ETV Bharat / state

జగన్​కు వోటేత్తే బూములు, గట్రా లాగీసుకుంతరు - జగన్‌ సర్కార్‌పై ఉత్తరాంధ్ర జనాగ్రహం - Opinion On CM Jagan Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 7:37 AM IST

north andhra public opinion
north andhra public opinion

Opinion On CM Jagan Government: ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైఎస్సార్సీపీ పాలనపై గళమెత్తుతోంది. జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విలేకరుల్లా కాకుండా సాధారణ ప్రయాణికుల్లా ఏదో రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవాళ్లలా రైతులు, రైతు కూలీలు, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మహిళలు, వృద్ధులు, యువకులు, అక్కడక్కడ ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు.

Opinion On CM Jagan Government : ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైఎస్సార్సీపీ పాలనపై గళమెత్తుతోంది. జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న చిన్న పల్లెల్లోనూ ప్రజాగ్రహం కనిపించింది.

శ్రీకాకుళం జిల్లా మారుమూలకు వెళ్లినా, విజయనగరం జిల్లా సరిహద్దుల్లో అడిగినా, మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాలకు వెళ్లినా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 'ఈనాడు' ప్రత్యేక ప్రతినిధి నాలుగు రోజులపాటు ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో వెయ్యికి పైగా కిలోమీటర్లు నగరం, పట్టణం, పల్లె, మారుమూల పల్లె అని కాకుండా ప్రతిచోటా సామాన్య, మధ్య తరగతి, పేద, వ్యాపార వర్గాలను చిన్న పట్టణాల్లో చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారిని పలకరించారు. విలేకరుల్లా కాకుండా సాధారణ ప్రయాణికుల్లా ఏదో రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవాళ్లలా రైతులు, రైతు కూలీలు, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, మహిళలు, వృద్ధులు, యువకులు, అక్కడక్కడ ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు.

మళ్లీ వోటేత్తే - మా పీక నొక్కేత్తన్నడు : శ్రీకాకుళం జిల్లా మందస మండలం కిల్లోయి గ్రామ రైతు మాట్లాడుతూ, 'పట్టా పుస్తకం మీద ఆయన బొమ్మ ఏసేసుకుంటాడేటి? నా బొమ్మో, నాయన బొమ్మో, మావోడి బొమ్మో ఉండాలి గానీ, ఆయనది ఏసేసుకోడమేటి? మా పీక నొక్కేత్తన్నడు. మళ్లీ వోటేత్తే మా బూములుగట్రా లాగీసుకోడని నమ్మకమేటి?' అని అన్నారు.

మాట తప్పడం, మడమ తిప్పడమే జగన్​ నైజం అంటున్న సిక్కోలువాసులు - PUBLIC FIRE ON CM JAGAN ASSURANCES

పెబుత్వం ఇలా ఉంటే కట్టమే : విజయనగరం జిల్లా గరివిడి గ్రామ చివర్లో సైకిళ్లు బాగు చేసుకునే వ్యక్తి మాట్లాడుతూ, 'ఏటి సెప్పమంటరు, పథకాలు, పథకాలు అనేసుకుంటన్నారు. పని ఎక్కడుంది? కుర్రకుంకలు సైౖకిలే తొక్కడం లేదు. బళ్లు అట్టుకొచ్చీసేరు. సైకిళ్లు బాగు సేసుకునే కొట్టు ఎట్టుకున్న. పని లేదు. మా సిక్కొచ్చిపడింది. పెబుత్వం ఇలా ఉంటే కట్టమే. ఈసారి మార్చేయాల్సిందే.' అని ఆవేదన వ్యక్తం చేశారు.

జగనన్న బ్రాండ్లు తాగలేం : గరివిడిలోనే ఓ మందుబాబు మాట్లాడుతూ, 'నేను ఈ మందు సీసా రూ.3 వేలు పెట్టి కొన్నా. జగనన్న బ్రాండ్లు తాగలేం. సరైన బ్రాండ్‌ కావాలంటే సంపాదించిన మొత్తం కన్నా ఎక్కువ పెట్టాల్సి వస్తోంది' అని అన్నారు.

