ఎంపీ టికెట్ హామీతో నామినేషన్ ఉపసంహరించుకున్న పటేల్ రమేశ్ రెడ్డి
Patel Ramesh Reddy Withdraws Nomination : సూర్యాపేట నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేశ్‌రెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. మొదట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినా.. దక్కకపోవడంతో రెబెల్‌గా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దామోదర్‌రెడ్డి గెలుపు అవకాశాలను రమేశ్‌రెడ్డి ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో.. హస్తం పార్టీ నాయకులు రమేశ్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తొలుత పటేల్ రమేష్‌రెడ్డితో ఏఐసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రోహిత్ చౌదరి సమావేశమయ్యారు. ఈ క్రమంలో కొన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ ఉపసంహరించుకునేది లేదని, అవసరమైతే దామోదర్‌రెడ్డినే పోటీ నుంచి తప్పించాలని రమేశ్‌రెడ్డి వర్గీయులు డిమాండ్ చేశారు.
చర్చలు జరుగుతున్న గది వైపు రమేశ్‌రెడ్డి అనుచరులు రాళ్లు విసిరారు. సమావేశానికి వెళ్లిన మల్లు రవి, రోహిత్ చౌదరీలను బయటకు వెళ్లనివ్వకుండా తాళం వేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో మల్లు రవి, రోహిత్ చౌదరి చర్చించారు. ఆ పార్టీ నాయకులు రమేశ్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన నామినేషన్ ఉపసంహరణకు అంగీకరించారు. ఈ సందర్భంగా పటేల్ రమేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు.