జుక్కల్ నియోజకవర్గంలో విన్నూతంగా గుర్రంతో ఎన్నికల ప్రచారం
Election Campaign with Horse at Jukkal Constituency : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం జోరుగా చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొందరు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో విన్నూతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ ప్రాంతం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల అక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నీ విన్నూతంగానే కనిపిస్తుంటాయి. మహారాష్ట్ర సరిహద్దులో పెద్దగుల్ల గ్రామంలో జుక్కల్ బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్రంతో జుక్కల్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. దానిపై పార్టీ నాయకులు కూర్చొని ర్యాలీ చేశారు. ఇంటింటి ప్రచారం చేస్తూ గుర్రంతో నృత్యం చేయించారు. గుర్రంతో ఎన్నికల ప్రచారం చేయడంతో అందరూ ఆకర్షతులయ్యారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో అన్నీ పార్టీలు విన్నూత ప్రచారం చేస్తున్నాయి. అగ్ర పార్టీల నాయకులతో పాటు కార్యకర్తలు సైతం ప్రచారం ట్రెండింగ్‌గా ఉండేటట్లు వ్యూహాలు రచిస్తున్నారు.