BJP Nirudyoga march In Khammam : ఖమ్మంలో బీజేపీ నిరుద్యోగ మార్చ్ ప్రత్యక్షప్రసారం
Published: May 27, 2023, 12:30 PM

BJP Nirudyoga march In Khammam : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ బీజేపీ నేతృత్వంలో ఖమ్మంలో ఇవాళ సాయంత్రం ‘నిరుద్యోగ మార్చ్’ చేపట్టనున్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో నిరుద్యోగులు, విద్యార్థులు నిరుద్యోగ మార్చ్ కార్యక్రమంలో పాల్గొనేలా ఆ పార్టీ నాయకులు చర్యలు చేపట్టారు.
ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, సిట్ విచారణలో దోషులను ఇంకా తేల్చలేదని, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దు వల్ల నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్లతో నిరుద్యోగ మార్చ్ చేపట్టనున్నారు. ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి మయూరి సెంటర్ వరకు ఈ మార్చ్ కొనసాగనుంది. అనంతరం బండి సంజయ్ పలు అంశాలపై ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలోని ప్రధాన కూడళ్లను పార్టీ జెండాలు, తోరణాలతో అలంకరించారు. నిరుద్యోగ మార్చ్ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శాంతకుమార్, కాసం వెంకటేశ్వర్లు, గల్లా సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, రుద్ర ప్రదీప్, దొంగల సత్యనారాయణ దగ్గరుండి పరిశీలించారు.