Constable Saved a Person Life : శెభాష్ పోలీస్.. మానవత్వంతో స్పందించి.. ప్రాణాలను నిలిపి..
Published: May 19, 2023, 1:32 PM

Constable Saved a Person Life in Bhadrachalam : ఓ పోలీస్ కానిస్టేబుల్ ఔదార్యం.. ఒక మనిషి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన భద్రాచలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మురుగు కాలువలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని గమనించిన కానిస్టేబుల్ ప్రసాద్.. బాధితుడి ప్రాణాలను కాపాడాడు. స్థానికుల సహాయంతో మురుగు కాలువలో పడ్డ వ్యక్తిని బయటకు తీశాడు. కొనఊపిరితో ఉన్న అతడికి ప్రథమ చికిత్స అందించారు. ఒళ్లంతా శుభ్రంగా కడిగి నీళ్లు తాగించారు. దాంతో స్పృహ కోల్పోయిన వ్యక్తి కోలుకొని పైకి లేచాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక కాలువలో పడిపోయి ఉంటాడని కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు.
"గత రాత్రి నేను విధుల్లో ఉండగా.. చెత్త కుప్పలో పడిపోయిన ఓ వ్యక్తిని చూశాను. అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని ముక్కు, నోట్లోకి చెత్త, బురద వెళ్లిపోయింది. వాటర్‌తో శుభ్రం చేసి స్థానికుల సహాయంతో ప్రాణాలు కాపాడాను. బహుశా ఎండ తీవ్రత వలన ఆయన స్పృహ తప్పిపడిపోయి ఉంటాడు.- ప్రసాద్, పోలీస్ కానిస్టేబుల్