ETV Bharat / politics

వైసీపీ అభ్యర్థులపై అసంతృప్తి - చల్లారని కలహాల కుంపట్లు - Revolt Against YCP Candidates

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:55 AM IST

Updated : Mar 27, 2024, 9:47 AM IST

Revolt in Constituencies Against YCP Candidates: వైసీపీలో కలహాల కుంపట్లు చల్లారడం లేదు. అధికార పార్టీ అభ్యర్థులపై తిరుగుబాట్లు తీవ్రమవుతున్నాయి. సిట్టింగ్‌లకే ఎసరు పెట్టారని కొందరు, స్థానికేతరులను తెచ్చిపెట్టారని మరి కొందరు చివరి నిమిషంలో వేరేవారికి అవకాశం ఇచ్చాచరంటూ ఇంకొందరు అసంతప్తితో రగిలిపోతున్నారు. కొందరైతే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు ఓటేసేది లేదని సహాయ నిరాకరణకు దిగుతున్నారు. ఎప్పట్నుంచో నమ్ముకుని ఉంటే తమకు అన్యాయం చేశారని ఆక్రోశిస్తున్నారు. ఇంకొందరు పార్టీలో కొనసాగుతూనే ఫ్యాన్‌ రెక్కల్ని విరిచేయాలనే కసితో పని చేస్తున్నారు.

revolt_in_ycp.
revolt_in_ycp.

వైసీపీ అభ్యర్థులపై అసంతృప్తి - చల్లారని కలహాల కుంపట్లు

Revolt in Constituencies Against YCP Candidates : అధికార వైసీపీ అభ్యర్థులపై ఆ పార్టీ నేతల నుంచే తిరుగుబాటు తీవ్రమైంది. మెజారిటీ నియోజకవర్గాల్లో కుమ్ములాటలు నిత్యకృత్యమయ్యాయి. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించేది లేదని కొందరు నేతలు బాహాటంగానే చెప్తుంటే వాళ్లు ఓడితే మాకు సంబంధం లేదని మరికొందరు చేతులెత్తేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాంబునే వైసీపీ మళ్లీ బరిలోకి దించింది. అంబటి అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, గజ్జల నాగభూషణ రెడ్డి, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి వ్యతిరేకించారు. జగన్ స్వయంగా పిలిచి నచ్చజెప్పాక ఆ ముగ్గురూ కాస్త మెత్తబడినట్లు కనిపించినా అంబటికి పూర్తిస్థాయిలో సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. యర్రం వెంకటేశ్వరరె‌డ్డి మాత్రం హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మదమంచి రాంబాబు పార్టీకి రాజీనామా చేశారు. తన వర్గంతో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

కార్యకలాపాలకు దూరంగా నేతలు: పల్నాడు జల్లా చిలకలూరిపేట వైసీపీలోనూ అస్థిరతే కనిపిస్తోంది. సిటింగ్ ఎమ్మెల్యే మంత్రి విడదల రజని కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలతో ఆమెను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. చిలకలూరిపేట నియోజకవర్గం బాధ్యతలు తొలుత మల్లెల రాజేష్‌ నాయుడుకు అప్పగించారు. ఆ తర్వాత స్థానికేతరుడైన గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌నాయుడుని అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీకి దూరంగా ఉంటున్న మల్లెల రాజేష్‌నాయుడు జగన్‌ పిలిచి సర్ది చెప్పినా వెనక్కి తగ్గలేదు. రాజేష్‌కు పట్టున్న సామాజికవర్గం కూడా నిస్తేజంగా మారింది. ఇక గుంటూరు తూర్పు స్థానాన్ని నగర డిప్యూటీ మేయర్‌ సజీల ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి సజీల, ఆమె తండ్రి షౌకత్‌ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.