అబ్బో కరెంటు బిల్లులు మండిపోతనాయి : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి సమీపంలో తాటిముంజులు అమ్ముకుంటున్న పేద గీత కార్మిక మహిళ మాట్లాడతూ, 'ఓసారి సూతుమనుకున్నాం. ఏటిసేసిండు. అబ్బో కరెంటు బిల్లులు మండిపోతనాయి. రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు. ఎయ్యి రూపాయల బిల్లొచ్చేసినాది. మళ్లోటిసారా అమ్మో!' అంటూ తన ఆందోళనను వెలబుచ్చింది

మళ్లీ ఈయన్ను సూసేది లేదు : విజయనగరం జిల్లా గజపతినగరం సెంటర్​లో పక్క పల్లెటూరు నుంచి వచ్చిన ఒక కూలీ మాట్లాడుతూ, 'కూలి సేసుకుంటే రోజుకు 600. ఏటికీ సరిపోతలేదు. మందు కొంటే ఇంకేటి ఉంటలేదు. కరెంటు బిల్లులు బారెడు. పిచ్చెక్కిపోనాది. మళ్లీ ఈయన్ను సూసేది లేదు.' అని అన్నారు.

బోడిగుండు చేసేశాడు : విశాఖ నగరం నడిబొడ్డున ఒక యువకుడు మాట్లాడుతూ, 'విశాఖ రాజధాని అన్నారు. ఇక్కడ భూములన్నీ కబ్జాలు చేసేశారు. రుషికొండను బోడిగుండు చేసేశాడు. ప్యాలస్‌ కట్టాడు. అసెంబ్లీ కూడా చూడటానికి అనుమతిస్తారు. ఈ ప్యాలస్‌ చూడటానికి కూడా అంగీకరించడం లేదు. ఉద్యోగాల్లేక ఉత్తరాంధ్ర యువకులం ఇబ్బందులు పడుతున్నాం. ఈసారి ప్రభుత్వం మారిపోతుంది.' అని స్పష్టం చేశారు.

మందు కొనలేం - తాగలేం : శ్రీకాకుళం నడిబొడ్డున పూలు అమ్ముతున్న ఓ చిరువ్యాపారి మట్లాడుతూ, 'ఈసారి టీడీపీ అభ్యర్థి శంకరే. డౌట్‌ లేదన్నా. మళ్లీ జగన్‌ వచ్చాడంటే మందు కొనలేం. తాగలేం. ఎంతకైనా అమ్మేస్తాడు.' అని తెలిపారు.

జగన్ సర్కారు రాదని స్పష్టం : ఆ వర్గం, ఈ వర్గం అని లేదు. ఆ ఊరు, ఈ పల్లె అని లేదు. ఎక్కడికి వెళ్లినా జగన్‌ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. పథకాల పేరుతో డబ్బులిస్తే జీవితాలు సాగిపోవని, పని కావాలని పల్లె ఘోషిస్తోంది. మహిళల్లో విద్యుత్తు ధరలపై చాలా కోపం కనిపిస్తోంది. ధరలు పెరిగిపోయి బతకడం కష్టమైపోయిందన్న ఆవేదనా వినిపిస్తోంది. పథకాలు సైతం అందరికీ అందడం లేదన్న అసంతృప్తి కనిపించింది. రైతులూ కోపంగా ఉన్నారు.

ఉపాధి కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు మద్యం ధరలు పెరిగిపోవడంతో మండిపోతున్నారు. ఈ ఎన్నికల్లో 'మద్యం' చాలా కీలకాంశంగా మారింది. ప్రభుత్వం మారితే మళ్లీ పాత మద్యం బ్రాండ్లు వస్తాయనే నమ్మకంతో సామాన్య పేద పురుషులు కనిపించారు. రోడ్లు బాగాలేవని చాలాచోట్ల జనం మండిపడుతున్నారు. విస్తృత పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తే నూటికి 60 మంది ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఈ సర్కారు రాదని స్పష్టంగా అభిప్రాయపడుతున్నారు.

