మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Minister Errabelli Dayakar Rao Interview : పాలకుర్తిలో సరైన అభ్యర్థి దొరక్క.. ఎన్ఆర్ఐని కాంగ్రెస్ బరిలో నిలిపిందని.. అయినా ఆమెకు ఎలాంటి ప్రజాదరణ లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తానెలాంటి తప్పు కానీ, మోసం కానీ చేయలేదని.. అది ప్రజలకు తెలసని చెప్పారు. ప్రతిపక్షాలు అధికార పగ్గాలు చేపట్టాలని కోరుకోవడం సహజమేనని.. కానీ కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నందున ఆయన సీఎం కావడం తథ్యమని చెప్పారు. బీజేపీ బీసీ నినాదం ఒక డ్రామా తప్ప మరేం కాదని ఎద్దేవా చేశారు.
ప్రజలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి నాయకులను ఎన్నుకుంటారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అప్పటి తెలంగాణలో ప్రజలు కరెంట్‌కు, నీటికి గోస పడ్డారని.. ఇప్పుడు అలాంటి బాధ ఎవరికీ లేదని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారని హేళన చేశారు. పీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మూడు గంటల కరెంట్ చాలంటున్నారని విమర్శించారు.