Science Museum:సైన్స్ అంటే భయం ఎందుకు... రండి ప్రయోగాలతో పాఠాలు నేర్చుకుందాం!

author img

By

Published : Oct 4, 2021, 1:47 PM IST

Science Museum

పదిసార్లు చదివేకంటే ఒకసారి చూస్తే ఎక్కువ అర్థం అవుతుంది. ఇక కొన్ని సైన్స్ ప్రయోగాలైతే ఎన్నిసార్లు చదివినా అర్థం కావు. కానీ వాటిని కళ్లకు కట్టినట్టు చూపిస్తే.. అందులోని మర్మాలను విద్యార్థులు తమ మెదడులో నిక్షిప్తం చేసుకుంటారు. విద్యార్థులకు సైన్స్ పట్ల భయం పొగోట్టి వారికి ఆసక్తి పెంచేలా సంగారెడ్డి జిల్లా అధికారులు విన్నూత్న ప్రయత్నం చేశారు.

విద్యార్థులుకు సైన్స్ సబ్జెక్టుల పట్ల భయం రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. అందులోని సిద్ధాంతాలు, ప్రయోగాలు అర్థంకాక వాటి పట్ల ఆసక్తి అంతగా చూపించడంలేదు. దీనిని గుర్తించిన సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు ఆరు సంవత్సరాల క్రితం జిల్లా సైన్స్ కేంద్రం పేరుతో ఓ ప్రయత్నం మొదలు పెట్టారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు వారి పాఠ్యపుస్తకాల్లో ఉన్న వందలాది ప్రయోగాల నమూనాలు తయారు చేశారు. సైన్స్ సెంటర్​కు వచ్చిన విద్యార్థులే స్వయంగా ప్రయోగాలు చేసి అందులోని మర్మాలను తెలుసుకున్నారు.

సైన్స్ సెంటర్ ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వడంతో.. మరో అడుగు వేశారు. విజ్ఞానంతో వినోదం పంచాలన్న ఉద్దేశంతో... బిర్లా సైన్స్ మ్యూజియం సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి సైన్స్ మ్యూజియాన్ని సంగారెడ్డి పట్టణంలో నిర్మించారు. ఇందులో భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, అంతరిక్షం, గణితం, ఎలక్ట్రానిక్స్​కు సంబంధించిన ప్రధానమైన 58ప్రయోగాలు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులకు సైన్స్ మ్యూజియాలు ఉన్నా.. అందులో గణిత విభాగం అరుదే. ఇక్కడ పది ప్రయోగాలతో వంద సిద్ధాంతాలను వివరించేలా ప్రత్యేకంగా గణిత విభాగం ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో వచ్చే మొక్కలతో బోటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. మ్యూజియంను సందర్శించిన తర్వాత విద్యార్థులు సైన్స్​కు సంబంధించిన వీడియోలు చూడటానికి ప్రత్యేకంగా మిని థియేటర్ ఏర్పాటు చేశారు.

విద్యార్థుల కోసం సైన్స్ మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన విద్యాశాఖ అధికారులు

'ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న ప్రధాన ప్రయోగాలు, సిద్ధాంతాలను విద్యార్థులకు కళ్లకు కట్టేలా ఈ మ్యూజియం నిర్మించాము. సైన్స్‌ ఫెయిర్‌, సైన్స్ కాంగ్రెస్ వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనేలా ఈ మ్యూజియం ప్రోత్సహిస్తుంది. కొత్త ఆలోచనలు కల్పిస్తుంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ సైన్స్ మ్యూజియం ఆ రాష్ట్ర విద్యార్థులకు సైతం ఉపయోగపడనుంది. మ్యూజియం విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా ఉందని తల్లిదండ్రులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.' -విజయ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి

ఇదీ చదవండి: Telangana CM KCR : 'తెలంగాణ పర్యాటక ప్రగతిని పరుగులు పెట్టిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.