పెళ్లి తంతు పెట్టుకుంటున్నారా ? అయితే ఆగండి - రాష్ట్ర 'బంధువు జగన్' వచ్చాడంటే అంతే సంగతులు - Problem with CM Jagan Bus Yatra

సామాన్య రైతుకు రాష్ట్ర అప్పులపై ఆందోళన : అనేక చోట్ల రైతులు ధాన్యం అమ్ముకోవడం చాలా కష్టంగా ఉందన్నారు. గతంలో వ్యాపారుల దగ్గర అప్పులు చేసి వాళ్లకు ధాన్యం ఇచ్చేసేవాళ్లమని, ఇప్పుడు రైతుభరోసా కేంద్రాలతో తిప్పలు పడుతున్నామని చెప్పారు. పైరవీ చేసుకునేవాళ్లే ధాన్యం అమ్ముకోగలుగుతున్నారని, ఇలా అయితే కౌలు రైతుల జీవనం కష్టమేనని కొందరు వాపోయారు. మళ్లీ జగన్‌ వస్తే బతకలేమంటున్నారు. కాలువల్లో నీళ్లు రావడం లేదని, తోటపల్లి కాలువలు తవ్వలేదని, బాగు చేయలేదని విజయనగరం జిల్లా మారుమూల ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఊళ్లలో నిశ్శబ్దంగా వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో అది పూర్తిగా బయటపడుతుందని కొందరు అన్నదాతలు చెప్పారు. మారుమూల పల్లెల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడుతున్నారు. పలాస నియోజకవర్గంలో మారుమూల గ్రామంలో ఉపాధి కూలీ, ఆమదాలవలస సమీపంలో బూర్జ మండలం తిమిగాంలో ఓ సామాన్య రైతు కూడా రాష్ట్ర అప్పులపై ఆందోళన వ్యక్తం చేయడం, జనానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎంత అవగాహన ఉందో చెప్పింది.

కుటుంబాలు నరకయాతన : అనేక ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆగ్రహావేశాలు కనిపించాయి. ఈసారి ఎన్నికల్లో శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు ముగ్గురు ప్రజాప్రతినిధుల భవితవ్యాన్ని రాయబోతోంది. ఈ రోడ్డు నిర్మించకపోవడంతో ఐదేళ్లలో ఏకంగా 24 మంది చనిపోయారు. వందల మంది గాయపడి, వారి కుటుంబాలు నరకయాతన పడ్డాయి. ఇది శ్రీకాకుళం, ఆమదాలవలస వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, శ్రీకాకుళం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థికి ప్రతికూలంగా మారబోతోంది. పలాస-కాశీబుగ్గ వద్ద రైల్వే గేటు సమస్య ఆ నియోజకవర్గంపై తీవ్ర ప్రభావం చూపబోతోంది. అక్కడ రైల్వే పైవంతెన నిర్మించకపోవడం ప్రధానాంశమవుతోంది.

మళ్లీ ఇప్పుడు కూడా ఓట్ల కోసమే వస్తున్నారు : ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మంత్రులందరికీ కష్టకాలమే. కొందరు ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు చేసే దందాలు, వసూళ్లు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. మంత్రి సీదిరి అప్పలరాజు తమ ఊళ్లకు రాలేదని, సమస్యలు పట్టించుకోలేదని పలాస మండలంలోనే పలు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొండ ఎమ్మెల్యే కళావతి ఎప్పుడో ఓట్లు అడిగేందుకు వచ్చారని మళ్లీ ఇప్పుడు కూడా ఓట్ల కోసమే వస్తున్నారని గిరిజనులు మాట్లాడుతున్నారు. ఈసారి ఓటేసేది లేదని తేల్చిచెప్పేస్తున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతిపైనా తీవ్ర వ్యతిరేకత ఉంది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం నియోజకవర్గంలో అయితే ప్రజాగ్రహం అంతా ఇంతా కాదు.

