ఉప్పల్ పరిధిలో పోలీసుల తనిఖీలు, రూ.50 లక్షల నగదు పట్టివేత
Rs.50 Lakhs Cash Seized at Uppal Police Station : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో అగ్ర పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు కూడా పటిష్ఠంగా తనిఖీలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొందరు నగదును తెలివిగా సరఫరా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధి రామంతాపూర్‌లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.50 లక్షలు తరలిస్తున్న ఇద్దరూ యువకుల్ని పట్టుకున్నారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ సంస్థలకు చెందిన ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. ఇరువురిపై కేసు నమోదు చేశారు.
వివేక్ ఆదేశాల మేరకు చెన్నూరు నియోజకవర్గంలోని ఎన్నికల ఖర్చు కోసం రూ.50 లక్షలు తీసుకెళ్తున్నామని యువకులు ఒప్పుకున్నారని పోలీసులు చెబుతున్నారు. పట్టుబడిన వారు విశాఖ ఇండస్ట్రీస్‌లో పనిచేస్తున్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవి కిషోర్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ముదిగంటి ప్రేమ్ కుమార్‌గా పోలీసుల విచారణలో తేలింది. వారి నుంచి నగదు, రెండు మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.