గత ఇరవై రోజుల యాదాద్రీశుని ఆదాయం ఎంతో తెలుసా..

గత ఇరవై రోజుల యాదాద్రీశుని ఆదాయం ఎంతో తెలుసా..
Yadadri Hundi Counting: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీని అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. గత ఇరవై రోజుల్లో భక్తులు ఇచ్చిన కానుకలను లెక్కించిన ఆలయ అధికారులు సుమారుగా కోటి 84 లక్షలకు పైగా నగదు రూపంలో ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా బంగారం, వెండి ఇతర దేశాల కరెన్సీ కూడా భక్తులు యాదాద్రీశునికి సమర్పించారు. మరోవైపు రథసప్తమి, నరసింహ స్వామి ఆలయ వార్షిక అధ్యయణోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Yadadri Hundi Counting: యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గత 20 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. కోటి 84 లక్షల 84వేల 891రూపాయలు నగదను భక్తులు కానుకుల రూపంలో నరసింహ స్వామికి సమర్పించారని పేర్కొన్నారు. నగదుతో పాటు 144 గ్రాముల బంగారం, 2 కిలోల 850 గ్రాముల వెండి సమర్పించారు. హుండీల్లో విదేశీ కరెన్సీ సైతం వచ్చినట్టు తెలిపారు. వాటిలో అమెరికా దేశానికి చెందిన 1024 డాలర్లు, యూఏఈ 210 దిరామ్స్, ఆస్ట్రేలియా 145 డాలర్స్ ఇతర దేశాల కరెన్సీ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
రథసప్తమి వేడుకలు: యాదాద్రిలో ఈ నెల 28వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచనారసింహుల సన్నిధిలో తొలిసారిగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో గీత, ప్రధాన పూజారి లక్ష్మీనరసింహాచార్య తెలిపారు. వేడుకల నిర్వహణ కోసం సూర్యప్రభ ఆసనం, రథాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. స్వామి ఊరేగింపు కోసం ఇప్పటికే సూర్య ప్రభ వాహనాన్ని సిద్ధం చేయగా.. మరోవైపు ఆలయ ప్రాకార మండపాలు, మాడ వీధులు శుద్ధి ప్రక్రియ చేపడుతున్నారు.
ఆలయ వార్షిక అధ్యయణోత్సవాలు: అంతేకాకుండా క్షేత్రానికి కొండకింద అనుబంధ పాతగుట్టలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక అధ్యయణోత్సవాలు ఈ నెల 27న మెదలై.. 30 వరకు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. వైష్ణవ ఆలయాలలో ప్రతిఏటా సంప్రదాయంగా నిర్వహించే నాలుగు రోజుల అధ్యయనోత్సవాలలో ప్రబంధ పఠనం, అలంకార పర్వాలను చేపడతారు.
Shivratri celebrations in Yadadri: పిమ్మట వార్షిక బ్రహ్మోత్సవాలను ఇదే నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తారు. వారం రోజులు పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో తొలిరోజు స్వస్తివాచనం కార్యక్రమంలో మొదలుపెట్టి చివరిరోజు చక్రతీర్థం కార్యక్రమంలో మూలవరులకు శతఘటాభిషేకం నిర్వహించి ముగిస్తారు. కొండపైనే గల శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఫిబ్రవరి 15 తేదీ నుంచి వరుసగా ఆరురోజులు ఉంటాయని తెలిపారు. అదే నెల 20న మహా పూర్ణాహుతి, త్రిశూల తీర్థ మహోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్టగుట్ట జాతర..: పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రమైన యాదాద్రిలో ఆలయ దేవుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే నెల 21న శ్రీకారం చుట్టి .. పదకొండు రోజుల పాటు పాంచారాత్రాగమ విధానాలతో కొనసాగిస్తారు. అంతే కాకుండా మార్చి1న దివ్యవిమాన రథోత్సవ వేడుక, 2న చక్రతీర్థం, 3న మూలవరులకు విశిష్ట అభిషేకం నిర్వహించనున్నట్లు యాదాద్రి దేవస్థానం తెలిపింది. భక్తులు పై సమాచారం తెలుసుకొని యాదాద్రి దర్శనం చేసుకొగలరని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
