ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ ఇంట్లో పోలీసుల సోదాలు
Police Raids in Madhu Yashki House : శాసనసభ ఎన్నికల వేళ పోలీసులు కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా సోదాలు చేస్తున్నారు. మరోవైపు ముందస్తుగా అందుతున్న సమాచారం ప్రకారం పలువురు అభ్యర్థుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ వినాయకనగర్‌లోని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ (Madhu Yashki) నివాసంలో.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వెళ్లారు.
సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఏలా చేస్తారని వారిని మధుయాస్కీ అడ్డుకున్నారు. అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు తన కుటుంబ సభ్యులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతున్నాననే భయంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులను పంపారని మధుయాస్కీ ధ్వజమెత్తారు. అయితే, డయల్ 100కు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు రావటంతో సోదాలు చేసేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆయన నివాసంలో భారీగా నగదు ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మధుయాస్కీ నివాసం వద్దకు చేరుకున్నారు.సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.