ఫలితాలను మార్చేయబోతున్న భూకబ్జాలు : ఉత్తరాంధ్రలో ఈసారి ఎన్నికల్లో భూకబ్జాలు కీలకాంశం. విశాఖ నగరంలో వైసీపీ నాయకులు ఆక్రమించుకున్న భూములు, కబ్జా చేసిన స్థలాలు అక్కడ అధికార పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేయబోతున్నాయి. గజపతినగరంలో ఒక పెద్ద ప్రజాప్రతినిధి ఊళ్లలో భూములన్నీ సొంతం చేసుకోవడం, శ్రీకాకుళం నడిబొడ్డున వైసీపీ పెద్ద స్థలాల ఆక్రమణ, పలాస నియోజకవర్గంలో పట్టా భూములు దౌర్జన్యంగా లాక్కోవడం, దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.

ఆసక్తికర సన్నివేశాలు : ఈ పర్యటనలో చాలాచోట్ల ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు సెంటర్లో మూటలు మోసే వ్యక్తులు ఇద్దరు, ఆటోడ్రైవర్లు మరో ఇద్దరు, మరో ఇద్దరు పేదలు మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చి జగన్‌ ఇస్తున్న పెన్షన్‌ గురించి మాట్లాడటం ప్రారంభించాడు. మూటలు మోసుకునే వ్యక్తి స్పందిస్తూ అసలు పెన్షన్‌ ఎన్టీఆర్‌ హయాంలో ఎలా ప్రారంభమైంది, చంద్రబాబు రూ.2,000 ఎలా చేశాడు, ఆ తర్వాత జగన్‌ రూ.3,000 చేస్తానని, ఐదేళ్లలో విడతలవారీగా వెయ్యి రూపాయలు పెంచడం, ఇప్పుడు చంద్రబాబు రూ.4వేలు ఇస్తాననడం వంటి అంశాలతో వాదనకు దిగాడు.

అక్కడున్న ఆరుగురిలో ఇద్దరు నిశ్శబ్దంగా చూస్తుంటే మరో నలుగురు ఆ మూటలు మోసే వ్యక్తికి జత కలిశారు. పేదల మద్దతు ఎటు వైపు ఉంటుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. ఆమదాలవలస పట్టణంలో ఒక వ్యాపారి అభివృద్ధి కావాలంటుంటే పథకాల వల్ల ప్రజలు బాగుపడతారని ఓ పేదోడు ఆయనతో వాదనకు దిగాడు. పథకాలు వద్దనడం లేదని, అభివృద్ధి కావాలని వ్యాపారి వాదించారు.

కొసమెరుపులు : మళ్లీ జగన్‌ వస్తే ఇక ఇక్కడ ఉండలేం ఎక్కడికైనా వెళ్లిపోవాలి పెద్ద పెద్ద పట్టణాల్లో చాలామంది నుంచి వస్తున్న మాట ఇది. మారుమూల గిరిజన నియోజకవర్గమైన పాలకొండలో సీతంపేట వెళ్లే దారిలో వెలగవాడ వద్ద మధ్యాహ్నం పూట రావిచెట్లు కింద పడుకుని ఉన్న వృద్ధులను కదిలించినా ఇదే మాట వినిపించడం గమనార్హం. 'పథకాలు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ లాక్కుంటున్నారు. మళ్లీ జగన్‌ వస్తే ఊరు వదిలేసి వెళ్లిపోవాలి. పేదలు ఇక్కడ బతకలేం. ఎక్కడికో వెళ్లి ఏదో ఒక పని చూసుకోవాలి' అని వారు చెప్పడం గమనార్హం.

ఉత్తరాంధ్రలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అభిమానులు సైతం అక్కడ స్థానికంగా టీడీపీ గెలుస్తుందని అంగీకరిస్తున్నారు. లేకపోతే హోరాహోరీగా ఉందని, తమ వాడు గెలుస్తాడని చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు. పైన ఎలా ఉంటుందో తెలియదు కానీ అని దీర్ఘం తీస్తున్నారు.

విజయనగర వాసుల మొగ్గు ఎవరి వైపు? - Vizianagaram political review

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.