thumbnail

నీటి పైప్​లైన్ పేలి మహిళ మృతి.. 50ఇళ్లు ధ్వంసం.. రూ.లక్షల్లో నష్టం

By

Published : May 26, 2023, 8:30 AM IST

Guwahati water pipe burst : అసోంలోని గువాహటిలో నీటి పైప్​లైన్ పేలడం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఖార్గులీ ప్రాంతంలో పైప్​లైన్ పేలింది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 19 మందికి గాయాలయ్యాయి. 50 ఇళ్లు తుడిచిపెట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. మృతురాలిని సుమిత్రా రాభాగా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Guwahati water burst : జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ ఈ వాటర్ పైప్​లైన్లను నిర్మించింది. పైప్​లైన్ పేలగానే నీరు భారీగా ఎగసిపడింది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రాంతంలో ఉన్న 300 మంది ఈ ఘటనతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.

బాధిత కుటుంబాలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమస్యను పరిష్కరిస్తామని గువాహటి మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ (జీఎండీఏ) అధికారులు హామీ ఇచ్చారు. నీటి సరఫరాను వెంటనే పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ అథారిటీ పనితీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థ చేపట్టిన నిర్మాణాల్లో నాణ్యతాలోపాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నీటి సరఫరా ప్రాజెక్టును 2012-13లో ఈ సంస్థకు కట్టబెట్టింది. ప్రతి ఇంటికి నీరు అందించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2016 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తికావాల్సి ఉంది. కానీ, జేఐసీఏలో అనేక అవకతవకల కారణంగా ఇప్పటికీ నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. జేఐసీఏలో అవినీతి ఆరోపణలపై అసోం ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో విచారణకు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.