ETV Bharat / bharat

'పాక్‌ను గౌరవించాలి- లేదంటే భారీ మూల్యం'- మరో వివాదంలో కాంగ్రెస్​ - congress controversial comments

author img

By ETV Bharat Telugu Team

Published : May 10, 2024, 3:19 PM IST

Mani Shankar Aiyar On Pakistan
Mani Shankar Aiyar On Pakistan (ANI)

Mani Shankar Aiyar On Pakistan : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్‌ నేత మణి శంకర్‌ అయ్యర్‌ పాకిస్థాన్‌కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో భారత్‌ చర్చలు జరపాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార బీజేపీ మండిపడింది. మరోసారి కాంగ్రెస్‌, పాకిస్థాన్‌ ప్రేమ కథ బయటపడిందని తీవ్ర విమర్శలు చేసింది.

Mani Shankar Aiyar On Pakistan : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న హస్తం పార్టీకి మరో సమస్య తలెత్తింది. ఆ పార్టీ మరో సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ దాయాది దేశం పాకిస్థాన్‌కు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో భారత్‌ చర్చలు జరపాలని, లేకపోతే భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వివాదా‌స్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన మణిశంకర్‌, పాకిస్థాన్‌కు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వం పొరుగు దేశం పాకిస్థాన్‌తో మాట్లాడానికి బదులుగా మన సైనిక శక్తిని పెంచుకుందామని అంటోందని, దీనివల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయని మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అవి భారత్‌పై వేస్తే మన పరిస్థితి ఏంటని మణిశంకర్‌ ప్రశ్నించారు.

'పిచ్చోడి చేతిలో బాంబు'
పాక్‌తో భారత ప్రభుత్వం చర్చలు జరపాలని లేకుంటే మనం భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని మణిశంకర్‌ అన్నారు. పిచ్చోడి చేతిలో బాంబు ఉంటే ఎలా ఉంటుందో, పాక్ దగ్గర ఉన్న అణుబాంబులను భారత్‌పై ప్రయోగించాలని నిర్ణయించుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. అణుబాంబులు భారత్ వద్ద కూడా ఉన్నాయని కానీ, పిచ్చోడి చేతిలో ఉంటే మరింత ప్రమాదకరం అన్నారు. కాబట్టి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచకుండా చూడాలని మణిశంకర్ అయ్యర్ తెలిపారు.

అయ్యర్​ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్​
మణిశంకర్‌ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. మణిశంకర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్‌ నాయకులు భారత్‌లో ఉంటున్నా వారి మనస్సు మాత్రం పాకిస్థాన్‌లో ఉందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ మండిపడ్డారు. భారత్‌లో నివసించే బదులు పాక్‌కు వెళ్లిపోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ వాస్తవ సిద్ధాంతం బయటపడుతోందని కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశీయ ఉగ్రసంస్థలు, యాసిన్‌ మాలిక్‌ వంటి ఉగ్రవాదులకు కూడా కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలను విభజించడం, అబద్ధాలు, అధికార దుర్వినియోగం, పేదలను తప్పుదారి పట్టించడానికి తప్పుడు హామీలు ఇవ్వడమే కాంగ్రెస్‌ సిద్ధాంతాలని మండిపడ్డారు. కాంగ్రెస్‌, పాకిస్థాన్‌ ప్రేమకథ మరోసారి బయటపడిందని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పునావాలా అన్నారు. కాంగ్రెస్‌, పాక్‌ ప్రేమకథ ముగిసేలా కనిపించడం లేదని విమర్శించారు. ఇది కాంగ్రెస్‌ భారత్‌ కాదని ఇప్పుడు భారత్‌ చాలా శక్తివంతమైందని బీజేపీ నేత, నటుడు రవి కిషన్‌ అన్నారు.

'వాటితో కాంగ్రెస్​కు సంబంధం లేదు'
మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. అయ్యర్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలను తాము పూర్తిగా విభేదిస్తున్నామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్‌ ఖేడా వెల్లడించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ విధానాలను ప్రతిబింబించదని స్పష్టం చేశారు.

'సౌత్​ ఇండియన్స్ ఆఫ్రికన్లలా కనిపిస్తారు'- వివాదాస్పద వ్యాఖ్యలతో శామ్​ పిట్రోడా రాజీనామా - Sam Pitroda Comments

జనం సంపద స్వాధీనంపై శ్యామ్​ పిట్రోడా కీలక వ్యాఖ్యలు- మరో వివాదంలో కాంగ్రెస్ - lok sabha elections 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.