ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరుతో ప్రజల్ని మోసం చేస్తోంది : అజారుద్దీన్
Congress Candidate Mohammed Azharuddin in Election Campaign : రాష్ట్రంలో అధికార పార్టీ బంగారు తెలంగాణ పేరుతో పేద ప్రజలను మోసం చేస్తోందని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం డివిజన్లో అజారుద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలకు వివరిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆర్భాటాలు తప్ప అభివృద్ధిలో శూన్యమని.. కేవలం అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని అజారుద్దీన్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.