రైతుల పేరిట రుణాలు తీసుకుని బ్యాంకును కొల్లగొట్టారు

author img

By

Published : Aug 16, 2022, 9:56 AM IST

Fake Passbooks in Wanaparthy

Fake Passbooks in Wanaparthy వనపర్తి జిల్లా ఆత్మకూరు సహకార సంఘంలో నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు కొల్లగొట్టారు. రైతులకు ఏ మాత్రం సంబంధం లేకుండా అప్పులు తీసుకున్నారు. బ్యాంకు నుంచి నోటీసులు రావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నిందితులను పట్టుకుని శిక్షించకుండా తమను రుణాలు కట్టమని నోటీసులు ఇవ్వడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు.

Fake Passbooks in Wanaparthy వనపర్తి జిల్లా ఆత్మకూరు, రేచింతల మండలాల్లో అక్రమార్కులు రైతుల పాసుపుస్తకాలనే లక్ష్యంగా చేసుకున్నారు. అన్నదాతల పేరిట నకిలీ పాసుపుస్తకాలను సృష్టించి రుణాల పేరుతో భారీగా నగదు కొల్లగొట్టారు. ఆత్మకూరుకు చెందిన... గొల్ల చెన్నమ్మకు జూర్యాల శివారులో వ్యవసాయ పొలం ఉంది. 2011 జూన్ 8న 90 వేలు గొర్రెల కోసం రుణం తీసుకున్నట్లు.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు నోటీసులు ఇచ్చారు. 2020 సెప్టెంబరు నాటికే వడ్డీతో కలిపి మొత్తం 2 లక్షల 38 వేల 997 బకాయి ఉన్నట్లు నోటీసులో పేర్కొన్నారు.

Loans with Fake Passbooks in Wanaparthy దీంతో ఆమె లబోదిబోమంటూ ఆత్మకూరు సింగిల్‌విండోలో సంప్రదించగా.. దస్త్రాల్లో ఆమె ఫోటో పెట్టి ముద్రవేసి రుణం తీసుకున్నట్లు ఉంది. అయితే తన పట్టాదారు పాసుపుస్తకం తన దగ్గరే ఉందని.. తాను ఎలాంటి రుణం తీసుకోలేదని చెన్నమ్మ చెబుతున్నారు. తనకు సంతకం చేయడం వచ్చని... ఎక్కడా వేలి ముద్ర వేయడం లేదన్నారు. వేలిముద్ర పరిశీలించిన సిబ్బంది అది తనది కాదని తేల్చారని తెలిపారు. నకిలీ పాసుపుస్తకంతో... పైరవీకారులు రుణం తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"మా పేరిట నకిలీ పాసుబుక్‌లు సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. బ్యాంకులేమో రుణాలు చెల్లించాలని మమ్మల్ని వేధిస్తున్నాయి. మేం రుణం తీసుకుందామంటే.. ఎవరో మా పేరిట తీసుకున్న రుణాన్ని చెల్లిస్తేనే రుణాలు ఇస్తామంటున్నారు. మమ్మల్ని ఎరగా వాడుకుని బ్యాంకును కొల్లగొట్టిన వారిని పోలీసులు వీలైనంత త్వరగా పట్టుకోవాలి. వారికి కఠిన శిక్ష విధించి మాకు న్యాయం జరిగేలా చూడాలి." - బాధిత రైతులు

గొల్ల చెన్నమ్మ తరహాలోనే.. సహకార సంఘం పరిధిలో అనేక గ్రామాలకు చెందిన పలువురి పేరిట నకిలీ పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక రుణాలతోపాటు పంట రుణాలను సైతం.. పైరవీకారులు కొల్లగొట్టారు. రుణాల మంజూరు విషయంలో కూడా సహకార శాఖ ఉద్యోగులు నిబంధనలను.. తుంగలో తొక్కారు. రేచింతల సహకార సంఘం పరిధిలోని ఆరేపల్లి, కత్తేపల్లి, వీరరాఘవపూర్.. తూంపల్లి, రేచింతల గ్రామాలు ఎస్బీఐ పరిధిలో ఉండేవి. రైతులకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పంట రుణాలను ఎస్బీఐ మంజూరు చేయాల్సి ఉండేది. అయితే పైరవీకారులు నిబంధనలను తుంగలో తొక్కి ఆత్మకూరు సహకార సంఘం ద్వారా రుణాలు మంజూరు చేయించుకున్నారు. అప్పు కట్టాలి అని బ్యాంక్ వారు నోటీసులు పంపుతున్నారని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆత్మకూరు సహకార సంఘం.. అక్రమాలలో సిబ్బంది పాత్ర ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.