Baswapur project compensation: పరిహారం తగ్గితే భూములియ్యం.. బస్వాపూర్​ నిర్వాసితుల ఆందోళన

author img

By

Published : Oct 13, 2021, 3:25 PM IST

Baswapur project compensation

పరిహారం తగ్గిస్తే భూములు ఇచ్చేది లేదని బస్వాపూర్ జలాశయ నిర్వాసితులు(Baswapur project compensation) తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన మెమో ప్రకారం... జనరల్ అవార్డు మేరకు పరిహారం ఇస్తామంటే ఒప్పుకోబోమని స్పష్టం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇచ్చిన విధంగా ఎకరాకు 15 లక్షల 60 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. LOOK

కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా నృసింహ జలాశయమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్ ప్రాజెక్టుకు నిర్వాసితుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. పరిహారం నిధులు రాకపోవడంతో ఈ పనుల గడువును గత జూన్ నుంచి పెంచుకుంటూ పోతున్నారు. లక్షా 88 వేల ఎకరాలకు నీరందించేందుకు గాను 11.39 టీఎంసీల సామర్థ్యంతో రూ. 1,610 కోట్లతో పనులు ప్రారంభించారు. 4,200 ఎకరాలకు గాను ఇప్పటివరకు 1,836 ఎకరాల భూమిని సేకరించారు.

పరిహారం తగ్గితే భూములియ్యం.. బస్వాపూర్​ నిర్వాసితుల ఆందోళన

పరిహారం కేటాయించినా..

రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో పరిహారం డబ్బును చెల్లించకపోవడంతో నిర్వాసితులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారం, పునరావాసం ప్యాకేజీ కింద ముంపు గ్రామాలైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఎన్ తిమ్మాపూర్‌కు రూ. 130 కోట్లు... లప్పనాయక్ తండాకు వంద కోట్లు... చౌక్లా తండాకు 80 కోట్లు అవసరమని గతంలోనే గుర్తించారు. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం దక్కకపోవడంతో భూములు కోల్పోయిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం కింద మాకు ఇంతవరకూ డబ్బులు రాలేదు. పక్క గ్రామాలకు ఓ విధంగా ఇస్తే మా ఊరికి మరో విధంగా ఇస్తామంటున్నారు. మూడేళ్ల కింద కొందరికి 400 ఎకరాలకు రూ. 15 లక్షల 60వేలు చొప్పున ఇచ్చారు. ఇప్పుడు 12లక్షలే ఇస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం. ముంపు గ్రామాలకు సీఎం కేసీఆర్​ అన్యాయం చేస్తున్నారు. కొందరు భూములిచ్చిన వారికి ఇంతవరకూ పరిహారం రాలేదు. ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీ కోసం కలెక్టర్​కు వినతి పత్రాలు ఇచ్చాము. ఇంతవరకూ పట్టించుకోలేదు. ముంపు గ్రామాలు కావడంతో వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. అందరికీ ఒకేసారి డబ్బులివ్వాలని వేడుకుంటున్నాము. -నిర్వాసితులు, బీఎన్ తిమ్మాపూర్​

బస్వాపూర్ జలాశయం ద్వారా... లప్పనాయక్ తండా, చౌక్లా తండా, బీఎన్ తిమ్మాపూర్ గ్రామాలు పూర్తిగా కనుమరుగవుతాయి. అటు బస్వాపూర్, వడపర్తి గ్రామాల్లో... వ్యవసాయ భూములు ముంపు బారిన పడుతున్నాయి. జనరల్ అవార్డు కింద ఎకరాకు రూ. 13 లక్షల 34 వేలు చెల్లిస్తామని యంత్రాంగం చెబుతుండగా... గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 15 లక్షల 60 వేలు ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

పునరావాసానికి టెండర్లు కరవు

వడపర్తి వద్ద పునరావాసం కల్పించాలని బీఎన్ తిమ్మాపూర్ వాసులు కోరుతుంటే... హుస్నాబాద్ వద్ద కల్పిస్తామని అధికారులు అంటున్నారు. హుస్నాబాద్ వద్ద పునరావాసానికి గాను మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికే రూ. 50 కోట్లు కేటాయించగా... అందులో రూ. 30 కోట్లకు టెండర్లు పిలిస్తే ఎవరూ రాలేదని అధికారులు తెలిపినట్లు గ్రామస్థులు వివరించారు.

న్యాయం చేయాలని విజ్ఞప్తి

ప్రస్తుతానికి బస్వాపూర్ ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఆందోళనతోనే ఉన్న నిర్వాసితులు పరిహారం అందకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చదవండి: Cannabis Cultivation: పత్తి పంటలో గంజాయి సాగు.. విత్తనాలెక్కడివి? సూత్రధారులెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.