Protein Importance In Human Body : శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. దేహంలోని ప్రతి కణంలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మన రోజువారీ పనులకు తగినంత శక్తిని అందిస్తాయి. చర్మం, జుట్టు, మెదడు, గుండె.. ఇంకా ఇతర అవయవాల ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా అవసరం. పిల్లల శరీర పెరుగుదల, అభివృద్ధి సవ్యంగా జరిగేందుకు ప్రోటీన్లు ఎంతగానో తోడ్పడతాయి. పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను నివారించాలంటే తగిన స్థాయిలో ప్రోటీన్లు వారికి అందాలి. అలాంటి ప్రోటీన్లు నిర్వహించే విధులు, వాటి కొరత వల్ల వచ్చే సమస్యలు, అవి లభించే ఆహారాలు తదితర అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Uses Of Protein In Your Body : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. మన దేహానికి ప్రోటీన్ల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం సవ్యంగా ఉండాలన్నా.. శక్తిమంతంగా పనిచేయాలన్నా తగిన స్థాయిలో ప్రోటీన్లు ఉండాలి. మన శరీరం అంతటికీ రక్తం ద్వారా ఆక్సిజన్‌ను అందించేవి ప్రోటీన్లే. ఇన్ఫెక్షన్లపై పోరాడే యాంటీబాడీస్‌ను తయారు చేయడంలో ప్రోటీన్లే సాయపడతాయి. మన శరీర అవయవాలు, కండరాలు, కణజాలం, ఎముకలు, చర్మం, వెంట్రుకలు.. ఇలా అన్నింటిలోనూ ప్రోటీన్లు ఉంటాయి. దేహానికి కావాల్సిన శక్తిని ప్రోటీన్లు అందిస్తాయి.
Protein Rich Food For Kids : ఇన్ని ముఖ్యమైన విధులను నిర్వర్తించే ప్రోటీన్లు లేకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే వయసును బట్టి ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగేళ్ల లోపు పిల్లలకు రోజుకు 13 గ్రాములు, నాలుగు నుంచి ఎనిమిదేళ్ల వయసు ఉన్న వారికి 19 గ్రాములు, తొమ్మిది నుంచి పన్నెండేళ్ల వయసు లోపు వారికి 34 గ్రాములు ప్రోటీన్ అవసరం ఉంటుంది. అదే పద్నాలుగేళ్లు పైబడిన బాలికలు, మహిళలకు 46 గ్రాములు, 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న మగపిల్లలకు 52 గ్రాములు.. 19 ఏళ్లు పైబడిన మగవారికి 56 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది.
'ఆర్గాన్ డ్యామేజ్, స్కిన్ డ్యామేజ్, టిష్యూ రిపేర్, మజిల్ బిల్డింగ్‌కు ప్రోటీన్లు చాలా దోహదపడతాయి. 20 ఏళ్ల లోపు వారికి రోజుకు కనీసం రెండు గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఎదిగే వయసు కాబట్టి ఆ వయసు వారు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ప్రోటీన్‌ను చేర్చాలి. శరీర బరువును బట్టి ప్రోటీన్‌ను ఇవ్వాలి. ఉదాహరణకు వ్యక్తి బరువు 60 కిలోలైతే.. కేజీకి ఒక గ్రాము చొప్పున కనీసం 50 నుంచి 60 గ్రాముల ప్రోటీన్ అందేలా చూసుకోవాలి. ప్రోటీన్లను శాకాహారం లేదా మాంసాహారం రూపంలో తీసుకోవచ్చు. శాకాహారం మాత్రమే తినేవారు బీన్స్, నట్స్, సోయా ఉత్పత్తులు, టోఫు లాంటివి ఎక్కువగా డైట్లో తీసుకుంటూ ఉండాలి. అదే మాంసాహారం భుజించే వారు వారానికి ఒకసారి చికెన్ లేదా చేపలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది' అని ప్రముఖ డైటీషియన్ శ్రావ్య సూచించారు.
శాకాహారులు అవి ఎక్కువగా తినాలి
Protein Rich Food Veg India : శారీరకంగా శ్రమపడి చేసే పనులకు ప్రోటీన్ల అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్ల వయసు నుంచి కండరాల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. కాబట్టి ఈ వయసు నుంచి ప్రోటీన్ల అవసరం అధికంగా ఉంటుంది. అయితే బరువు ఎక్కువగా ఉన్నవారు తక్కువ కేలోరీలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పోషకాహార నిపుణులు ప్రోటీన్లు ఉన్న ఆహారం ఏం తినాలి, ఎంత తినాలో సూచిస్తారు. చేపలు, చికెన్, గుడ్లు, పాల పదార్థాలు, పెరుగులో తగినంత ప్రోటీన్ లభిస్తుంది. శాకాహారులైతే మొక్కల ద్వారా లభించే ఆహారాల ద్వారానే ప్రోటీన్లను పొందొచ్చు. గింజలు, విత్తనాలు, పప్పులు, చిక్కుళ్లు, బటానీలు, గోధుమ, సోయా వంటి ఆహారాల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మాంసాహారులు ప్రోటీన్లు అధికంగా ఉండే శాకాహారాన్ని ఎక్కువగా, మాంసాహారాలను తక్కువగా కలిపి తీసుకోవచ్చు. ప్రోటీన్లను ప్రాసెస్ చేసిన మాంసాహారం ద్వారా పొందడం మంచిది కాదు.
మోతాదుకు మించి తీసుకుంటే..?
Side Effects Of Protein Overdose : ప్రోటీన్లు అత్యవసరమే కానీ వీటికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో ఎంతస్థాయిలో ప్రోటీన్లు ఉండాలో చూసుకోవాలి. ప్రోటీన్లు, కొవ్వులను మాత్రమే తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలన్నీ అందక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలసట, తలనొప్పి, మగత, శ్వాసలో చెడు వాసన, మలబద్దకం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే అవసరానికి మించి ప్రోటీన్లు తీసుకోవడం కూడా మంచిది కాదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో చెడు కొవ్వు అధికంగా ఉండే ఛాన్స్ ఉంది, గనుక గుండెకు హాని చేసే ప్రమాదం ఉంటుంది. అదనంగా తీసుకునే ప్రోటీన్లు మూత్రపిండాలకు కూడా హాని చేయొచ్చు. కాబట్టి ప్రోటీన్లను తగినంత మోతాదులోనే తీసుకోవాలి.
ఇవీ చదవండి : మీరు శాకాహారులా? అయితే ఈ ప్రొటీన్ ఫుడ్ మీ కోసమే!
సడెన్‌గా బరువు తగ్గిపోతున్నారా? షుగర్ ఉన్నవారిలో ప్రోటీన్ లాస్‌కు కారణం అదే!