ఈ డైట్​ను పాటించండి.. నిండు నూరేళ్లు జీవించండి!

author img

By

Published : Sep 23, 2022, 7:44 AM IST

Updated : Sep 23, 2022, 8:54 AM IST

longevity diet

longevity diet: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం చాలా అవసరం. అయితే దీర్ఘకాలం జీవించాలంటే మాత్రం 'లాంజివిటీ డైట్'​ను పాటించమంటున్నారు వాల్టర్ లాంగో అనే జీవరసాయన శాస్త్రవేత్త. నిర్దిష్ట సమయంపాటు ఉపవాసం ఉండటమన్నది ఈ డైట్‌లో కీలకాంశం. నిద్రించడానికి 3-4 గంటల ముందు ఏమీ తినకూడదు. ఇలా ఈ డైట్​లో పలు అంశాలు ఉన్నాయి. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

longevity diet: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం చాలా అవసరం. అది మన ఆయుర్దాయాన్ని సైతం ప్రభావితం చేయగలదు! కాబట్టి సరైన ఆహార నియమాలపై శ్రద్ధ అత్యావశ్యకం. ఇందుకోసం కీటో డైట్‌, మెడిటెర్రేనియన్‌ డైట్‌ వంటి పేర్లతో రకరకాల ఆహార విధానాలు ఇప్పటికే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అదే కోవలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు- 'లాంజివిటీ డైట్‌'.

ఏమిటీ డైట్‌?
వాల్టర్‌ లాంగో అనే ఓ జీవరసాయన శాస్త్రవేత్త 'లాంజివిటీ (దీర్ఘాయువు) డైట్‌'ను రూపొందించారు. మనిషి జీవితకాలాన్ని బాగా పెంచేందుకు ఈ ఆహార విధానం దోహదపడుతుందని ఆయన చెబుతున్నారు. ఏం తినాలి? ఏం తినొద్దు? అనే అంశాలపై ఇందులో పలు సిఫార్సులు చేశారు. జన్యువులపై పోషకాల ప్రభావం, ఉపవాసం ఫలితాలపై లాంగో అనేక పరిశోధనలు చేశారు. లాంజివిటీ డైట్‌ను పక్కాగా పాటించడం ద్వారా 120 ఏళ్లు జీవించాలన్నది లాంగో ప్రణాళిక.

ఎవరి కోసం?
ప్రధానంగా వృద్ధుల కోసం ఈ ఆహార నియమాలను తయారుచేశారు. యువత కూడా వాటిని అనుసరించొచ్చని చెబుతున్నారు.

.

ఇందులో ఏముంటాయ్‌?: ఆకుకూరలు, ఫలాలు, బీన్స్‌, బాదం వంటి గింజలు (నట్స్‌), ఆలివ్‌ నూనె, పాదరసం తక్కువగా ఉండే సముద్ర సంబంధిత ఆహారం. మొక్కల నుంచి వచ్చే ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైబర్‌, యాంటీఆక్సిడెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు, లవణాలు తక్కువగా ఉంటాయి. మొక్కల ఆధారిత ఆహారాన్నే ఈ డైట్‌లో అధికంగా సిఫార్సు చేశారు. ఇది మెడిటెర్రేనియన్‌ డైట్‌కు దగ్గరగా ఉంటుంది.

వేటికి దూరంగా ఉండాలి?
మాంసం, పాల ఉత్పత్తులు (పెరుగు మినహా) ఎక్కువగా తినకూడదు. సంతృప్త కొవ్వులు, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవద్దు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉండలేనివారు.. ఆవు/మేక/గొర్రె పాలు తీసుకోవచ్చు.

.

నిర్దిష్ట విరామాలతో..: నిర్దిష్ట సమయంపాటు ఉపవాసం ఉండటమన్నది ఈ డైట్‌లో కీలకాంశం. రోజులో మనం తీసుకునే మొత్తం ఆహారాన్ని కేవలం 12 గంటల వ్యవధిలోనే (ఉదాహరణకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యే) భుజించాలి. నిద్రించడానికి 3-4 గంటల ముందు ఏమీ తినొద్దు. వారంలో రెండు రోజులు 2-3 వేల కిలోజౌళ్ల కంటే తక్కువ ఆహారాన్ని తీసుకొని.. మిగతా 5 రోజులు సాధారణ స్థాయిలో భుజించడం ఇందులో మరో విధానం. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల నియంత్రణ మెరుగ్గా ఉంటుందని.. టైప్‌-2 మధుమేహం, ఊబకాయం, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుందని లాంగో చెబుతున్నారు.

ప్రొటీన్లను ఎంత తీసుకోవాలి?
ఈ విధానంలో ప్రొటీన్ల ఆరగింపు.. వ్యక్తి శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. రోజుకు- ఒక కిలో బరువుకు.. 0.68-0.80 గ్రాముల కంటే ఎక్కువ ప్రొటీన్‌ను తీసుకోకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 70 కిలోల బరువుంటే.. రోజుకు 47-56 గ్రాములకు మించి ప్రొటీన్లను ఆరగించొద్దు.

.

ఏమైనా దుష్ప్రభావాలుంటాయా?: ప్రతి 3-4 రోజులకోసారి మల్టీవిటమిన్‌, మినరల్‌ సప్లిమెంట్స్‌ తీసుకోవాలని ఈ డైట్‌లో సిఫార్సు చేశారు. అయితే వైద్యుల సూచన లేకుండా వాటిని తీసుకోవడం సరికాదన్నది ఆరోగ్యరంగ నిపుణుల మాట. ఆ సప్లిమెంట్స్‌ను ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్‌, గుండెవ్యాధుల ముప్పు పెరగొచ్చన్నది వారి ఆందోళన. వ్యాయామం గురించి ఈ డైట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం.

ఇవీ చదవండి: విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అందాలా? ఇవి తినండి!

రోజుకు ఎన్ని గ్రాముల ఉప్పు తినొచ్చు? ఎక్కువైతే ఏమవుతుంది?

Last Updated :Sep 23, 2022, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.