాధించే అవకాశం ఉంది." - డోలా బాల వీరాంజనేయస్వామి, కూటమి కొండపి అసెంబ్లీ అభ్యర్థి

నీళ్లు ఇచ్చి కరవును దూరం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు : మార్కాపురం నియోజకవర్గంలో సీనియర్‌ నాయకుడు కందుల నారాయణరెడ్డి మరోసారి తెలుగుదేశం తరఫున పోటీచేస్తున్నారు. వైఎస్సార్సీపీ అన్నా రాంబాబుకు టికెట్‌ కేటాయించింది. మార్కాపురంలో 2019లో తెలుగుదేశం తరఫున నారాయణరెడ్డి, వైకాపా తరఫున నాగార్జునరెడ్డి పోటీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగార్జునరెడ్డి గెలుపొందారు. నాగార్జునరెడ్డిపై అక్రమాలు, భూ ఆక్రమణల ఆరోపణలు రావడంతో గిద్దలూరు నియోజకవర్గానికి బదిలీ చేశారు. గిద్దలూరు నుంచి అన్నా రాంబాబుని ఇక్కడికి మార్చారు. సీనియర్‌ నేత కందుల నారాయణరెడ్డి వరుసగా ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోవడంతో ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. దీనికితోడు వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు ఇచ్చి కరవును దూరం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ఆకాంక్ష సైతం నెరవేరుస్తానని పదేపదే స్పష్టంచేశారు. ఇవన్నీ కలగలిపి తెలుగుదేశం గెలుపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అన్ని అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానం కైవసం : కనిగిరిలో 2019లో తెలుగుదేశం అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ విజయం సాధించారు. మధుసూదన్‌పై పలు ఆరోపణలు రావడంతో ఈసారి ఆయనను ఇక్కడి నుంచి కందుకూరుకు బదిలీ చేశారు. ఈ ఎన్నికల్లో హనుమంతులపాడు జడ్పీటీసీ సభ్యుడు దద్దాల నారాయణకు కనిగిరి టికెట్‌ కేటాయించారు. తెలుగుదేశం నుంచి ఉగ్రనరసింహారెడ్డికే సీటు కేటాయించారు. ఈయన వైఎస్సార్సీపీ అభ్యర్థి కన్నా ప్రచారంలో చాలా ముందున్నారు. ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు అధికారంలోకి వచ్చాక చేపట్టబోయే నివారణ మార్గాలను వివరిస్తున్నారు. దీంతో ఉగ్రనరసింహారెడ్డికే గెలుపు అవకాశం ఉంది. మొత్తంగా లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అత్యధికం గెలుచుకోవడంతో పాటు ఎంపీ స్థానాన్ని సైతం తెలుగుదేశం కైవసం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉంది.

టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డి - చంద్రబాబుతో వర్మ భేటీ

ఒంగోలులో మార్పు ఖాయం!- ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ? (ETV BHARAT)
Last Updated :May 7, 2024, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.