ETV Bharat / bharat

'సాయం కోరుతూ అమిత్ షాకు మమత ఫోన్​!'.. రాజీనామా చేస్తానని దీదీ సవాల్

author img

By

Published : Apr 19, 2023, 5:08 PM IST

Updated : Apr 19, 2023, 5:50 PM IST

mamata banerjee amit shah
mamata banerjee amit shah

తృణమూల్ కాంగ్రెస్​కు జాతీయ పార్టీ హోదా రద్దు విషయమై అమిత్ షాకు తాను ఫోన్​ చేశానన్న వార్తలపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోంమంత్రిని తాను సాయం కోరానని నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేశారు.

తృణమూల్ కాంగ్రెస్​కు జాతీయ పార్టీ హోదా రద్దు అయిన తర్వాత తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసినట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తానని సవాలు చేశారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అమిత్ షాకు మమత ఫోన్ చేశారని బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ఈమేరకు స్పందించారు దీదీ. జాతీయ పార్టీ హోదా పోయినా.. తమ పార్టీ పేరు 'అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్'గానే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. బుధవారం కోల్​కతాలోని సచివాలయంలో రిపోర్టర్లతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ.

"బీజేపీ నాయకులు బహిరంగ సభల్లో బంగాల్ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు చూసి ఆశ్చర్యపోయా. తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీకి జాతీయ హోదాను తొలగించవద్దని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నాలుగు సార్లు ఫోన్ చేశానని ఆరోపిస్తున్నారు. అమిత్​ షాకు నేను ఫోన్ చేసినట్లు నిరూపిస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా. లేదంటే నాపై అసత్య ఆరోపణలు చేసినవారు రాజీనామా చేస్తారా? టీఎంసీ ప్రభుత్వాన్ని బలవంతంగా కూల్చేస్తామన్నందుకే అమిత్ షాను రాజీనామా చేయమన్నా."

--మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

2024 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి 200కన్నా ఎక్కువ సీట్లు రావని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. సీనియర్ రాజకీయ నేత ముకుల్ రాయ్ అదృశ్యం అయ్యారంటూ ఆయన కుమారుడు సుబ్రాంఘ్షు చేసిన ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముకుల్​ రాయ్​ బీజేపీ ఎమ్మెల్యే అని.. ఆయన ఆ పార్టీ పెద్దలను కలవడానికి వెళ్లాలనుకుంటే అది ఆయన వ్యక్తిగత వ్యవహారమని మమత పేర్కొన్నారు.

'నేను టీఎంసీ పార్టీకి రాజీనామా చేశా'
తాను తృణమూల్ కాంగ్రెస్​ రాజీనామా చేశానని తెలిపారు కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముకుల్​ రాయ్​. బీజేపీ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని దిల్లీలో విలేకరుల సమావేశంలో చెప్పారు. తాను గతంలో బీజేపీలో ఉన్నానని.. మళ్లీ అదే పార్టీలో ఉంటానని ముకుల్​ రాయ్ స్పష్టం చేశారు.

మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుల్లో ఒకరైన ముకుల్‌.. తృణమూల్ కాంగ్రెస్​ పార్టీ ప్రారంభం నుంచి కీలకంగా పని చేశారు. అయితే 2017లో దీదీతో రాజకీయపరమైన విభేదాలు రావడం వల్ల పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ అనుమతి లేకుండా భాజపా నేతలను కలిసి తృణమూల్‌ కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత భాజపాలో చేరి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం 2021లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2021లో మళ్లీ సొంతగూటికి(టీఎంసీ) చేరుకున్నారు. మళ్లీ ప్రస్తుతం.. బీజేపీలో తాను ఉన్నట్లు ముకుల్ రాయ్ చెప్పడం గమనార్హం. దిల్లీ పెద్దలను కలవడానికి ముకుల్​ రాయ్​.. మంగళవారం దిల్లీ వెళ్లారు.

Last Updated :Apr 19, 2023, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.