ఆ ఊరు.. మానవత్వానికి మరో రూపం.. కారుచీకట్లలో 'కాంతి'దీపం

author img

By

Published : Sep 18, 2022, 7:07 AM IST

ఆ ఊరు.. మానవత్వానికి మరో రూపం.. కారుచీకట్లలో 'కాంతి'దీపం

eye donations in muchharla: మనిషి పుట్టుకతో వచ్చిన ఏదైనా అవయవం పనిచేయకపోతే.. కష్టమైనా ఎలాగోలా బతికేయొచ్చు. కానీ.. సర్వేంద్రియాలలో ప్రధానమైన నయనాలు లేకుంటే మాత్రం సర్వం అంధకారమే. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపటమంటే పునర్జన్మ ప్రసాదించినట్లే. ఇదే ఆశయంతో ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఓ ఊరే కదిలింది. కారు చీకట్లు కమ్ముకున్న అభాగ్యుల జీవితాల్లో నేత్రదానంతో వెలుగులు నింపుతోంది. అందుకే.. ఆ ఊళ్లో ఎవరు మరణించినా వారి కళ్లు మాత్రం సజీవంగా లోకాన్ని చూస్తున్నాయి. మానవత్వంలో మాకు సాటిలేరని నిరూపించుకుంటున్న ఆ ఊరి గొప్పతనం తెలుసుకోవాలంటే ఓరుగల్లు వెళ్లాల్సిందే.

ఆ ఊరు.. మానవత్వానికి మరో రూపం.. కారుచీకట్లలో 'కాంతి'దీపం

eye donations in muchharla: 'సర్వేంద్రియానాం నయనం ప్రదానం' అంటుంటారు. కంటి చూపు లేకపోతే.. ఆ వేదన మాటల్లో వర్ణించలేం. ప్రత్యక్షంగా అనుభవించిన వారికి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. ప్రమాదాలకు గురైనప్పుడు.. జబ్బుల బారిన పడుతూ, నిత్యం ఎంతో మందికి కంటిచూపు దూరమవుతుంది. అలాంటి వారికి కళ్లు దానం చేయటమంటే.. వారికి మరో జన్మ ఇచ్చినట్లే. కానీ.. నేత్రదానంపై అవగాహన కొరవడి.. చనిపోయిన తర్వాత కళ్లుదానం చేసే అవకాశం ఉన్నా.. చాలా మంది ముందుకు రాని పరిస్థితి. ఎక్కడో ఒక్కరు, ఇద్దరు వచ్చినా.. అవసరమైన స్థాయిలో నేత్రాలు అందక అవకాశమున్నా ఎందరో జీవితాలు అంధకారంలోనే మగ్గుతున్నాయి. అలాంటి వారికి లోకాన్ని చూపించేందుకు మా నయనాలు సిద్ధంగా ఉన్నాయంటోంది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్ల గ్రామం.

ఉన్న ఊళ్లో మూడొంతులకు పైగా వ్యవసాయ కుటుంబాలే. పెద్ద చదువులు చదవకున్నా.. పెద్ద ఉద్యోగాలు చేయకున్నా.. ఈ గ్రామంలో ఉన్న వారందరివీ పెద్ద మనసులే. నేత్రదానంపై ఎంతో అవగాహన ఉన్న ముచ్చర్లలో ఎవరు చనిపోయినా వారి కళ్లు దానం చేయటం సంప్రదాయంగా మారింది. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇప్పటి దాకా 52 మంది తమ కళ్లను దానం చేశారు. వారు చనిపోయి కూడా.. వందలాది మంది జీవితాలకు వెలుగులు అందించారు.

ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ..: ఆదర్శ భావాలున్న విశ్రాంత ఇంజినీర్‌ మండల రవీందర్‌ అనే వ్యక్తి.. తల్లిదండ్రుల నేత్రాల దానంతో ఈ మహాదానానికి బీజం పడింది. తొమ్మిదేళ్ల క్రితం చనిపోయిన తన తల్లిదండ్రుల కళ్లను రవీందర్‌ తొలిసారిగా దానం చేయించి.. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచారు. చనిపోయిన తర్వాత మన కళ్లు మరొకరికి ప్రపంచాన్ని చూపిస్తాయంటూ.. ఊళ్లో వారికి అవగాహన కల్పిస్తూ వచ్చిన రవీందర్‌.. ఇందుకోసం నిరంతరం తపించాడు. ఇలా ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ.. మహా నేత్రదానంలో భాగస్వాములవుతున్నారు.

6 పదులు దాటిన వయస్సు వారు సైతం..: రవీందర్‌కు ఆరంభంలో మహిళలు, కొంతమంది వృద్ధులు బాసటగా నిలిచారు. ఇలా క్రమంగా ఒక్కొక్కరు నాలుగైదు కుటుంబాలతో మాట్లాడి.. నేత్రదానం చేయించటం ఆనవాయితీగా మారింది. నేత్రదానం చేస్తామన్న వారి సంఖ్య గ్రామంలో క్రమేపీ పెరుగుతూ వచ్చింది. 6 పదులు దాటిన వయస్సు వారు సైతం.. ఉత్సాహంగా కళ్లను దానం చేస్తామంటూ అంగీకారపత్రాలు రాసిచ్చారు. కుటుంబసభ్యులు, బంధువులు ఎవరైనా చనిపోయినా వెంటనే సమాచారం తెలియజేసి కళ్లను దానం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. దానం చేసిన వారికి ధ్రువపత్రాలు కూడా ఇస్తుండటంతో చాలామంది ముందుకు వస్తున్నారు.

నేత్రదానంపై అవగాహన పెరగాలి..: ఇప్పటి వరకూ ఎక్కువ సంఖ్యలో కళ్లను దానం చేసిన గ్రామంగా ముచ్చర్ల నిలుస్తోందని.. శరీర అవయవ, నేత్ర దానం సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి చెబుతున్నారు. గ్రామస్థుల చైతన్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న ఆయన.. వారి సహకారం మరిచిపోలేమంటున్నారు. ముచ్చర్ల గ్రామస్థుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో నేత్రదానంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చేసే ఈ సాయంతో.. మనం చనిపోయినా మన కళ్లు మాత్రం మరొకరికి లోకాన్ని చూపిస్తాయి.

ఇవీ చూడండి..

ఆదిలాబాద్ అడవుల్లో ఆటలమ్మ అలజడి..

CCTV Video: ఘోర రోడ్డు ప్రమాదం.. గర్భస్థ శిశువు సహా ముగ్గురు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.