Veg Crop: సాంప్రదాయ సాగును వీడి... కొత్త పంటల సాగుతో లాభాల బాటలో

author img

By

Published : Jul 31, 2021, 5:01 AM IST

Veg Crop

రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా ఆ రైతులు సాంప్రదాయ పంటల సాగును వీడారు. వరి, వేరుశనగ లాంటి పంటల్ని వదిలి ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు చేపట్టారు. రైతులను ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ సైతం వివిధ పథకాల కింద రాయితీలు అందించింది. ఫిబ్రవరి నుంచి కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టిన రైతులు తొలి ప్రయత్నంలోనే లాభాలు చవిచూస్తున్నారు. సాంప్రదాయ పంటలతో పోల్చితే కూరగాయల సాగు అత్యంత లాభదాయకంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి క్లస్టర్​లో 100 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కూరగాయల సాగు సత్ఫలితాలిస్తోంది. ఈ స్ఫూర్తితో మరికొంత మంది రైతులు కూరగాయల సాగువైపునకు మొగ్గుచూపున్నారు.

Veg Crop: సాంప్రదాయ సాగును వీడి... కొత్త పంటల సాగుతో లాభాల బాటలో

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామంలోని రైతులంతా వరి, వేరుశనగ లాంటి సాంప్రదాయ పంటల్నే ఎక్కువగా సాగుచేస్తూ ఉంటారు. కానీ ఏళ్లుగా సాంప్రదాయ పంటల సాగు ద్వారా వస్తున్న లాభాలు అంతంత మాత్రమే. అలా కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ఏడాదికి కనీసంగా రూ. 3 నుంచి 4 లక్షల ఆదాయాన్ని ఆర్జించడమే కొత్త పంటల్ని వేయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కూరగాయల సాగు (Vegitable Crop)ను ఎంచుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ యాస్మిన్ బాషా దృష్టికి తీసుకువెళ్లగా, వారికి కావాల్సిన సహకారాన్ని అందించాల్సిందిగా ఉద్యానశాఖను ఆదేశించారు.

నవంబర్​లో సమావేశం...

ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి సైతం చిన్నమందడి గ్రామాన్ని సందర్శించి రైతులతో గత నవంబర్​లో సమావేశమయ్యారు. ఈ మేరకు పెద్దమందడి క్లస్టర్ పరిధిలో 100 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు చేపట్టాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ముందుకొచ్చిన 40 మంది రైతులకు సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ కింద 50 శాతం రాయితీపై మల్చింగ్, 90శాతం రాయితీతో బిందు సేద్యం, 80శాతం రాయితీపై మొక్కలు అందించారు.

తొలిదశలో చిన్నమందడి, అల్వాల్, చీకురుచెట్టుతండా, దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 40ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేపట్టారు. ప్రధానంగా టమాటా, వంకాయ, బెండ, దొండ, మిరప, చిక్కుడు లాంటి పంటల్నివేశారు. ఇన్నేళ్లూ సంప్రదాయ పంటల్ని సాగు చేసిన రైతులు, వాటితో పోల్చితే కూరగాయల సాగులోనూ మంచి లాభాలున్నాయని చెబుతున్నారు.

సాగులో మెళకువలు...

కేవలం రాయితీలు అందించి వదిలి వేయకుండా ఉద్యానశాఖ అధికారులు సాగులో మెళకువళల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మొజర్లలోని ఉద్యాన కళాశాల అధ్యాపకులు, శాస్త్రవేత్తలు వారానికోసారి ఒక్కో గ్రామంలో కూరగాయల తోటల్ని సందర్శించి అవసరమైన సలహాలు, సూచనలిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి సాగు ప్రారంభించగా 3 నెలల నుంచి దిగుబడులు చేతికి అందుతున్నాయి. టమాట, వంకాయ, బెండ, దొండ, చిక్కుడు, మిరప పంటల్ని కోసి వనపర్తి జిల్లా కేంద్రంలో టోకు ధరలకు కొందరు విక్రయిస్తున్నారు.

