నాడు 600 ఎకరాల ఆసామి.. నేడు కిరాయి ఇంట్లో వారసులు

author img

By

Published : Aug 12, 2022, 10:03 AM IST

Bhupathi Krishnamurthy family

నాడు 600 ఎకరాల ఆసామి.. కానీ ఇప్పుడు పరిస్థతి తలకిందులైంది. ఆయన వారసులు నేడు కిరాయి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భారత స్వాతంత్య్రోద్యమ గళం వినిపించి తెలంగాణ గాంధీగా గుర్తింపు పొందిన భూపతి కృష్ణమూర్తి వారసుల దీనావస్థ. పూర్వ వరంగల్‌ జిల్లా ముల్కనూరులో జన్మించిన ఆయనకు వారసత్వంగా సంక్రమించిన దాదాపు 600 ఎకరాల భూమిని స్వాతంత్య్ర పోరాటానికి ధారాదత్తం చేశారు.

భారత స్వాతంత్య్రోద్యమ గళం వినిపించి తెలంగాణ గాంధీగా గుర్తింపు పొందారు భూపతి కృష్ణమూర్తి. పూర్వ వరంగల్‌ జిల్లా ముల్కనూరులో జన్మించిన ఆయనకు వారసత్వంగా సంక్రమించిన దాదాపు 600 ఎకరాల భూమిని స్వాతంత్య్ర పోరాటానికి, తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాలకు ధారాదత్తం చేశారు. మాజీ ప్రధాని పీవీ.నరసింహారావు, ఎన్టీఆర్‌ వరంగల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టికెట్లను ఇచ్చేందుకు ప్రయత్నించగా.. తృణప్రాయంగా వదులుకున్నారు. అలాంటి సమరయోధుడి కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో యాతన పడుతోంది.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వందల ఎకరాల ఆసామి అయిన భూపతి కృష్ణమూర్తి కుటుంబం గత పాతికేళ్ల నుంచి కిరాయి ఇంట్లోనే కాలం వెళ్లదీస్తోంది. ఆయన వారసుడు శ్యాంసుందర్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2015లో భూపతి కృష్ణమూర్తి మరణానంతరం ఆ కుటుంబం మరింత ఆర్థికంగా ఇబ్బందులకు గురైంది. అప్పటివరకు వచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ నిలిచిపోవడంతో ఇంటి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. ఆర్థిక సమస్యలతోనే 2020 నవంబరులో శ్యాంసుందర్‌, 2021 మే నెలలో ఆయన భార్య వసుంధర మరణించారు. అప్పటినుంచి కుటుంబ భారమంతా కుమారుడు భూపతి పున్నంచందర్‌ పైనే పడింది. మరో కుమారుడు శ్రీచంద్‌ మానసిక వికలాంగుడు. ఆయన బాధ్యతలను పున్నంచందర్‌ స్వీకరించాల్సి వచ్చింది. సీకేఎం కళాశాలలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న పున్నంచందర్‌కు వచ్చే తక్కువ వేతనంతో కుటుంబం గడవలేక.. కిరాయి చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు.

అద్దె ఇంట్లో ఉన్న కృష్ణమూర్తి మనుమడు, వారి కుటుంబ సభ్యులు

ఇచ్చిన హామీలు మరిచిపోయారు..
స్వరాష్ట్రం చూసిన తర్వాతే కన్నుమూస్తానని వాగ్దానం చేశారు ఆయన. 2014 జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాతే 2015 ఫిబ్రవరి 15న అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో వారి ఆర్థిక పరిస్థితిని కళ్లారా చూసిన ప్రముఖులు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ లాంఛనాలతో సమరయోధుడికి వీడ్కోలు పలికి.. అనంతరం వారికి ఇచ్చిన హామీలను మాత్రం మర్చిపోయారు.

* భూపతి కృష్ణమూర్తి బతికున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సూచనలడిగిన వారు, రాష్ట్రం వచ్చాక ఆయన మీరే స్పూర్తి అని పొగిడిన వారు.. ఆయన మరణాంతరం ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన వారు ఇప్పుడు కనిపించడంలేదు.

* 2015లోనే ప్రభుత్వం హనుమకొండ జూపార్కు ఎదురుగా 250 గజాల స్థలం కేటాయించింది. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికే తమవద్ద డబ్బుల్లేవని వాపోతున్నారు. ఇటీవల ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించగా.. వారి కుటుంబ సభ్యులే చందాలు వేసుకుని కంచె వేయించారు.

* తాత చేసిన త్యాగానికి గుర్తుగా కనీసం సీకేఎం కళాశాలలో తాత్కాలిక ఉద్యోగాన్ని పర్మినెంట్‌ చేయించాలని కోరినా ప్రజాప్రతినిధులు స్పందించడంలేదని కృష్ణమూర్తి మనమడు భూపతి పున్నంచందర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

గాంధీజీతో భూపతి కృష్ణమూర్తి

ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి- అంపశయ్య నవీన్‌, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
తెలంగాణ గాంధీగా పేరొందిన భూపతి కృష్ణమూర్తి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. స్వరాష్ట్ర ఆలోచనలకు బీజం వేసిన ఆయన కుటుంబం సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేలా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఇంటిని నిర్మించి ఇవ్వాలి. వారు ఆర్థికంగా నిలబడేలా అన్ని రకాలుగా సాయమందించాలి.

ఇవీ చదవండి: ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి

భర్తకు తెలియకుండా భార్య రెండో వివాహం.. అవి ఇవ్వకుండానే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.