మంగళగిరిలో మూడు ముక్కలాట: ఇక మంగళగిరి వైసీపీలో మూడు ముక్కలాట నడుస్తోంది. సిటింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి మూడు వర్గాలుగా ఉన్నారు. గత డిసెంబరులో ఆర్కేని తప్పించిన వైసీపీ పెద్దలు గంజి చిరంజీవికి నియోజకవర్గ సమన్వయ బాధ్యతనిచ్చారు. ఆయన పార్టీని ఒక తాటిపైకి తెచ్చుకునేలోపే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన ఆర్కే తిరిగొచ్చారు! ఏమైందో ఏమోగానీ చిరంజీవిని తీసేని హనుమంతరావు కోడలు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించారు. చిరంజీవి మీద ఉన్న కోపంతో ఆర్కే ఆమెకు మద్దతు తెలిపారు. కానీ ఆయన వర్గీయులంతా ఇంతకాలం వ్యతిరేకించి ఇప్పుడెలా పని చేస్తామంటున్నారు. చిరంజీవి కూడా చివరి నిమిషంలో తనను మోసగించారని గుర్రుగా ఉన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు - Protests against YCP MLA candidate

నేతల నుంచి నిరసన గళం: ఇక విజయవాడ సెంట్రల్‌ నియోజవర్గం సీటు సిటింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కాదని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఇచ్చారు. వెల్లంపల్లికి విష్ణుతోపాటు ఆయన వర్గం వ్యతిరేకంగా ఉంది. ప్రచారంలో కూడానూ పాల్గొనకుండా సహాయ నిరాకరణ చేస్తోంది. తిరువూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే రక్షణనిధిని కాదని ఇటీవలే వైసీపీలో చేరిన స్వామిదాస్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. స్వామిదాస్‌కు రక్షణనిధి వర్గం ఎలాంటి సహకారం అందించడం లేదు. ఇక మైలవరంలో సిటింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలుగుదేశంలో చేరడంతో వైసీపీ టికెట్‌ను సర్నాల తిరుపతిరావుకు ఇచ్చారు. రాజకీయంగా పలుకుబడి లేని ఆయనకు పార్టీ నుంచి సరైన మద్దతే దక్కడం లేదు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్‌కి వ్యతిరేకంగా వైసీపీ నేతల నుంచి నిరసన గళం వినిపిస్తోంది.

టీడీపీకి పోటీ ఇవ్వగలరా: గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసిన ఓడిన వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌ తన వర్గంతోపాటు సైకిల్‌ ఎక్కేశారు. నియోజకవర్గంలో మరో కీలకనేత మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా గత ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకపోగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదంటూ అసంతృప్తిగా ఉన్నారు. పెనమలూరులో స్థానికేతరుడైన మంత్రి జోగి రమేష్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథితో పాటు కమ్మ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్ అనుచరులతో కలిసి టీడీపీలోకి వెళ్లారు. పెనమలూరులో వైసీపీ కేడర్‌ ఖాళీ అవడంతో టీడీపీకి కనీసం పోటీ ఇవ్వగలరా అనే చర్చ జరుగుతోంది. ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ వైసీపీలో చేరినా ఆయన వర్గం టీడీపీలోనే ఉండిపోయింది. వైసీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు వంశీ వద్దే వద్దని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.

పవన్ Vs జగన్​​ - పిఠాపురంపై వైఎస్సార్సీపీ స్పెషల్​ ఫోకస్​ - అసంతృప్తి నేతలకు బుజ్జగింపు - YSRCP target on Pawan Kalyan

రగులుతున్న అసంతృప్తి: ఇక కర్నూలులో సిటింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను కాదని, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతియాజ్‌కు హఫీజ్‌ ఖాన్‌ దూరంగా ఉంటున్నారు. ఇదే సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం సమక్షంలో ఇంతియాజ్‌కు మద్దతునివ్వడానికి అంగీకరించినా క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండటంలేదు. నియోజకవర్గ వైసీపీ కేడర్‌తో సంబంధాలు లేకపోవడంతో ఇంతియాజ్‌కు పరిస్థితి ఆగమ్యగోచరంగామారింది. నందికొట్కూరు టికెట్‌ సుధీర్‌కు ఇవ్వడంతో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆర్థర్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనున్నారు. నందికొట్కూరు టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి సుధీర్‌తో కలిసి పని చేయడం లేదు. వైసీపీ ఇన్‌ఛార్జి బైరెడ్డి సిద్దార్ధరెడ్డి కూడా తాను చెప్పినా వినకుండా స్థానికేతరుడిని తెచ్చిపెట్టారనే అసంతృప్తిలో ఉన్నారు. కోడుమూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే సుధాకర్‌ను పక్కనపెట్టి సతీష్‌కు వైకావైసీపీ పా అవకాశమిచ్చింది. కోడుమూరు సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ కాంగ్రెస్‌లో చేరగా సతీష్‌కు ఎమ్మెల్యే సుధాకర్‌ అసలు సహకరించడం లేదు.