చిల్లర ధరలతో పోల్చితే రూ. 10 తక్కువకే టోకుగా అమ్మేస్తున్నారు. కొంతమంది రైతులు స్వయంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే సోలిపురం, వనపర్తి, బలిజపల్లి లాంటి వారాంతపు సంతలు, మార్కెట్లలో చిల్లర ధరలకు విక్రయిస్తున్నారు. అలారోజుకు అన్నిఖర్చులు పోనూ రోజుకూ కనీసంగా వెయ్యి ఆదాయం వస్తోందని రైతులు చెబుతున్నారు. అంటే నెలకు సుమారు 30వేల వరకూ ఆదాయం పొందుతున్నారు.

రూ. 3 లక్షల వరకు...

చిన్నమందడి రైతు సూర్యాచంద్రారెడ్డి దొండ ఎకరా, టమాటా ఎకరా, మిరప అరెకరం సాగు చేశారు. ప్రూనింగ్, మల్చింగ్, స్టేకింగ్, డ్రిప్ లాంటి పద్ధతులను సాగులో అమలు చేశారు. ఎకరానికి రూ. లక్షన్నర ఖర్చు చేశారు. టమాటాలో మంచి దిగుబడులు సాధించారు. కిలో రూ. 20 చొప్పున రెండు రోజులకోసారి తెంపిన టమాటాలు వనపర్తి మార్కెట్​లో విక్రయిస్తున్నారు. మరో 4 నెలల పాటు దిగుబడులు రానున్నాయి. ఎకరాకు లక్షన్నర రూపాయలు ఖర్చు చేస్తే పంటకాలం ముగిసే సమయానికి రూ. 3 లక్షల వరకూ ఆదాయం వస్తుందని, ఖర్చులు పోను లక్షన్నర రూపాయలు లాభం ఉంటుందని సూర్యాచంద్రారెడ్డి తెలిపారు.

ఆదాయం అధికం...

ఆదాయం బాగానే ఉన్నా.. పంటను అమ్ముకునేందుకు మాత్రం రైతులు కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వనపర్తి జిల్లాలో రోజుకు 120 టన్నులకు పైగా కూరగాయలు అవసరమని, జిల్లాలో పండించే కూరగాయలు ఈ అవసరాల్ని తీర్చలేకపోతున్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. డిమాండ్​కు తగిన సరఫరా లేనందున కూరగాయలు సాగు చేస్తే నష్టం లేదనేది వారి వాదన. వనపర్తి జిల్లా నేలలు, వాతావరణం కూరగాయలకు అనుకూలమని, సంప్రదాయ పంటలతో పోల్చితే ఆదాయమూ అధికమని సూచిస్తున్నారు.

విజయవంతమైతే...

ప్రస్తుతం 50 ఎకరాల్లో తొలిదశలో సాగు చేస్తుండగా... మరో 50 ఎకరాల్లో రెండోదశలో సాగు చేయనున్నారు. మొత్తంగా ఏడాదంతా రైతులకు నెలకు రూ. 30 నుంచి 40 వేలకు మించకుండా ఆదాయం పొందాలన్న లక్ష్యంతో రైతులు శ్రమిస్తున్నారు. వనపర్తి జిల్లా మొత్తంలో కూరగాయలు సాగవుతున్నది కేవలం 200 ఎకరాల్లో మాత్రమే. ఈ ప్రయోగం విజయవంతమైతే... ఆ స్పూర్తితో జిల్లాలో కూరగాయల సాగు పెంచాలని ఉద్యానశాఖ భావిస్తోంది.

ఇదీచూడండి: Hyd Parking Problem: వాహనదారులకు శుభవార్త.. ఇక నుంచి పార్కింగ్​ సమస్య లేనట్టే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.