హనుమకొండలో ఐదు రోజుల క్రీడా పండుగ.. సాయంత్రం ప్రారంభం

author img

By

Published : Sep 15, 2021, 4:53 AM IST

హనుమకొండలో ఐదు రోజుల క్రీడా పండుగ.. సాయంత్రం ప్రారంభం

చారిత్రక నగరంలో ఐదు రోజుల క్రీడా పండుగ మొదలవుతోంది. నేటి నుంచి హనుమకొండ జేఎన్ఎస్ మైదానంలో 60వ జాతీయ అథ్లెటిక్ ఓపెన్ ఛాంపియన్ షిప్​ పోటీలు ప్రారంభమౌతున్నాయి. ఇప్పటికే 23 రాష్ట్రాల నుంచి అథ్లెట్లు నగరానికి చేరుకున్నారు. సాయంత్రం క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు.

60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీల సందర్భంగా హనుమకొండ జె.ఎన్.ఎస్. మైదానం క్రీడాకారులతో కళకళలాడుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అథ్లెట్లతో మైదానం మినీ భారతంలా కనబడుతోంది. ట్రాక్​పై చిరుతల్లా పరుగులు పెడుతూ.. అథ్లెట్లు కఠోర సాధన చేస్తున్నారు. వరంగల్​కు రావడం, పోటీల్లో పాల్గొనడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సంయుక్త సహకారంతో తెలంగాణ వరంగల్ అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలో తొలిసారిగా నిర్వహిస్తుండటంతో పండుగ వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన 27 మంది అథ్లెట్లతో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన 573 మంది క్రీడాకారులు పోటీల్లో పతకాల కోసం పోటీ పడుతున్నారు. అథ్లెటిక్ సంఘాల తరఫున 253 మంది ప్రతినిధులూ.. ఈ పోటీలకు హాజరవుతున్నారు. వంద, 200 వందల మీటర్ల పరుగు, హై జంప్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, డిస్కస్​ త్రో, పోల్ వాల్ట్, షాట్ పుట్, రేస్ వాక్, మిక్స్డ్​ రిలే తదితర 48 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. మైదానంలో రూ.7 కోట్ల 86 లక్షలతో క్రీడాకారుల కోసం రూపుదిద్దుకున్న సింథటిక్ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విద్యుద్దీప కాంతులతో స్టేడియం పరిసరాలు దగదగలాడుతున్నాయి.

5 గంటలకు ప్రారంభం..

రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాయంత్రం 5 గంటలకు పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామని.. వరంగల్​ పేరు నలుదిశలా వ్యాపించేలా పోటీలు జరుపుతామని నిర్వాహకులు చెబుతున్నారు.

తొలిరోజు 13 ఈవెంట్లలో పోటీలు..

తొలిరోజు 13 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి. కొవిడ్​ను దృష్టిలో ఉంచుకుని.. క్రీడాకారులు 72 గంటల ముందే నెగెటివ్ రిపోర్ట్స్​తో సిద్ధమయ్యేలా నిబంధనలు విధించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బృందాల సాంస్కతిక ప్రదర్శనలు.. క్రీడాకారులను అలరించనున్నాయి.

ఇదీ చూడండి: వచ్చే ఏడాది నుంచి మండపంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.