స్థానికేతర సమస్య: పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును రాజ్యసభకు పంపిన వైసీపీ ఆ స్థానంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును అభ్యర్థిగా ప్రకటించింది. జోగులు స్థానికేతరుడు కావడంతో పార్టీ కేడర్‌ ఆయన్ను కలవడం లేదు. ఇంతకాలం బాబూరావును వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీలోని వ్యతిరేక వర్గాలు కూడా ఇప్పుడు జోగులును కలుపుకోవడం లేదు. శింగనమలలో వీరాంజనేయులును అభ్యర్థిగా ప్రకటించడాన్ని వైసీపీలోని ఒక ప్రధాన సామాజికవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ వర్గం నేతలంతా స్వతంత్ర అభ్యర్థిని బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

తగ్గేదేలే - 'జగనన్న ముద్దు - రోజా వద్దు' అంటున్న నగరి వైఎస్సార్సీపీ నేతలు

ఉత్తరాంధ్రలో అసమ్మతి: ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా విషయానికొస్తే శృంగవరపుకోట నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావునే వైసీపీ బరిలోకి దించింది. ఇదే సీటును ఆశిస్తున్న ఎమ్మెల్యే ఇందుకూరి రఘురాజు మొదట్నించీ ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారు. రఘురాజు భార్య సుధారాణి 17 మంది ఎంపీటీసీలు, 15 మంది సర్పంచులు, ఇతర నేతలను వెంటబెట్టుకుని వెళ్లి తెలుగుదేశంలో చేరిపోయారు. రఘురాజు సాంకేతికంగా వైసీపీలో ఉన్నప్పటికీ కడుబండికి ఆయన నుంచి ఎలాంటి సహకారమూ ఉండేలా లేదు. విజయనగరంలో ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామినే కొనసాగిస్తున్నారు. అవినీతిలో ఆరిరేతిన వీరభద్రస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని అర్బన్‌ బ్యాంకు మాజీ అధ్యక్షుడు గౌరీశంకర్‌ ఇటీవలే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ప్రకటించారు.

  • గాజువాకలో సిటింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని పక్కనపెట్టి మొదట ఉరుకూటి చందును పార్టీ సమన్వయకర్తగా నియమించారు. చందును ఎమ్మెల్యే వర్గం ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వచ్చింది.
  • మరోవైపు అనకాపల్లిలో ఈసారి పరిస్థితి కష్టమని పక్కనపెట్టిన మంత్రి అమర్నాథ్‌ను, చివరి నిమిషంలో గాజువాక అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పటికే చందును వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే వర్గం ఇప్పుడు అమర్నాథ్‌ రావడంతో మరింత ఆగ్రహంగా ఉంది. మంత్రికి ఎమ్మెల్యే వర్గం పూర్తిగా దూరంగా ఉంటోంది.
  • పాడేరులో సిటింగ్‌ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అక్కడే మళ్లీ పోటీ చేయాలనుకున్నారు. కానీ, ఆమెను హఠాత్తుగా అరకు లోక్‌సభకు మార్చారు. ఇష్టం లేకపోయినా అధిష్ఠానం ఒత్తిడితో సరేనని అక్కడకెళ్లిన ఆమెను చివరి నిమిషంలో తప్పించారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో మత్స్యరాస విశ్వేశ్వరరాజును అభ్యర్థిగా ప్రకటించారు. తమకు అన్యాయం చేశారంటూ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వర్గం అసంతృప్తితో ఉంది.
  • ఇక విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది. మొదట్నుంచీ వైసీపీలో ఉన్న నేతలు గణేష్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌ పార్టీకి రాజీనామా చేయగా పలువురు కార్పొరేటర్లు తమ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించారు. పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు మన్యాల శ్రీనివాసరావు సైతం రాజీనామా చేశారు.
Last Updated :Mar 27, 2024, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.