Rain problems: 'భారీ వర్షాలు వస్తే.. మాకు చావే శరణ్యం'

author img

By

Published : Jun 27, 2021, 11:59 AM IST

Updated : Jun 27, 2021, 12:17 PM IST

ఏదుల రిజర్వాయర్‌ ముంపు బాధితుల

ఏదుల రిజర్వాయర్‌ ముంపు బాధితుల కోసం నిర్మించిన తాత్కాలిక పునరావాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వాపోయారు. రిజర్వాయర్ నిర్మాణంతో తమ గ్రామాన్ని పూర్తిగా కోల్పోతున్నామని... తమకు శాశ్వత పునరావాసాన్ని ఏర్పాటు చేయాలని బండ రవిపాకుల గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని ఏదుల రిజర్వాయర్ ముంపు గ్రామమైన బండరవిపాకుల గ్రామస్థుల కోసం... ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాసాల్లోకి వర్షపునీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు స్థానికులు తెలిపారు. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాసం లోతట్టు ప్రాంతంలో ఉండడంతో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా జలమయమైంది.

ఇళ్లల్లోకి సైతం వర్షపు నీరు చేరడంతో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో తమ గ్రామాన్ని కోల్పోతున్నామని... తమకు శాశ్వత పునరావాసాన్ని ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులను కోరిన పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక పునరావాసాల్లోకి నీరు చేరడం... వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని అన్నారు. భారీ వర్షాలు వస్తే తమకు చావే శరణ్యమని వాపోతున్నారు. విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటుచేసిన స్తంభాలు తీగలు ఇళ్ల మధ్యలో నుంచి ఉన్నాయని తెలిపారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోందన్నారు.

తమకు శాశ్వత పునరావాసాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ చుట్టూ పలుమార్లు తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని బండరవిపాకుల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు శాశ్వత ఇంటి నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని కోరారు.

"చిన్న వర్షాలకే మా బతుకులు ఇలా తయారయ్యాయి. ఇక భారీ వానలు పడితే మా పరిస్థితి ఏంటి. ఇళ్లలోకి వచ్చిన మోకాలెత్తు నీటిలో వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం, ఉప్పు, పప్పులు మెుత్తం నీటిలో మునిగిపోయాయి. అధికారులు మాపై ఎందుకు చిన్నచూపు చుస్తున్నారు. మేము ఇదే నీటిలో మునిగి చావాలని ఉందా? భారీ వానలు పడితే చావే శరణ్యంలా మా బతుకులు ఉన్నాయి. కరెంటు తీగలు సైతం కిందకు ఉండడంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది. మాకు శాశ్వత ఇంటి నిర్మాణాలు చేపట్టి న్యాయం చేయండి" - ముంపు బాధితులు

ఇదీ చదవండి: చరిత్రను మేలు మలుపు తిప్పిన రాజనీతిజ్ఞుడు 'పీవీ'

Last Updated :Jun 27, 2021, 12:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.