Skin Tips: చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే చెడు అలవాట్లు ఇవే..!

author img

By

Published : Sep 20, 2021, 7:00 AM IST

Bad Habits for skin

చర్మం... మన ఆరోగ్యానికి కిటికీ లాంటిది. మన శరీరాన్ని అనుక్షణం ప్రతికూల పరిస్థితుల నుంచి కాపాడే అద్భుతమైన రక్షణ కవచం. మరి ఇలాంటి సున్నితమైన చర్మం (Skin Tips)మనం చేసే కొన్ని చిన్న చిన్న చెడు అలవాట్ల కారణంగా దెబ్బతింటుంది. ఈ చెడు అలవాట్లు మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. మరి మనం తెలిసో.. తెలియకో చేసే ఆ పొరపాట్లు ఏంటి? వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

చర్మం కాంతివంతంగా నిగనిగలాడుతూ.. ఉండాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు తమ చర్మసౌందర్యం కోసం రకరకాల చిట్కాలు (Skin Tips) పాటిస్తారు. కానీ పురుషుల్లో ఈ ధ్యాస కాస్తా తక్కువగానే ఉంటుంది! పైగా రకరకాల అలవాట్లు, జీవన విధానం, వాతావరణ మార్పుల వల్ల చర్మం కాంతిహీనంగా తయారవుతుంది. అందుకే కొన్ని అలవాట్లు మార్చుకుంటే చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారే అవకాశం ఉంటుంది. చాలామంది పడుకునే ముందు ముఖం కడుక్కోరు. ఆ అలవాటును మార్చుకోవాలి. కచ్చితంగా నిద్రపోవడానికి ముందు ముఖం కడుక్కోవాలి. అంతేకాదు తప్పనిసరిగా స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై ఉండే చమటతో పాటు చర్మంపై మంట కూడా తగ్గుతుంది. చర్మంపై దురద లేక మంటను నివారించుకునేందుకు మాయిశ్చరైజర్​తో ఉండే జెంటెల్​ క్రెన్సర్లు లేదా బొటానికల్​ ఆయిల్​ వాడుకోవాలి. ఇవి చర్మాన్ని కాంతివంతగా ఉంచుతాయి.

చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే చెడు అలవాట్లు

  • సాధారణగా ముఖంపై మచ్చలు మొటిమల వల్ల ఏర్పడుతాయి. యుక్తవయసులోకి వచ్చిన సమయంలో వచ్చే ఈ మొటిమలను గిల్లడం చేయకూడదు. ఇలా చేస్తే అవి నల్లటి మచ్చలుగా మారుతాయి. దీంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.
  • చర్మానికి ఉపయోగించే సౌందర్యలేపనాలు(ఫెయిర్​నెస్ క్రీమ్స్) విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ముందు చర్మం తత్వాన్ని తెలుసుకోవాలి. మన చర్మం తీరు తెలుసుకొని ఫేస్​ క్రీములు ఉపయోగించాలి.
  • పొగతాగే వారి చర్మంలోనూ విపరీతమైన మార్పులు వస్తాయి. పొగాకులో ఉండే నికోటిన్​ రక్త ప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. ఇందులోని రసాయనాలు కొల్లాజన్​ను నాశనం చేస్తాయి. దీంతో చర్మకణాల నిర్మాణంలో తేడా వస్తుంది. ఫలితంగా చర్మం పలుచగా తయారవుతుంది.
  • పొగతాగే వారిలో చర్మం ముడతలు పడినట్లు మారుతుంది. పొగాకు మానేసి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. చర్మం తిరిగి కాంతివంతమవుతుంది.
  • సూర్యరశ్మిలో ఎక్కువగా ఉండే వారు సన్​స్కిన్​ లోషన్​ను ఉపయోగించాలి.
  • ఆర్టిఫీషియల్​ జ్యూవెలరీలో ఉండే నికిల్​ చాలామందికి పడదు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మాన్ని కాపాడుకోవచ్చు.
  • తెల్ల జుట్టు కనిపించకుండా వేసే తలరంగు విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రంగుల వల్ల అలెర్జీ వస్తుంది. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.
  • మనలో చాలామంది పెదాలు పొడిబారి పోయాయని తరుచూ తడుపుకుంటూ ఉంటారు. ఇలా చేయడం మూలాన పెదాల చుట్టూ నల్లగా మారుతుంది. దీంతో వికారంగా కనిపిస్తాం.
  • మహిళలు నూనె పెట్టుకుని తలస్నానం చేసి వదులుగా ముడి వేసుకుంటారు. దీంతో వెనుక వీపు భాగంలో దద్దులు వస్తాయి.
  • చక్కెర ఎక్కువ ఉండే స్వీట్లను తగ్గించాలి. ముఖ్యంగా శీతలపానియాలను దూరం పెట్టాలి. లేకపోతే ఆ ప్రభావం చర్మంపై పడుతుంది. ముడతలు పడతాయి. దీంతో వృద్ధులుగా కనిపిస్తారు.
  • చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే కూరగాయలు, పండ్లు రోజు వారి ఆహారంలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు లభించి చర్మానికి అవసరమైన మరమ్మతులు చేస్తాయి.

ఇలాంటి మన చెడు అలవాట్ల కారణంగా చర్మసౌందర్యాన్ని కోల్పోతాము. కాబట్టి వీటిని వీలైనంత వరకు తగ్గించుకుంటే చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.

ఇదీ చూడండి: Acne Remedies: ముఖంపై మొటిమలా? ఈ చిట్కాలు మీకోసమే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.