T-Works made Irani Chai Machine : 72 గంటలు నాన్‌స్టాప్.. ఇరానీ చాయ్ యంత్రాన్ని తయారు చేసిన 'టీ వర్స్క్'
Published: May 22, 2023, 5:11 PM

T-Works made Irani Chai Machine in Hyderabad : హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ధమ్ బిర్యానీ, ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ కేవలం టీ కాదు.. ఇది హైదరాబాదీ సంప్రదాయం. ఆవకాయ పెరుగన్నం ఎంత ప్రత్యేకమో.. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్ హైదరాబాదీల జీవన విధానంలో అంత ఫేమస్. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరు దీనిని రుచి చూడకుండా వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్ నగరంలో లభించే ఇరాని చాయ్ చాలా ప్రసిద్ధి. ఇరానీ చాయ్‌కున్న ప్రత్యేకత మరేదానికి లేదు. ఇండియాలోని ప్రతి ప్రాంతంలో దీనిని ప్రత్యేక పానీయంగా తీసుకుంటారు. పొగలు కక్కుతూ ఘుమఘుమలాడే వాసన, ప్రత్యేకమైన రుచి ఉన్న ఇరానీ చాయ్‌కు భాగ్యనగరం పెట్టింది పేరు. ఎందుకంటే దీని తయారీ విధానం, దీన్ని తయారు చేయడానికి వాడే పదార్థాలే దీనికి కారణం. అలాంటి చాయ్‌ను ఇప్పుడు హోటల్లో కాదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీ వర్స్క్ ఇన్ హౌస్ ఇరానీ చాయ్ యంత్రాన్ని రూపొందించింది. దేశంలోనే అత్యుత్తమ ప్రొటోటైపింగ్ కేంద్రంగా ఉన్న టీ వర్క్స్.. కేవలం 72 గంటల్లో ఈ చాయ్ మెషీన్‌ను రూపొందించినట్లు టీ వర్క్స్ సీఈఓ సుజయ్ కారంపురి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. పూర్తిగా ప్రామాణికమైన హైదరాబాదీ ఇరానీ చాయ్‌ను ఈ యంత్రం ద్వారా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని తెలిపారు. 'చాయ్ మినార్' పేరుతో రూపొందించిన ఈ యంత్రాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు టీ వర్స్క్ సీఈఓ సుజయ్ కారంపురి తెలిపారు.