దీపావళి పండుగ ఎఫెక్ట్ - సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన జనం
Diwali Effect Patients Queue : దీపావళి పండుగ పూట కొన్ని కుటుంబాల్లో విషాదం నెలకొంది. కొందరు టపాసులు కాలుస్తూ ప్రమాదాల బారినపడ్డారు. హైదరాబాద్‌లో బాణాసంచా కాలుస్తూ గాయపపడిన వారి సంఖ్య 50కి పెరిగింది. బాధితులంతా మెహిదీపట్నం రోడ్డులోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రికి క్యూ కట్టారు. దీపావళి రోజు (గురువారం) బాణాసంచా పేలుస్తూ గాయపడ్డారని వైద్యులు తెలిపారు.
Diwali Effect In Hydrabad : ఆసుపత్రికి సుమారు 50 మంది రాగా, అందులో 31 మంది పిల్లలు ఉన్నారు. వారిలో 45 మందికి వైద్యులు ప్రథమచికిత్సను అందించారు. అనంతరం 45 మందిని పంపించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు ఒకరికి ఆపరేషన్ చేశారు. ఆ నలుగురిలో మరొకరికి ఈరోజు ఆపరేషన్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురిని అబ్జర్వేషన్లో పెట్టినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. పండుగ సందర్భంగా హాస్పిటల్లో పేషంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్.ఎం.ఓ అధికారి తెలిపారు.